సమయం లేదు మిత్రమా..

All Parties Get Ready To Campaigning - Sakshi

సొంతంగా ప్రచారం చేసుకుంటున్న కూటమి అభ్యర్థులు

కనిపించని స్టార్‌ క్యాంపెయినర్ల సందడి

మరోవైపు జిల్లాను చుట్టేస్తున్న కేసీఆర్, హరీశ్‌

త్వరలో మహా కూటమి, బీజేపీ ముఖ్య నేతల సభలు

అన్ని పార్టీలను పీడిస్తున్న సమయాభావం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగియనుంది. నియోజకవర్గాల వారీగా వివిధ పార్టీలు, స్వతంత్రులుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత రానున్నది. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలో అడుగు పెట్టేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండున్నర నెలల క్రితమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారు కావడంతో ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసుకుని మరో విడతను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

మహాకూటమిలో అభ్యర్థుల ఖరారు చివరి నిముషం వరకు కొలిక్కి రాకపోవడంతో ఆరు స్థానాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. బీజేపీలో ఒకరిద్దరు మినహా మిగతా అందరూ కొత్త అభ్యర్థులే కావడంతో వారంతా పార్టీ యంత్రాంగాన్ని కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు.

బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే గ్రామాలు, వార్డుల్లో ప్రణాళికబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ మినహా, ఇతర పార్టీల నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు ఇంకా ప్రచార పర్వంలోకి అడుగు పెట్టలేదు. ఎన్నికల ప్రచారం డిసెంబర్‌ ఐదున ముగియనుండగా, మరో పక్షం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలో పరుగులు తీసేందుకు సన్నద్ధమవుతున్నారు.  

ముందున్న కారు..అసెంబ్లీ రద్దు చేసిన రోజే అభ్యర్థులను కూడా ప్రకటించడంతో.. ఇతర పార్టీలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో ముందంజలో కనిపిస్తోంది. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్, మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అరడజను పర్యాయాలు పర్యటించి, ఎప్పటికప్పుడు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించి పార్టీ కేడర్‌ను ఉత్తేజ పరిచే ప్రయత్నం చేశారు.

పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్‌ ఏడున హుస్నాబాద్, ఈ నెల 20న సిద్దిపేట, 21న మెదక్‌లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ నెల 25 తర్వాత జరిగే మలి విడత ప్రచారంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో కనీసం నాలుగు చోట్ల జరిగే సభలకు కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రి హరీష్‌రావు కూడా రోడ్‌షోలు, సభల్లో పాల్గొనేలా ప్రచార షెడ్యూలు రూపొందిస్తున్నారు.

సభలు నిర్వహించని కాంగ్రెస్‌..కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఇప్పటి వరకు జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో ఎన్నికల ప్రచార సభలు జరగలేదు. పార్టీకి చెందిన కీలక నేతలు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తమ సొంత నియోజకవర్గాలకు పరిమితమై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా పలు చోట్ల అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీని జిల్లాలో ఏదో ఒక చోట జరిగే ఎన్నికల ప్రచారాన్ని రప్పించేందుకు పీసీసీ స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లు విజయశాంతి, రేవంత్‌రెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే నర్సాపూర్, జహీరాబాద్‌లో జరిగిన ర్యాలీలకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత జిల్లాకు చెందిన పార్టీ అభ్యర్థులతో కాంగ్రెస్‌ నాయకత్వం సమావేశమై ప్రచార షెడ్యూలును ఖరారు చేసే అవకాశం ఉంది. టీజేఎస్‌ అభ్యర్థులు కూడా మూడు స్థానాల్లో పోటీ ఉండటంతో కోదండరాం కూడా ప్రచార పర్వంలో పాల్గొంటారు.

మోదీని రప్పించే యోచనలో బీజేపీ..
జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని మోడీ సహా జాతీయ స్థాయి నాయకులను కూడా ప్రచారానికి రప్పించే యోచనలో ఉంది. సెప్టెంబర్‌ 28న చేగుంటలో జరిగిన మహిళా శంఖారావంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు.

జిల్లాలో కనీసం మూడు చోట్ల భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహం ఖరారు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు జిల్లాలో జరిగే సభలు, సమావేశాలు, ర్యాలీలో పాల్గొంటారు.

సైలెంట్‌గా బీఎల్‌ఎఫ్‌..
బీఎల్‌ఎఫ్‌ కూటమి తరపున ఇప్పటికే సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు బీవీ రాఘవులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పార్టీ నేతలు ప్రచారానికి రానున్నారు. అయితే సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు ప్రచార ఆర్భాటం లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎంఐఎం
టీఆర్‌ఎస్‌తో హైదరాబాద్‌లో స్నేహపూర్వక పోటీ పేరిట ఎన్నికల బరిలో ఉన్న ఎంఐఎం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నెల ఐదున సంగారెడ్డిలో సమావేశం నిర్వహించిన ఎంఐఎం మరో రెండు చోట్ల కూడా సభలు నిర్వహించే యోచనలో ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top