నాన్నా.. కనపడ్తలే

Childrens Loss Eye Power With Use Mobiles - Sakshi

చిన్నారుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల విచ్చలవిడి వాడకంతో దృష్టిలోపం

తాజా నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల విచ్చలవిడి వాడకంతో చిన్నారుల్లో కంటి సమస్యలు అధికం అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. విటమిన్‌–ఏ లోపం వల్ల కూడా పిల్లల్లో దృష్టిలోపం మరింత పెరిగిందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ కంటి నివేదికను తాజాగా విడుదల చేసింది. మైదానాల్లో ఆటలు తగ్గడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టడంతో పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రధానంగా దూరం చూడలేని (మయోపియా) పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించింది. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన జ్వరం, డయాబెటిస్‌ ఉన్న పిల్లల్లోనూ కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని విశ్లేషించింది. మూడు మీటర్ల దూరం నుంచి కూడా వేళ్లను లెక్కించలేని వ్యక్తిని ‘గుడ్డి‘గా పరిగణిస్తారని (గతంలో ఇది ఆరు మీటర్లుగా ఉండేది) ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది.

పెరిగిన చైతన్యం... తగ్గుతున్న అంధత్వం 
దేశంలో నానాటికీ అంధత్వం తగ్గుముఖం పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2007తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో అంధుల సంఖ్య 47 శాతం తగ్గిందని పేర్కొంది. 2020 నాటికల్లా మొత్తం జనాభాలో అంధుల సంఖ్యను 0.3 శాతానికి తగ్గించాలంటూ ఆ సంస్థ విధించిన లక్ష్యాన్ని అందుకునేందుకు చేరువైనట్లు పేర్కొంది. 2006–07లో దేశ జనాభాలో ఒక శాతం మంది అంధులు ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 0.36 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 2010లో దేశ జనాభాలో 5.30 శాతంగా ఉండేదని, ఇప్పుడు అది 2.55 శాతానికి తగ్గిందని వివరించింది. మరోవైపు తెలంగాణలో గత పదేళ్లతో పోలిస్తే అంధత్వం దాదాపు 52 శాతం తగ్గినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తర్వాత దీనిపై పలువురు వైద్యాధికారులు విశ్లేషణ చేశారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమం ద్వారా పరిస్థితి మరింత పెరిగిందని చెబుతున్నారు.

ఏడు నెలలపాటు కంటి వెలుగు కింద 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. 9,882 గ్రామాల్లో (99.50%) కంటి పరీక్షలు పూర్తిచేశారు. 22.92 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు అక్కడికక్కడే అందజేశారు. మరో 15 లక్షల మందికి చత్వారీ అద్దాలు ఇచ్చారు. ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం 9.30 లక్షల మందిని ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. వారిలో దాదాపు 6 లక్షల మందికి వివిధ రకాల ఆపరేషన్లు అవసరమని, మిగిలిన వారికి తదుపరి వైద్యం అవసరమని అంచనా వేశారు. వారిందరికీ సరోజినీ కంటి ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రుల్లోనూ ఆపరేషన్లు నిరంతరం జరుగుతున్నాయి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులు... 

  •  అందరికీ ఆరోగ్యం వంటి పథకాల్లో కంటి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఆదాయం కలిగినవారికి కూడా అత్యాధునిక కంటి వైద్యం అందజేయాలి.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లోనూ కంటి వైద్యం అందుబాటులోకి రావాలి. 
  • డయాబెటీస్, తల్లీపిల్లల ఆరోగ్యం వంటి వాటితోపాటు కంటి జాగ్రత్తలపైనా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. 
  • కంటి వైద్యం, చికిత్సలపై ఉన్నతస్థాయి పరిశోధనలు జరగాలి. సర్కారు నిధుల కేటాయింపు, ప్రైవేటురంగ భాగస్వామ్యం తప్పనిసరి.  
  •  ప్రజల్లో కంటి సమస్యలపై అవగాహన పెంచాలి. ఇందుకోసం ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టాలి.

    ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌తో కంటిపై రేడియేషన్‌...
    పిల్లల్లో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌ల వాడకం పెరగడంతో వారిలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వీడియో గేమ్స్‌ వాడకం వల్ల బ్లూ రేడియేషన్‌ ఏర్పడి నిద్రలేమి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు అన్నం తినిపించేందుకు కూడా మొబైల్‌ను చేతికి ఇస్తున్నారు. ఇలా వారు అలవాటు పడిపోతున్నారు.
    – డాక్టర్‌ దీప శిల్పిక, కంటి వైద్య నిపుణులు
    శివాస్‌ హెల్త్‌ అండ్‌ ఐ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top