ఇట్లు..మీరు.. మేము

Cultural Tour Telangana And Africa - Sakshi

అస్తిత్వాల ఆవిష్కరణ కోసం ‘స్టోరీ టూర్‌’

తెలంగాణ, ఆఫ్రికాల మధ్య సాంస్కృతిక సారూప్యతలు  

వేల ఏళ్ల చారిత్రక అన్వేషణ ఉంది

ఈ సారూప్యతలను చాటేందుకే స్టోరీ టూర్‌

‘సాక్షి’తో  ప్రముఖ పశ్చిమాఫ్రికా స్టోరీటెల్లర్‌ యూసిఫు జాల్హో

సాక్షి, సిటీబ్యూరో: ‘క్రిస్టియన్‌లు, ముస్లింల కంటే ముందు మేం ఆఫ్రికన్‌లం. ఆ భూమితో, ఆ ప్రకృతితో వేల ఏళ్లుగా మమేకమై జీవిస్తున్నవాళ్లం. వైవిధ్యభరితమైన సాంస్కృతిక జీవితం మా సొంతం. యూరోపియన్‌ ఆధిపత్య సంస్కృతి కంటే గొప్ప జీవన సంస్కృతిని  కలిగి ఉన్నాం. మహోన్నతమైన చారిత్రక, వారసత్వ సంపదను మాకు అందజేసిన మా పూర్వీకులకు కృతజ్ఞులం. అందుకే ఇప్పుడు మేం మూలాల వైపు పయనిస్తున్నాం. ఆఫ్రికన్‌ అస్తిత్వాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ సైతం అలాంటి  వైవిధ్యంతో కూడిన అస్తిత్వాన్ని కలిగిన ప్రాంతం. ఆఫ్రికన్‌ దేశాలకు, తెలంగాణకు మధ్య ఎన్నో సాంస్కృతిక సారూప్యతలు ఉన్నాయి...’ అన్నారు ప్రముఖ నటుడు, రచయిత, సియార (పశ్చిమాఫ్రికా)లోని లియోన్‌కు చెందిన స్టోరీ టెల్లర్‌ యూసిఫు జల్హో. మూడు దశాబ్దాలకు పైగా ఆఫ్రికన్‌ కథలతో ప్రపంచమంతటా పర్యటిస్తున్న ఆయన జీవితంపై  ‘ది కౌ ఫూట్‌ ప్రిన్స్‌’ పేరిట ఒక డాక్యుమొంటరీ చిత్రాన్ని కూడా రూపొందించారు. ఇటీవల లండన్‌లో ఆ సినిమా అనేక ప్రదర్శనలను అందుకొంది. త్వరలో అమెరికా ఫిల్మ్‌ఫెస్టివల్‌లోనూ దానిని ప్రదర్శించనున్నారు. ‘స్టోరీ ఆర్ట్స్‌ ఇండియా’ వ్యవస్థాపకులు దీపా కిరణ్‌ ఆహ్వానంపై ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. పలు స్కూళ్లు, కళాశాలల్లో ఇద్దరూ కలిసి ప్రదర్శనలిస్తున్నారు. పిల్లలకు కథలు  చెప్పే టీచర్లకు  కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న యూసిఫు జల్హో ‘ సాక్షి’తో  తన అనుభవాలను పంచుకున్నారు.ఆ విశేషాలతో ఈ ప్రత్యేక కథనం...

ఇది ఒక స్టోరీ టూర్‌....
నిజమే కథలు పర్యటిస్తున్నాయి. భారతీయ సాంస్కృతిక జీవితంలోని ఔన్నత్యాన్ని, తాత్వికతను, నైతిక విలువలను ప్రతిబింబించే అద్భుతమైన సంగీత,నృత్య రూపక కథలతో పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటున్న  దీపాకిరణ్‌  మన దేశంతో పాటు అనేక దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆయా దేశాలకు చెందిన స్టోరీ టెల్లర్స్‌ను హైదరాబాద్‌కు పరిచయం చేస్తున్నారు. గతంలో థాయ్‌లాండ్, అర్జెంటీనా, కెన్యా, తదితర దేశాలకు చెందిన స్టోరీ టెల్లర్స్‌తో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పశ్చిమాఫ్రికా స్టోరీ టెల్లర్‌ యూసిఫు కథలు సైతంహైదరాబాద్‌ పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. ‘రెండు రోజుల క్రితంనచికేత తపోవన్‌లో ఒక ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన బంజారాహిల్స్‌లోని నృత్య ఆర్ట్‌ ఫోరమ్‌లో ఆఫ్రికన్, ఇండియన్‌ కథల సమాహారంతో మరో ప్రత్యేక ప్రదర్శన జరుగనుంది. ‘ వివిధ దేశాల మధ్య కథలు పర్యటిస్తున్నాయి. ఇది విభిన్న సంస్కృతుల ప్రవాహం వంటిది. ఆఫ్రికా, తెలంగాణ జీవన విధానంలో అనేక సారూప్యతలు ఉన్నాయి. యూసిఫు కథల్లో ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.’ అని చెప్పారు  దీపాకిరణ్‌. 

మూడు దశాబ్దాలకు పైగా....
‘తన వీపు పైన మూపురం ఎందుకు ఉంది.’ అని ఒక పిల్ల ఒంటె తల్లిని అడుగుతుంది. ఎడారిలో నీళ్లను నిల్వ చేసుకొనేందుకు అని చెబుతుంది తల్లి. పెద్ద పెద్ద పాదాలు ఎందుకు ఉన్నాయంటే నిప్పులు చెరిగే ఎండలో, ఇసుకలో నడుస్తున్నప్పుడు నొప్పి తెలియకుండా ఉంటుందని తల్లి చెబుతుంది. ‘ఇప్పుడు మనం ఎందుకు జూలో అన్నాం’ అని అడుగుతుంది పిల్ల ఒంటే. దానికి తల్లి దగ్గర సమాధానం ఉండదు. ఇది ఆఫ్రికన్‌ స్టోరీ. ప్రకృతితో సహజీవనం చేసే క్రమంలో మనిషి విధ్వంసానికి పాల్పడుతూ తనను తాను బంధించుకుంటున్నాడని ఈ కథనం చెబుతుంది. ఎందుకు అనే మౌలికమైన ప్రశ్నను రేకెత్తించే కథలు, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకొనే కథలు, పూర్వీకులను స్మరించుకొనేవి, జంతువులు, వన్యప్రాణుల పట్ల ప్రేమను, ఆరాధనను ప్రబోధించే కథలు తమ సాహిత్యంలో ఎక్కువగా ఉంటాయని చెప్పారు యూసిఫు. తెలంగాణ జీవితంలోనూ ఇలాంటి  కథలే ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. సింహం–చిట్టెలుక, సూరజ్‌మామ, పేదరాసి పెద్దమ్మ, ఏడు చేపల కథల, పంచతంత్ర కథలు వంటివి గొప్ప నీతిని నేర్పుతాయని చెప్పారు. ‘సంగీతం, నృత్యం కథలకు ప్రాణం. హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ వంటి అనేక కథారూపాల్లో లయబద్ధమైన కథనం, నృత్యం,సంగీతం ఎంతో ఆకట్టుకుంటాయి. మా ఆఫ్రికన్‌ కథల్లోనూ సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. డుండు, జింబె (డ్రమ్ము), కెంకెని, సంబ వంటి వాద్య పరికరాలు లేకుండా కథా గమనం ఉండదు. ఈ సంగీత పరికరాలన్నీ ఒక కుటుంబం వంటివి. డుండు తల్లి అయితే కెంకెనీ కొడుకు, సంబ కూతురు, జింబె స్వతంత్రంగా ఉండే టీనేజ్‌ అమ్మాయి వంటిది. కెంకెనీ, సంబ వాద్యాలు డుండును అనుసరిస్తే, జింబె మాత్రం విడిగా ఉంటుంది.’ అంటారాయన. 

ఎన్నో సారూప్యతలు...
‘హైదరాబాద్‌ బిర్యానీలాగే ఆఫ్రికన్‌ జలాఫ్‌రైస్‌ చాలా ఫేమస్‌. ఇక్కడి లాగే రైస్‌ మాకు ప్రధాన ఆహారం. ఇప్పుడు చాలామంది పూర్వకాలంలోని ఆహార పదార్థాలను ఆస్వాదిస్తున్నారు, రాగులు, కొర్రలు, జొన్నలు వంటి చిరుధాన్యాలు మా ఆహారంలో భాగమయ్యాయి. ఇండియాలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష, సంస్కృతి, ఆహార్యం ఉన్నట్లుగానే ఆఫ్రికన్‌ దేశాల్లోనూ అనేక భాషలు, సంస్కృతులు, జీవన విధానాలు కనిపిస్తాయి. ఇప్పుడు మా సొంత సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మూలాలవైపు పయనిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనం వంటిది’ అని ఆయన ముగించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top