
ఇక్కడ వాజ్‌పేయి పక్కన సూటులో గెడ్డంతో ఉన్న వ్యక్తి బద్దం బాల్‌రెడ్డే. ఎమర్జెన్సీ టైములో ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆయనిలా తన రూపును మార్చుకున్నారు.. ఎమర్జెన్సీ అనంతరం వాజ్‌పేయి విదేశాంగ మంత్రి హోదాలో హైదరాబాద్ వచ్చినప్పుడు తీసినదీ చిత్రం
సాక్షి, హైదరాబాద్: నుదిట తిలకం, భుజాల పై శాలువా, గంభీరమైన రూపంతో దర్శనమిచ్చే బద్దం బాల్‌రెడ్డి నగర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. సమస్య ఏదైనా, అవతలి వర్గంవారు ఎవరైనా తన వద్దకు వచ్చి విన్నవించినవారికి పూర్తి భరోసా కల్పించి బద్దం తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం నిలబడిననేత ఆయన. పాతబస్తీలో పుట్టి, జన్‌సంఘ్‌లో పెరిగి న ఆయన నగరంలో ఎంఐఎంకు రాజకీయప్రత్యర్థిగా తొడగొట్టి నిలబడ్డారు. 1978లో ఆయనపై దాడి జరిగింది. ఆయన్ను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను 2017లో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఆయనను ‘గోల్కొండ సింహం’గా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పిలుచుకునేవారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడేతత్వంతో ఉండే ఆయన 1991,1998, 1999లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఐఎంకు ముచ్చెమటలు పట్టించారు. 1991లో ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో 39,524 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐ ఎంకు ఇదే అతితక్కువ మెజారిటీ.
కార్వాన్‌లో జైత్రయాత్ర
పాతబస్తీ అలియాబాద్‌లో బాల్‌రెడ్డి పుట్టి పెరిగారు. కానీ, కార్వాన్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఎంఐఎం అభ్యర్థులను ఓడించారు. 1985లో కార్వాన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 9,777 ఓట్ల మెజారిటీతో విరాసత్ రసూల్‌ఖాన్‌పై, 1989లో 3,066 ఓట్ల మెజా రిటీతో ఆకర్ ఆగాపై, 1994లో 13,293 ఓట్ల మెజా రిటీతో సయ్యద్ సజ్జాద్‌పై విజయం సాధించారు. తదనంతరం ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అయినా కార్వాన్ నియోజకవర్గాన్ని వదలకుండా 2014 వరకు పోటీ చేశారు. 2009లో చేవెళ్ల లోక్‌సభ, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నా వీధివీధిలో తిరిగి ప్రచారం నిర్వహించారు.
బెదిరింపులు వచ్చినా..
1978లో అలియాబాద్ సమీపంలో స్కూటర్‌పై బాధితుల పరామర్శకు వస్తున్న బాల్‌రెడ్డిపై దుండగులు దాడి చేశారు. తదనం తరం కూడా అనేక సందర్భాల్లో హతమారుస్తాం అంటూ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా ఆయన మొక్కవోని దీక్షతో సిద్ధాంత రాజకీయాల్లో కొనసాగారు. బాల్‌రెడ్డి హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ 2017లో పలువురిని అరెస్ట్ చేసింది. బెదిరింపులు వచ్చి నా కూడా బద్దం ఎక్కడా వెనక్కి వెళ్లిన దాఖలా ల్లేవని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.