తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షుడి అరెస్ట్‌

ACB arrests LB Nagar judge Vaidya Vara Prasad - Sakshi

వరప్రసాద్‌ను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన అధికారులు

14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన న్యాయస్థానం

రిమాండ్‌ నేపథ్యంలో వరప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు వేయనున్న హైకోర్టు

సోమవారం ఆ మేర ఉత్తర్వులిచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు వైద్య వరప్రసాద్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వరప్రసాద్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసు నిబంధనల ప్రకారం 48 గంటలపాటు ప్రభుత్వ ఉద్యోగి జైల్లో ఉంటే ఆ ఉద్యోగిని సస్పెండ్‌ చేయవచ్చు. వరప్రసాద్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడటం ఖాయమని తెలుస్తోంది.

సోమవారం హైకోర్టు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉంది. వరప్రసాద్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ హైకోర్టుకు నాలుగు నెలల క్రితం ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరపాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు వరప్రసాద్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడిబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. వాటిని ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు. ప్రధాన న్యాయమూర్తి వాటిని పరిశీలించి వరప్రసాద్‌పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీకి అనుమతినిచ్చారు.

దీంతో ఏసీబీ అధికారులు వరప్రసాద్‌పై ఈ నెల 13వ తేదీన కేసు నమోదు చేసి, 14న హైదరాబాద్, సిరిసిల్ల, మహారాష్ట్రలలో ఉన్న ఆయన ఇళ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాత్రి వరకు తనిఖీలు కొనసాగించిన అధికారులు వరప్రసాద్‌కు రూ. 1.50 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 3 కోట్లుగా తేల్చారు. అనంతరం బుధవారం రాత్రి వరప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. తెల్లవారుజామున ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

బినామీగా స్నేహితుడు..
తనిఖీల్లో లభించిన ఆధారాలతో వరప్రసాద్‌ ఆస్తులకు ఆయన స్నేహితుడు సుదర్శన్‌ బినామీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో ఉన్న సుదర్శన్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వరప్రసాద్‌ రెండు సార్లు అమెరికా వెళ్లడంతోపాటు చైనా, హాంకాంగ్, మలేసియా, మకావు, సింగపూర్‌ దేశాలకు కుటుంబ సభ్యులతో వెళ్లారని, ఇందుకు రూ.లక్షల రూపాయలు వెచ్చించారని ఏసీబీ అధికారులు తెలిపారు. కొండాపూర్‌లోని ఇంటిని కూడా విలాసవంతంగా నిర్మించి రూ.లక్షల విలువ చేసే రిక్లయినర్‌ కుర్చీలు, ఏసీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top