తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్ బాలుర కళాశాల మైదానంలో పార్టీ కార్యకర్తల జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లను పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో పసుపుమయం చేశారు.
చంద్రబాబు సభను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరికల నేపథ్యం లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చంద్రబాబు పర్యటన గురువారం ఉదయం నుంచి రాత్రివరకు పర్యటన కొనసాగనుంది. దీనికోసం జిల్లా సరిహద్దు తిమ్మాపూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ర్యాలీ నిర్వహించేలా యువతను సమీకరిస్తున్నారు. మధ్యాహ్నం బాలుర కళాశాల మైదానంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు.
అనంతరం అదే వేదికపై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. సభకు 50వేల మంది కార్యకర్తలు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నా ఏర్పాట్లు చూస్తే ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. స్వాగత ఏర్పాట్లు, మైదానంలో భోజన, వసతి సౌకర్యాలు, వేదిక నిర్వహణ తదితరాల కోసం ఆరు కమిటీలను వేశారు. రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో పాటు జిల్లా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు వేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో అంతా తానై వ్యవహరిస్తున్నారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై నిఘా
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వారం రోజులుగా మంద కృష్ణ స్వయంగా జిల్లాలో పర్యటిస్తూ చంద్రబాబు పర్యటన అడ్డుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎంఆర్‌పీఎస్ కార్యకర్తల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. చంద్రబాబు పర్యటనకు ముందే ఎంఆర్‌పీఎస్ క్రియాశీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు పర్యటన జరిగే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా సుమారు వేయి మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.