శ్రీశైలానికి గో‘దారి’..!

AP TS Chief Ministers Will Talk About Linking Godavari And Krishna Waters - Sakshi

గోదావరి–కృష్ణా అనుసంధానమే లక్ష్యంగా సీఎంల భేటీ

నేడు ప్రగతి భవన్‌లో కేసీఆర్, జగన్‌ సమావేశం

వృథాను కృష్ణాకు తరలింపు యత్నాల్లో ముందడుగు

వివిధ ప్రతిపాదనలతో సిద్ధమైన ఇరు రాష్ట్రాల అధికారులు 

శ్రీశైలానికి తరలించడమే ధ్యేయంగా తెరపైకి కొత్త ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: ఏటా వృథాగా సము ద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రణాళికలో మరో కీలక ముందడుగు పడనుంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహకానికి సాగు, తాగు నీటిని అందించేలా గోదావరి నీటిని తరలించే బృహత్తర కార్యాచరణ రూపుదిద్దుకోనుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుక్రవారం జరగునుంది. గోదావరి వరద నీటికి అడ్డుకట్ట వేసి వాటిని శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించి సంయుక్తంగా ఈ నీటిని సద్వినియోగం చేసుకునే అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ వేదికగా కీలక చర్చలు జరుపనున్నారు. ఈ భేటీ అంశాలకు అనుగుణంగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్లు వివిధ ప్రతిపాదనలు, నివేదికలను సిధ్దం చేశారు. 

కృష్ణా అవసరాలకు గోదావరే దిక్కు! 
తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరే ప్రధాన నీటి వనరుగా ఉంది. గోదావరి నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి 1,486 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా ఇందులో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. అయితే ఇందులో ఇప్పటికే శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్‌ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉండగా, మరో 520 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా తెలంగాణ వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. అయినప్పటికీ ఏటా వేల టీఎంసీల్లో నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది.

1990 నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలను పరిశీలిస్తే.. 1990లో ఏకంగా 7,094 టీఎంసీల నీరు ఒక్క ఏడాదిలో సముద్రంలోకి వెళ్లింది. గడిచిన పదేళ్లలో చూసినా.. 2010–11లో 4,053 టీఎంసీలు, 2013–14లో 5,827 టీఎంసీలు, గతేడాది 2,446 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. సరాసరిన ఏటా 3,500 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఇక కృష్ణా బేసిన్‌లో నీటి ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నాయి. 1990–91 ఏడాదిలో 1,046 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లగా, 2014–15లో 73టీఎంసీలు, 2015–16లో 9టీఎంసీలు, 2016–17లో 55టీఎంసీలు, 2017–18లో సున్నా, గతేడాది 39టీఎంసీల నీరు మాత్రమే వృథాగా వెళ్లింది.  

ఎగువన ప్రాజెక్టులతోనే సమస్య 
గోదావరి, కృష్ణ నదుల ప్రవాహంలో మనకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు విచ్చలవిడిగా ప్రాజెక్టులు చేపట్టడం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం కారణంగా దిగువకు నీటి ప్రవాహాలే కరువయ్యాయి. ఒకవేళ కృష్ణకు వరదలు వచ్చినా ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర వంటి ప్రాజెక్టులు నిండి దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్‌లకు నీరు రావాలంటే ఆగస్టు, సెప్టెంబర్‌ పడుతోంది. అప్పటికే ఖరీఫ్‌ కాలం గడిచిపోతుండటంతో నీటికష్టాలు తప్పడం లేదు.

దీంతో తమకున్న వాటాను ఏపీ (511 టీఎంసీలు), తెలంగాణ (299టీఎంసీలు) వాడుకునే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. ఈ దిశగానే గోదావరి నీటిని శ్రీశైలం, సాగర్‌లకు తరలించే ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల వద్ద ఈ తరలింపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిధ్దంగా ఉన్నాయి. తుపాకులగూడెం–సాగర్, ఇచ్చంపల్లి–సాగర్, అకినేపల్లి–సాగర్, దుమ్ముగూడెం–సాగర్‌ టెయిల్‌పాండ్‌ వంటి ప్రతిపాదనలు ఉండగా, ఇప్పుడు పోలవరం నుంచి శ్రీశైలానికి నీటిని తరలించే అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఈ అన్ని ప్రతిపాదనలపై సీఎంల భేటీలో చర్చించనున్నారు. ఈ ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించాక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 

సీఎస్‌ వద్ద ముందస్తు చర్చలు 
కాగా.. శుక్రవారం నాటి సీఎంల భేటీలో చర్చకు వచ్చే అంశాలు, వాటికి సంబంధించిన వివరణలపై తెలంగాణ అధికారులు, ఇంజనీర్లు గురువారం ముందస్తు కసరత్తు భేటీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో ఈఎన్‌సీ మురళీధర్, అంతరాష్ట్ర జల విభాగపు సీఈ నరసింహారావు, హైడ్రాలజీ సీఈ శంకర్‌ నాయక్‌లు సమావేశమై.. గోదావరిలో జలాల లభ్యత, ఇంద్రావతి, ప్రాణహిత, శబరి నదుల్లో నీటి ప్రవాహాలు, లభ్యత, వాటి కింద వినియోగం, సముద్రంలో కలుస్తున్న నీరు, వీటిపై ఇరు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, నిల్వ చేసేలా నిర్మించిన రిజర్వాయర్లు వంటి అంశాలపై అందులో చర్చించారు.

గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ ఇచ్చిన ఇచ్ఛంపల్లి–సాగర్, ఇచ్చంపల్లి–పులిచింతల అనుసంధానంతోపాటు, అకినేపల్లి మీదుగా సాగర్‌కు గోదావరి జలాలను తరలించేలా సిద్ధంచేసిన ప్రతిపాదనలపైనా చర్చ జరిగినట్లుగా తెలిసింది. పోలవరం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశాలు, గతంలో వచ్చిన ప్రతిపాదనలపైనా అధ్యయనం చేశారు. ఇక ఏపీ జల వనరుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్‌ దాస్‌ సైతం సీఎస్‌ జోషితో సమావేశమై అజెండా అంశాలపై చర్చించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top