ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వురుగా హైకోర్టులు ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ బార్ కౌన్సిల్ ప్రతినిధి బృందానికి చెప్పారు.
* బార్ కౌన్సిల్ ప్రతినిధి బృందంతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వురుగా హైకోర్టులు ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ బార్ కౌన్సిల్ ప్రతినిధి బృందానికి చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎం.కె.మిశ్రా, సభ్యుడు ఎన్.రామచంద్రరావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ చైర్మన్ ఎ.నరసింహారెడ్డితో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం కేంద్ర మంత్రిని కలిసి రెండు రాష్ట్రాలకూ వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది.
రెండు హైకోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పటికే విజ్ఞప్తి చేశామని కేంద్ర మంత్రి వారికి వివరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న వెంటనే వేగంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.