‘ప్రత్యేకం’లో పరిష్కారమయ్యేనా..!

Development Works Are Pending In Kamareddy - Sakshi

కామారెడ్డి పట్టణంలో పెండింగ్‌లో రూ. కోట్ల అభివృద్ధి పనులు

పురంలో ఆదాయ మార్గాలున్నా పట్టింపులేదు

ప్రత్యేకాధికారుల పాలనలో చొరవ చూపితే పరిష్కారం

గతంలో మున్సిపల్‌ శాఖలో పనిచేసిన కలెక్టర్‌

సాక్షి, కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యుల పాలన గడువు 2వ తేదీన ముగిసింది. ఐదేళ్ల కాలంలో తమ వంతుగా పాలకులు పట్టణాభివృద్ధికి పాటుపడ్డారు. కానీ పట్టణంలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా భారీగానే ఉన్నాయి. కోట్ల రూపాయలతో చేపట్టనున్న పాత, నూతన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా కౌన్సిల్‌ సభ్యులు పదవీకాలం ముగించుకుని గద్దెదిగారు.

ప్రస్తుతం ప్రత్యేకపాలన అధికారిగా కలెక్టర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ సత్యనారాయణ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు గతంలో మున్సిపల్‌ శాఖలోనే విధులు నిర్వహించారు. ఆయనకు మున్సిపల్‌ శాఖపై పూర్తిస్థాయిలో పట్టు ఉంది. ప్రత్యేక పాలనలో కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపిస్తే పెండింగ్‌ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

నిలిచిన రూ. 2 కోట్ల మురికాలువ, ఫుట్‌పాత్‌ పనులు
జిల్లా ఏర్పడిన తర్వాత పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాలువ, ఫుట్‌పాత్‌ నిర్మాణం కోసం టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ. కోటీ 99 లక్షలతో పనులను ఎమ్మెల్యే గతేడా జూలై 28న ప్రారంభించారు. అయితే కొత్త బస్టాండ్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు ఇరువైపులా తవ్వకాలు జరిపి పనులు పూర్తి చేయకుండానే నిలిపివేశారు. పనులు అర్ధం తరంగా నిలిచిపోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అదనపు టెండర్‌లతో ఖర్చు వ్యయం పెంచాలని, చేసిన పనుల బిల్లులు చెల్లించాలని ఈ పనులు నిలివేశారు. అయితే ఈ పనులను కౌన్సిల్‌లోని పాలకురాలి భర్తనే చేపడుతుండడం గమనార్హం.

స్లాటర్‌ హౌజ్, మటన్‌ మార్కెట్‌ ఊసేలేదు
2003లో ఐడీసీఎంస్‌ కేంద్ర నిధులు రూ. 63లక్షలతో సుభాష్‌రోడ్డులో 60కి పైగా దుకాణాలతో మటన్‌ మార్కెట్‌ సముదాయాలను నిర్మించారు. వాటికి టెండర్లు నిర్వహించకపోవడంతో ఇప్పటి వరకు అద్దెలు, అడ్వాన్స్‌ల రూపంలో రూ.2 కోట్లకుపైగానే బల్దియా ఆదాయం కోల్పోయింది. అలాగే రూ. 10 లక్షలతో సిరిసిల్ల రోడ్డులో జంతువధశాల నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం పెద్ద, చిన్నకసాబ్‌ గల్లి, బతుకమ్మకుంట తదితర ప్రాంతాలలో జనవాసాల మధ్య జంతువులను వధిస్తూ మాంసం విక్రయిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలలో జంతువుల కళేబరాలు, రక్తం మురికాలువల్లో, రోడ్లపై పడేయడంతో దుర్గధంతో స్థానికులు అవస్థలు పడుతూ, రోగాల బారిన పడుతున్నారు.

గాడితప్పిన పారిశుధ్యం
బల్దియాలో 5 ఏళ్లుగా సానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు లేకపోవడంతో ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని ఈ విభాగం అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే మురికికాల్వలు నిండి రోడ్లపైకి మురుగునీరు వస్తోంది. సుభాష్‌రోడ్డు, జేపీఎన్‌ రోడ్డు, అయ్యప్పనగర్, దళిత వాడ, ఇస్లాంపూర, విద్యానగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తోంది. జవాన్‌లను, కార్మికులకు ప్రణాళికాబద్ధంగా పనులు అప్పగించే వారు లేక సైతం పనులు సక్రమంగా జరగడం లేవు.

టౌన్‌ప్లానింగ్‌లో ఆరోపణలెన్నో..
పట్టణంలో పార్కింగ్‌ స్థలాలు లేకుండానే, సెల్లార్‌ అనుమతులు లేకుండానే జిల్లాకేంద్రంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేపట్టారు. నిజాంసాగర్‌ చౌరస్తాలో, నిజాంసాగర్‌ రోడ్, పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్‌ తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల్లో పార్కింగ్‌ స్థలాలు లేకున్నా, సెల్లార్‌లు లేకున్నా అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులపై అధికారులు, కౌన్సిల్‌ సభ్యులపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పాత బస్టాండ్‌లో సెల్లార్‌ అనుమతి లేదని స్వయంగా అధికారులు కూల్చివేయించినా మళ్లీ యధావిధిగా నిర్మాణాలు ఉన్నాయి.

నిజాంసాగర్‌ చౌరస్తాలో భవన నిర్మాణాలపై పార్కింగ్‌ స్థలాలు, సెల్లార్‌ అనుమతులు లేవని, ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్‌ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు కావడం లేదు. మార్కింగ్‌లు వేసి నోటీసులు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలులేవు. ఇళ్లలో ఇంకుడు గుంతలకు డబ్బులు వసూళ్లు చేసి ఇప్పటివరకు ఒక్క ఇంకుడు గుంత నిర్మాణానికి చర్యలు లేవు.

ఆదాయ మార్గాలున్నా..
జిల్లా కేంద్రంలో ట్రేడ్‌ లైసెన్స్‌లు, రెన్యూవల్‌ పేరి ట కేవలం యేటా రూ.3 నుంచి 4 లక్షలకు వర కు మాత్రమే ఆదాయం తీసుకొస్తున్నారు. కానీ జిల్లాకేంద్రంలో రైస్‌మిల్లులు, పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్, వ్యాపార సముదాయాలు, చిన్నపాటి వ్యాపార దుకాణాలు, షోరూంలు ఇలా 3 వేలకు పైగానే ఉంటాయి. అంటే ఏటా ట్రెడ్‌ లైసెన్స్‌ పేరిట సుమారు రూ. 20 లక్షల వరకు ఆదాయం సమకూర్చవచ్చు.

కానీ సానిటేషన్‌ విభాగంలో పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాన రోడ్లపై వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగ్, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపైనా ఏటా ఎలాంటి ఆదాయం సమకూరడం లేదు. మటన్‌ మార్కెట్‌ సముదాయం టెండర్లు చేయకపోవడంతో రూ. కోట్లతో ఆదాయం కోల్పోయింది. నిషేధిత ప్లాస్టిక్‌ బ్యాగులు విక్రయిస్తున్న జరిమానాలు వేయడం లేదు.

కలెక్టర్‌ చొరవ చూపితే..
కలెక్టర్‌ సత్యనారాయణ గతంలో మున్సిపల్‌ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహించారు. మున్సిపాలిటీపై ఆయనకు చాలానే అనుభవం ఉంది. ఈ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తే పెండింగ్‌ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, సానిటేషన్, నీటి విభాగం, వీధిలైట్లు, రెవెన్యూ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top