సెట్స్‌ తేదీల్లో మార్పులు

Changes In Telangana Set Examinations - Sakshi

టీసీఎస్‌ సూచనతో ఎంట్రన్స్‌ల 

తేదీలు మార్చిన ఉన్నత విద్యామండలి  

లాసెట్‌ మే 26కు బదులు మే 20నే నిర్వహణ

పీఈసెట్‌ మే 20కి బదులు మే 15 నుంచే..

పీజీఈసెట్‌ మే 28 నుంచి 31 వరకు.. మే 31నే ఎడ్‌సెట్‌

ఎంసెట్, ఈసెట్, ఐసెట్‌ తేదీలు మాత్రం యథాతథం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి మార్చింది. లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్‌ తేదీల్లో మార్పు చేసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్‌లు మాత్రం గతంలో ప్రకటించిన తేదీల్లోనే జరుగుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సెట్స్‌ నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్‌ సూచన మేరకు ఈ మార్పులు చేసినట్లు చెప్పారు. లాసెట్, పీజీ లాసెట్‌ మే 26కి బదులు మే 20నే నిర్వహిస్తామని తెలిపారు. పీఈ సెట్‌ను మే 20 నుంచి నిర్వహించాల్సి ఉండగా దాన్ని మే 15 నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. పీజీ ఈసెట్‌ను  షెడ్యూల్‌ ప్రకారం మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా వాటిని అదే నెల 28 నుంచి 31 వరకు నిర్వహిస్తామని వివరించారు. ఎడ్‌సెట్‌ను మే 30, 31 తేదీల్లో నిర్వహించేలా ముందుగా షెడ్యూల్‌ జారీ చేసినప్పటికీ మే 31నే పూర్తి చేసేలా మార్పులు చేసినట్లు వివరించారు.

ఇటీవల ఆయా సెట్స్‌కు కన్వీనర్లను నియమించిన ఉన్నత విద్యామండలి గురువారం వారితోపాటు ఆయా సెట్స్‌కు చైర్మన్లుగా వ్యవహరించే సంబంధిత యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సెట్స్‌ నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ అంశాలపై చర్చించింది. ఇప్పటికే సెట్స్‌ కమిటీలను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆయా కమిటీలు సమావేశమై నోటిఫికేషన్ల జారీ తేదీలను వెల్లడిస్తాయని పాపిరెడ్డి పేర్కొన్నారు. అప్పుడే దరఖాస్తు ఫీజుల వివరాలను వెల్లడిస్తామన్నారు. గతేడాది నిర్ణయించిన ఫీజునే కొనసాగించే అవకాశం ఉందని, ఒకవేళ పెంచాల్సి వచ్చినా ఆ పెంపు స్పల్పంగానే ఉంటుందని వివరించారు.

ప్రవేశపరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున ఈసారి పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, ఒకవేళ తలెత్తినా వెంటనే పరిష్కరించేలా టెక్నీషియన్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా సెట్స్‌ వెబ్‌సైట్లలో మాక్‌ టెస్టుల లింకులను విద్యార్థుల ప్రాక్టీస్‌ కోసం అందుబాటులో ఉంచుతామన్నారు. హైదరాబాద్‌ నాచారంలోని పరీక్ష కేంద్రంలో దాదాపు 8 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, అక్కడ గతంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయని, ఈసారి అవి లేకుండా చూస్తామన్నారు. పీజీ కామన్‌ ఎంట్రెన్స్‌ విషయంలో ఆలోచనలు చేస్తున్నామన్నారు.

ఇవీ సెట్స్‌ తేదీల వివరాలు...
సెట్‌            పాత తేదీలు        మారిన తేదీలు
లాసెట్, పీజీ లాసెట్‌    మే 26            మే 20 
పీఈసెట్‌            మే 20 నుంచి        మే 15 నుంచి 
పీజీఈసెట్‌        మే 27, 28, 29        మే 28, 29, 30, 31
ఎడ్‌సెట్‌            మే 30, 31        మే 31
ఎంసెట్‌            మే 3, 4, 6 (ఇంజనీరింగ్‌),    – 8, 9 (అగ్రికల్చర్‌)                    
ఈసెట్‌            మే 11                –        
ఐసెట్‌            మే 23, 24            –  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top