రాజకీయ నిరుద్యోగులకు ఊరట..!

Co-Option Members Of Gram Panchayat Governance - Sakshi

త్వరలో పంచాయతీల్లో కో–ఆప్షన్‌ సభ్యుల నియామకం! 

ఒక్కో జీపీలో ముగ్గురికి అవకాశం

వార్డు సభ్యులతో సమాన హోదా 

పాలకవర్గాలతో ఆశావహుల లాబీయింగ్‌

సాక్షి, కుల్కచర్ల: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన 2018 పంచాయతీరాజ్‌ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ నిరుద్యోగులకు కొంత ఊరట లభించనుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గంలోనూ కో–ఆప్షన్‌ సభ్యులను నియమించుకునేందుకు తెలగాణ ప్రభుత్వం కొత్త చట్టంలో వెలుసుబాటు కల్పించింది. గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరి రెండు నెలలు పూర్తిఅయ్యింది. పాలన పై శిక్షణ తరగతులు కూడా అధికారులు పూర్తిచేశారు. కొత్త పంచాయతీ చట్టంలో రూపొందించిన విధంగా కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ మిగిలింది.

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌... ఎంపిక విధానంపై మార్గదర్శకాలు విడుదలచేస్తే ఆయా  పంచాయతీల పాలకవర్గం అభిప్రాయం మేరకు సర్పంచ్‌ సన్నిహితులకు, విధేయులకు ఛాన్స్‌ లభించనుంది. సర్పంచ్, ఉపసర్పంచ్‌ వార్డు సభ్యులతో పాటు గ్రామానికి చెందిన మరో ముగ్గురిని కో–ఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక  చేసుకుంటే వారి విలువైన సలహాలు గ్రామపంచాయతీ అభివృద్ధికి కొంతమేరకు తోడ్పాటు లభించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వారికి వార్డు సభ్యులతో సమానహోదా ఉంటుంది. గ్రామ పంచాయతీ సమావేశాలలో తీర్మానం సమయంలో చేసే చర్చలో వారు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మండల కో–ఆప్షన్‌గానే ఎంపిక చేసేవారు ఇప్పడు జీపీలలోకూడాముగ్గురిని ఎంపిక చేయనున్నారు. 

ప్రాధాన్యత వీరికే... 
ప్రతి గ్రామ పంచాయతీలో ముగ్గురు చొప్పున కో–ఆప్షన్‌ సభ్యులను పంచాయతీ పాలకవర్గం నిర్ణయం మేరకు అధికారులు నియమిస్తారు. ఇందులో సీనియర్‌ సిటిజన్, రిటైర్డ్‌ ఉద్యోగికి ఒకటి, మహిళా సంఘాల సభ్యులలో చురుగ్గా పనిచేసేవారికి ఒకటి, స్వచ్ఛంద సంస్థల వారు గ్రామ అభివృద్ధి కోసం ఇదివరకే కృషిచేసే వారికి ఒకటి ఈ విధంగా ముగ్గురిని నియమిస్తారు. ఈ ముగ్గురు గ్రామాలలో నివసిస్తూ ఉన్నావారు అయిఉండాలి. ఈ ముగ్గురిలో తప్పనిసరిగా ఒకరు మహిళ ఉంటారు. వీరు గ్రామాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రతి కార్యక్రమాలపై పంచాయతీ సమావేశాల్లో చర్చిస్తారు. 

మండలలో 132 మంది కో–ఆప్షన్‌లు... 
కుల్కచర్ల మండలంలో ప్రస్తుతం 44 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున 132 మందిని కో–ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. వార్డుసభ్యులతో సమాన హోదా కో–ఆప్షన్‌ సభ్యులకు రానుంది. ఈ విషయమై మండల అధికారులను వివరణ కోరగా 2018 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ప్రభుత్వం మార్గాదర్శకాలను విడుదల చేసిన వెంటనే నియామకాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top