కరోనా: నాలుగు రోజులుగా కంటి మీద కునుకు లేదు..

Corona: Adilabad Youth Stopped By Police During Lockdown - Sakshi

సాక్షి, దండేపల్లి(మంచిర్యాల) : లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆంక్షలు విధించడంతో పాటు, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మంచిర్యాల–జగిత్యాల, జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని దండేపల్లి మండలం గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద గ్యాస్‌ సిలిండర్ల లారీలో వస్తున్న 29 మంది యువకులను పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్, వరంగల్, జిల్లాలకు చెందిన 29 మంది యువకులు మహారాష్ట్రలోని యావత్మాల్‌ లో ఆర్గానిక్‌ ప్రొడక్సట్‌ కంపెనీలో, సేల్స్‌మెన్స్‌గా పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగడంతో, వారంతా అక్కడనుంచి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

నాలుగు రోజుల క్రితం బయల్దేరిన వారంతా, గ్యాస్‌ సిలిండర్ల లారీలో వస్తుండగా, గూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని లారీలోంచి కిందకు దించి, విషయాన్ని లక్సెట్టిపేట సీఐ, నారాయణ్‌నాయక్, ఎస్సై దత్తాత్రికి తెలపడంతో వారితో పాటు తహసీల్దార్‌ సంతోష్‌కుమార్‌ కూడ అక్కడికి చేరుకున్నారు. వారి వివరాలపై ఆరాతీశారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది కాబట్టి లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు. వారందరిని వచ్చిన చోటికి తిరిగి పంపించారు. 

కన్నవారిని చూడాలని యువకుల కంటతడి
సార్‌ మీకు దండం పెడతాం.. మేం డిగ్రీ, పీజీ, వరకు చదివాం. మేమంతా తెలంగాణ బిడ్డలమే, ఏదో ఉపాధి నిమిత్తం కంపెనీలో పనిచేసేందుకు యవత్మాల్‌ వెళ్లాం కరోనా మమ్మల్ని ఇంటి బాట పట్టించింది. నాలుగు రోజులుగా కంటి మీద కునుకు లేదు. కడుపు నిండా అన్నం లేదు. సొంత ఇంటికి వెళ్లి కన్నవారిని చూడాలని ఉంది సార్‌. ఇంటికి వెళ్తాం సర్‌. మాబాధను అర్థం చేసుకోండి సార్‌ అని, యువకులంతా కంట తడిపెట్టుకుంటూ, పోలీసులు, రెవెన్యూ అధికారులను వేడుకున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అధికారులు వారందరినీ తిరిగి యావత్మాల్‌కు పంపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top