మీరేం హామీ పత్రాలిచ్చారు? | Differing views in Congress on Bee Farm | Sakshi
Sakshi News home page

మీరేం హామీ పత్రాలిచ్చారు?

Apr 19 2019 6:06 AM | Updated on Apr 19 2019 6:06 AM

Differing views in Congress on Bee Farm - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి పార్టీ మారబోమని హామీ పత్రాలు తీసుకోవాలన్న కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా తీసుకోవడం తప్పేమీ కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరమని టీపీసీసీ నాయకత్వం అంటుంటే క్షేత్రస్థాయిలో మాత్రం మరోరకమైన అభిప్రాయం వినిపిస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసుకుంటూ కష్టనష్టాలను ఎదుర్కొంటూ వస్తుంటే చిన్న పదవుల కోసం పోటీ చేయాలంటే తాము అఫిడవిట్‌ ఎందుకివ్వాలనే చర్చ మండల స్థాయి నేతల్లో నడుస్తోంది. అయినా పెద్దలకు ఓ పద్ధతి, మాకో పద్ధతి ఎలా ఉంటుందని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ హామీ పత్రాలిచ్చి బీఫారాలు తీసుకున్నారని, పార్టీ మారి రూ.కోట్లు దండుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇలా అఫిడవిట్లు అడగటం తమను అవమానపర్చడమేనని, నైతికంగా బలహీనం చేస్తుందని, ప్రత్యర్థి పార్టీలు కూడా దీన్ని వేరే విధంగా ప్రచారం చేస్తాయని వారంటున్నారు. పార్టీ మారడం లేదని ముందే మండల, జిల్లా నాయకులకు హామీ పత్రాలివ్వడం తమను అవమానపర్చుకోవడమేనని, అలాంటప్పుడు ఇన్నాళ్లు తాము పార్టీ కోసం చేసిన సేవకు గుర్తింపు ఏదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై నమ్మకం లేకనే పార్టీ హామీ పత్రం తీసుకుందని, పార్టీకే నమ్మకం లేనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఏం సమాధానం చెప్తారని కింది స్థాయి నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరం.. 
క్షేత్రస్థాయి నేతలు హామీ పత్రం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీపీసీసీ నాయకత్వం చెబుతోంది. చాలా చోట్ల గ్రామస్థాయి కార్యకర్తలే ఈ ప్రతిపాదనలు తీసుకువచ్చారని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని టీపీసీసీ ముఖ్య నేతలు చెపుతున్నారు. కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌ ఎవరూ అడగకుండానే తాను గెలిచినా పార్టీ మారబోనని ప్రజలకు అఫిడవిట్‌ ఇచ్చారని, అలా ఇవ్వడం ద్వారా పోటీ చేస్తున్న వారిలో జవాబుదారీతనం పెరుగుతుందని అంటున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన సమాచారం అఫిడవిట్‌ రూపంలో ఎలా ఇస్తామో ఇది కూడా అంతేనని, గతంలో మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి కూడా పార్టీ హామీ పత్రాలు తీసుకుందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఇది అత్యవసరమని, టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై చర్చ చేసేందుకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే భిన్నాభిప్రాయాలకు తావిస్తోన్న ఈ అఫిడవిట్‌ విధానం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సిందే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement