గెలుపుగుర్రాల కోసం  బీజేపీ కసరత్తు

BJP MLA Candidate List Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపుగుర్రాల అన్వేషణ తుది అంకానికి చేరుకుంది. ‘ముందస్తు’ వ్యూహాలకు పదునుపెట్టిన భారతీయ జనతాపార్టీ అభ్యర్థుల ఖరారుపై కీలక చర్చలకు తెరలేపింది. ఆశావహుల జాబితా సేకరించిన కమల నాయకత్వం.. నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా లోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ల సీనియర్లతో భేటీ కానుంది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌తో కూడిన కోర్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి సగటున 25 మంది నేతలను ఆహ్వానించిన బీజేపీ హైకమాండ్‌.. ఈ సమావేశంలో వెల్లడయ్యే మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగా అభ్యర్థుల పేర్లను అధిష్టానం పరిశీలనకు పంపనుంది. ఈ నెల 10న పార్టీ అధినేత అమిత్‌షా కూడా రాష్ట్ర పర్యటనకు వస్తున్న తరుణంలో.. టికెట్ల కేటాయింపు ఎప్పుడనే విషయంలో స్పష్టత రానుంది.

ఆశావహుల మల్లగుల్లాలు 
ఒంటరిగా బరిలో దిగుతున్న భారతీయ జనతా పార్టీలో టికెట్ల కోసం ఆశావహుల మధ్య పోటాపోటీ నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా అత్యధిక స్థానాలను ఆ పార్టీకే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వికారాబాద్, తాండూరు, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసింది. జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లాలో కలిసిన షాద్‌నగర్‌ కూడా 2014లో బీజేపీ పోటీ చేసినా పరాజయమే ఎదురైంది. అయితే, ఈసారి మాత్రం తెలుగుదేశంతో తెగదెంపులు కావడంతో స్వతంత్రంగా బరిలో దిగడానికి బీజేపీ సమాయత్తమైంది.

ఈక్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే కొందరు ఆశావహులు ప్రచారపర్వంలో కూడా దిగారు. గత ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్‌లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆచారి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అలాగే తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కూడా ఉప్పల్‌లో ప్రచారం మొదలు పెట్టారు. షాద్‌నగర్‌లో భారీ ఓట్లను దక్కించుకున్న శ్రీవర్ధన్‌రెడ్డి గ్రామస్థాయిలో పర్యటనలు ప్రారంభించారు.

బయటపడుతున్న లుకలుకలు 
రేసు గుర్రాలను వెతుకుతున్న బీజేపీకి సొంత పార్టీ నుంచే తలనొప్పులు ఎదురవుతున్నాయి. అక్కడక్కడా ప్రచారం చేస్తున్న నేతలపై ఇప్పటికే వైరివర్గాలు ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నాయి. ఈ పరిణామాలు హైకమాండ్‌ను డైలామాలో పడేస్తున్నాయి. గ్రూపులుగా విడిపోయిన రాష్ట్ర స్థాయి నేతలతో లాబీయింగ్‌ నెరుపుతున్న పలువురు స్థానిక, జిల్లా నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం మానేశారు. తమ గాడ్‌ఫాదర్‌తో చక్రం తిప్పుతూ టికెట్‌ వేటను కొనసాగిస్తున్నారు.

తాజా పరిణామాలు ఆశావహుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కోర్‌కమిటీ సభ్యుల మద్దతు కూడగట్టితే అభ్యర్థిత్వం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో శుక్రవారం జరిగే అభిప్రాయ సేకరణపై అందరి దృష్టి పడింది. ఈ సమావేశంలో తమ వాదనను బలంగా వినిపించేందుకు ఆశావహులు కూడా నియోజకవర్గాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top