డెంగ్యూకి చికిత్సకన్నా ముందు నివారణ అవసరం | Dengue Cases At Hyderabad | Sakshi
Sakshi News home page

డెంగ్యూకి చికిత్సకన్నా ముందు నివారణ అవసరం

Sep 10 2019 10:14 PM | Updated on Sep 10 2019 10:27 PM

Dengue Cases At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వ్యాధుల నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో విడుదలైన నివేదికల ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో డెంగ్యూ వల్ల మరణించిన వారి సంఖ్య 50కు చేరింది.

దీని గురించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, హార్ట్‌కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌సీఎఫ్ఐ) అధ్యక్షులు డాక్టర్ కేకే అగర్వాల్ మాట్లాడుతూ 'ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న దోమకాటు వ్యాధి డెంగ్యూ. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ప్రతి రోజూ డెంగ్యూ కేసుల నమోదవుతూనే ఉన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని లక్షణాలు కనబడటం లేదా ఒక్కోసారి కనిపించకపోవడమూ ఉంటుంది. ఈడిస్ ఈజిప్టి అనే దోమ ఈ వ్యాధి కారకం. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది. తాజా నీటిలోనూ, నిల్వ నీటిలోనూ ఇవి సంతానాన్ని వృద్ధి చేసుకోగలవు. ఇండియాలో ఈ దోమ వృద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ దోమలు కాంతిని గుర్తిస్తూ ఏ సమయంలోనైనా కుట్టడానికి అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో చేసిన అధ్యయనంలో, దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా, లెప్టోస్పిరోసిస్ లాంటి వ్యాధులలో సమర్థవంతంగా పనిచేసే డాక్సీసైక్లిన్ డెంగ్యూలో సైతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింద'ని అన్నారు.

గుర్తించాల్సిన అంశాలు:
దోమల బ్రీడింగ్ ప్రక్రియ 7 నుంచి 12 రోజుల కాలంలో పూర్తవుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల సంతతి వృద్ధి చెందకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. వ్యాధి తీవ్రతను గుర్తించడంలో ఫిజీషియన్లు తప్పనిసరిగా 20 ఫార్ములాను అనుసరించాలన్నారు. బీపీ సాధారణ స్థితి కన్నా తక్కువ, ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి. బీపీ సాధారణ స్థితి కన్నా 20ఎంఎం/హెచ్‌జీ తక్కువగా ఉంటే, ప్లేటలెట్స్ వేగంగా పడిపోవడం జరుగుతుంది. టర్నిక్యుట్ పరీక్ష తరువాత చేతిపై 20 హెమరాజిక్ స్పాట్స్ ఉంటే ఆ రోగి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు భావించవచ్చు. ఆ సమయంలో అతనికి బరువుకు తగినట్లు కిలో బరువుకు 20 మి.లీ. ఫ్లూయిడ్‌ను తక్షణమే అందించడంతో పాటు వైద్య పరంగా శ్రద్ధ అవసరం అవుతుంది.

డెంగ్యూ నివారణకు సూచనలు:
మనీ ప్లాంట్ కుండీలు లేదా సరిగా కప్పని నీటి ట్యాంకులలో కూడా దోమలు గుడ్లు పెట్టవచ్చు. కనుక ఇంటి చుట్టు పక్కల పరిసరాలు శుభ్రంగా, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
► పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాలి.
► దోమ తెరలు/దోమ నివారణ మందులు వాడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement