నోటీసులతోనే సరి!

నల్లగొండ మున్సిపాలిటీలో అద్దెబకాయిల వసూలులో వెనకడుగు 233 దుకాణాల కిరాయి బకాయిలు రూ.4కోట్లపై మాటే..

వసూలులో అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి

ఎవరు ఎంతివ్వాలో లెక్కలు లేని వైనం

అకౌంట్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయలోపం

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండ మున్సిపాలిటీకి చెందిన లీజు షాపుల అద్దె బకాయిలపై ప్రతిష్టంభన నెలకొంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి 233 దుకాణాలు ఉన్నాయి. వీటికి సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా అద్దె బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తిం చారు. లీజు పొందిన ఆయా దుకాణాల వ్యాపారులకు నోటీసులు ఇచ్చి సరి పెట్టారు. బకాయిల వసూళ్లకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఒక్క రూ పాయి వచ్చిన దాఖలాలు లేవు. జేసీ నారాయణరెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన సమయంలో రెండు, మూడు రోజులు స్పె షల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. రెండు, మూడు షాపులను సీజ్‌ చేసే దాకా వెళ్లారు. 

ఆ తర్వాత వ్యాపారులు కొంతసమయం కావాలని కోరడంతో అక్కడికే ఆగిపోయింది. ఇది జరిగి 7 నెలలు దాటినా నేటికీ ఒక్క రూపాయి కూడా వ్యాపారులు  చెల్లించలేదు. అద్దె బకాయిలపై సంబంధిత అధికారులలో చిత్తశుద్ధి లోపించిందనే విమర్శలు లేకపోలేదు. ఏ వ్యాపారి ఎంత బకాయి ఉన్నాడనే వివరాలు సైతం అధికారుల వద్ద లేవు. దీంత వారు కూడా వసూళ్లకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ అయిన వెంటనే వ్యాపారులు కూడా ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెప్పించడంతో దీనికి ఒక ముగింపు లేకుండా పోయింది. చివరికి మున్సిపల్‌ లీజు షాపుల అద్దె బకాయిలు గుట్టలా పేరుకుపోతున్నాయి.

ఏ వ్యాపారి ఎంతివ్వాలో తెలియని పరిస్థితి
నల్లగొండ మున్సిపాలిటీకి ప్రకాశంబజార్, న్యూప్రేమ్‌టాకీస్, తహసీల్దార్‌ కార్యాలయం, ప్రకాశంబజార్‌ డ్రెయినేజీలపై, పాతచౌరస్తాలో మొత్తం 233 దుకాణాలు ఉన్నాయి. వీటిని వ్యాపారులకు లీజుకు ఇచ్చారు. అయితే ఏ వ్యాపారి ఎంత అద్దె బకాయి పడ్డాడనే వివరాలు మున్సిపాలిటీ వద్ద లేవు. ఈ లెక్కలు ఉంటే వసూళ్లు చేయడానికి కొంత సులభంగా ఉంటుంది.  లీజు షాపుల బకాయిలు వసూలైతే అభివృద్ధి పనులకు  నిధుల కొరత ఉండదు.  లీజు షాపుల వ్యాపారులు నేరుగా మున్సిపల్‌ కార్యాలయంలో చెల్లించే ఏర్పాట్లు చేయకపోవడమూ బకాయిలు పెరిగిపోవడానికి  మూల కారణంగా భావిస్తున్నారు.  కొంతమంది నిజాయితీ గల వ్యాపారులు అద్దె చెల్లిస్తున్నా వారు ఎంత చెల్లించింది కనుక్కోవడం మున్సిపాలిటీ అధికారులకు ఇబ్బందిగా మారింది. చలాన్‌ ద్వారా బ్యాంకులలో అద్దె చెల్లించాలని దశాబ్ధం క్రితం అప్పటి మున్సిపల్‌ అధికారులు చెప్పినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కానీ 2010 నుంచి వ్యాపారులు అద్దె చెల్లించడం చాలావరకు మానేశారు. ఇలా ప్రతి సంవత్సరం అద్దె చెల్లింపులు జరగకపోవడంతో కోట్ల రూపాయలు బాకీ పడ్డారు.

అంతా గందరగోళం..గజిబిజి
మున్సిపల్‌ షాపుల అద్దెకు సంబంధించిన లెక్కలు అంతా గందరగోళంగా ఉన్నాయి. ఏడేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు లెక్క తేల్చడం అధికారులకు తలనొప్పిగా మారింది. వ్యాపారులు చెల్లించిన ఓచర్లు కూడా మున్సిపల్‌ అధికారులకు సమర్పించకపోవడంతో లెక్క సరిగా దొరకని పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీలో అకౌంట్, రెవెన్యూ విభాగాల సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  దాదాపు రూ.4 కోట్ల బకాయిలు ఉన్నా.. వాటిని ఎలా రాబట్టాలనే దానిపై మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు లేకపోలేదు. ఇరు విభాగాలను సమన్వయం చేసి, అకౌంట్‌ విభాగం ద్వారా బ్యాంకులలో ఏడేళ్లనుంచి జమ చేసిన వివరాలు బయటికి తీస్తే లెక్క తేలే అవకాశం ఉంది. అప్పుడు అందరి జాబితా తీస్తే బకాయిలు పడ్డ వారినుంచి నెల రోజుల్లోనే డబ్బులు వసూలు చేసే వెసులుబాటు కలుగుతుంది. మున్సిపల్‌ ఉ్నతాధికారులు జో క్యం చేసుకుంటేనే బకాయిల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top