ఆపరేషన్‌ లోటస్‌! | BJP Plans To Becoming Strong Party In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ లోటస్‌!

Aug 20 2019 11:05 AM | Updated on Aug 20 2019 11:05 AM

BJP Plans To Becoming Strong Party In Mahabubnagar - Sakshi

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పట్టుకోసం కాషాయం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే స్ఫూర్తిగా ఉమ్మడి జిల్లాలో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.  

సాక్షి, మహబూబ్‌నగర్‌ : అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర మాజీ మంత్రులు డీకే అరుణ, పి.చంద్రశేఖర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డోకూరు పవన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్, రాష్ట్ర వర్కింగ్‌ కార్యదర్శి జయశ్రీ, జిల్లా అధికార ప్రతినిధి సత్యంయాదవ్, ఉపాధ్యక్షుడు సుధాకర్, తెలుగు యువత జిల్లా అద్యక్షుడు హరికృష్ణ, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీదేవీ, శివరాములు, వివిధ స్థాయిలోని నాయకులు గోవింద్‌యాదవ్, సరోజ, యాదయ్య, వెంకటేశ్, శ్రీరాములు జలంధర్‌రెడ్డిలతో పాటు పలువురు సీనియర్లు కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. ఒకరి వెంట మరొకరి చేరికలతో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులకు గాలం వేసిన బీజేపీ తాజాగా.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న అసంతృప్తులనూ గుర్తించి వారికి కాషాయం కండువా కప్పాలనే యోచనలో ఉంది.

ఇప్పటికే అసెంబ్లీ.. సర్పంచ్‌.. లోక్‌సభ... మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఆయా ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్‌ నాయకులను గుర్తించే పనిలో కాషాయ దళం ఉంది. తమ పార్టీలో ప్రాధాన్యం ఇస్తామంటూ అసంతృప్తులందరినీ తమ పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. రోజులు గడుస్తోన్నా కొద్దీ.. ఇంకెవరెవరూ కాషాయం కండువా కప్పుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే..జిల్లాలో టీడీపీ క్యాడర్‌ అంతా ఖాళీ కావడంతో ఇక తమ పార్టీ వంతు వస్తుందనే కలవరం కాంగ్రెస్‌ నేతల్లో మొ దలైంది.   ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లోపంతో చతికిలపడింది. దీంతో ఆ పార్టీ క్యాడర్‌ సైతం టీఆర్‌ఎస్‌ లేదా బీజేపీ వైపు దిక్కులు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా.. మెరుగైన రాజకీయ భవిష్యత్‌ కోసం కమలం గూటికి చేరాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు తమ క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

మేధావి వర్గంపై దృష్టి..  
ఓ వైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికల పరంపర కొనసాగుతుండగానే.. మరోవైపు కమలనాథులు మేధావి వర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలో చదువుకున్న మేధావులు ఉంటే వారి వెంట ఉన్న ఆయా వర్గాలు సైతం పార్టీని నమ్ముతారనే భావనతో బీజేపీ ప్రయోగానికి తెరలేపింది. తాజాగా ఈ నెల 11న మహబూబ్‌నగర్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్థానికంగా మేధావులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మేధావులందరినీ పార్టీ సిద్ధాంతాలు వివరించడం ద్వారా దేశాన్ని ఉజ్వల భారత్‌గా తీర్చిదిద్దేందుకు అందరి సలహాలు, సూచనలు అవసరమని అందుకోసం బీజేపీని బలోపేతం చేయాలని భేటీలో వివరించినట్లు సమాచారం. త్వరలోనే చదువుకున్న నిరుద్యోగ యువత, ఇతర రంగాల ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఇప్పట్లో లేకున్నా 2023లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పటిలోగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పట్టుకోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement