తెలంగాణ రాష్ట్రంలో 2019లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ జోస్యం చెప్పారు.
కామారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో 2019లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ జోస్యం చెప్పారు. మంగళవారం పట్టణంలోని అయ్యప్ప కల్యాణ మండపంలో నిర్వహించిన డివిజన్ విసృ్తతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఓడిపోవడం బాధకరమైన విషయమన్నారు. ప్రజాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేవలం తెలంగాణ నినాదం, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాత్రమే టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని అ న్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా చిత్తుగా ఓడించారని అన్నారు. టీడీపీపై ప్రజలకు వ్యతిరేకత లేదని ఇంకా అభిమానిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇచ్చి న హామీలు నెరవేరిస్తే తాము స్వాగతిస్తామని అన్నారు.
పదవి లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతాం
పదవులు లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడతామని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావు అన్నారు. ప్రజలందరూ ఒక్కసారి అవకాశమివ్వాలని, టీఆర్‌ఎస్‌ను గెలిపించుకున్నారని, ఇందుకోసం గుర్తుతెలియని వ్యక్తిని కూడా నిలబెడితే జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన వ్యక్తి నిదర్శమని అన్నారు. కేసీఆర్ వాగ్దానాలేమిటో రెండేళ్లలో తెలుస్తుందన్నారు. జూన్ 2 తర్వాత కరెంటు కష్టాలు మొదలవుతాయని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, నరేంద్రమోడీ సహకారంతో జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
23న పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం
డిచ్‌పల్లి : టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 23న జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వీజీగౌడ్ తెలిపారు. మంగళవారం డిచ్‌పల్లి మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వసభ్య సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, జడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీపీ అధ్యక్షులు తదితరులు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న మహానాడులో చర్చించాల్సిన అంశాలు, ఇటీవల ముగిసిన స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై విశ్లేషించ నున్నట్లు తెలిపారు. 28న ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు వీజీగౌడ్ సూచించారు.