
గచ్చిబౌలి: బాబ్బాబు ఒక్క మాస్క్ ఉంటే ఇవ్వండి... ఎంతైనా పర్వాలేదు అంటూ ఐటీ ఉద్యోగులు మెడికల్ షాపులకు తిరుగుతున్నారు. కనీసం శానిటైజర్ అయినా ఉందా అంటూ ఆరా తీస్తున్నారు. నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వెనుదిరుగుతున్నారు. ఇది ఐటీ కారిడార్‌లోని తాజా పరిస్థితి. బుధవారం మాదాపూర్‌లోని రహేజా మైండ్ స్పేస్‌లో ఓ ఐటీ ఉద్యోగిని కరోనా అనుమానితురాలిగా గుర్తిండంతో ఐటీ కారిడార్‌లో ఒక్క సారిగా కరోనా కల్లోలం మొదలైంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మాస్క్‌లు, శానిటైజర్‌ల కోసం ఐటీ ఉద్యోగులు మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. చాలా చోట్ల మాస్క్‌లు, శానిటైజర్లు లేవని బోర్డులు పెట్టారు. ఎక్కడో ఒక చోట మెడికల్ షాపులో మాస్క్‌లు ఉన్నా ఒక్కో మాస్క్‌కు రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు.