మరో 62 మందికి కరోనా

62 Corona Positive Cases Registered In Telangana - Sakshi

రాష్ట్రంలో 1,761కి చేరిన కేసులు

ముగ్గురు మృతి.. 48కి చేరిన మరణాలు

పోలీసుశాఖలో మరో ఇద్దరికి పాజిటివ్‌

మొత్తం కేసుల్లో 118 వలసదారులవే

కేంద్రమంత్రి హర్షవర్థన్‌కు మంత్రి ఈటల ఫోన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం మరో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు ఉండగా.. 19 మంది వలసదారులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,761కి చేరుకుంది.  కరోనాతో శుక్రవారం ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 48కి చేరింది. తాజాగా ఏడుగురు కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1,043 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారు. వలసదారుల్లో కరోనా కేసులు  ఎక్కువ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 118 వలసదారులు ఉన్నారు.

పెరుగుతున్న కేసులపై ఈటల ఆరా...
తెలంగాణలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో మంత్రి ఈటల రాజేందర్‌ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే అంశంపై ఆరా తీశారు. అన్ని ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎంత మంది అవసరమవుతారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఖాళీలన్నింటినీ పూర్తిచేయాలని కోరారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయాందోళనలు చెందవద్దని, అయితే ఎవరికి వారు వ్యక్తిగత రక్షణ తీసుకోవాలని సూచించారు.

హర్షవర్ధన్‌కు ఈటల అభినందనలు.. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డ్‌ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి ఈటల ఫోన్‌లో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఈటల ఆయనతో చర్చించారు. వలస కార్మికుల వల్ల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను 14 రోజుల పాటు హోటల్‌లో ఉంచుతున్నట్టు చెప్పారు. అయితే వారిలో కేన్సర్‌ పేషెంట్లు, గర్భిణీలు, డయాలసిస్‌ రోగులు, ఇతర సీరియస్‌ అనారోగ్యంతో ఉన్న వారికి ఇబ్బందులు వస్తున్నాయని వెల్లడించారు. అలాంటివారిని ఏడు రోజుల పాటు ఉంచి పరీక్ష చేసి నెగెటివ్‌ వస్తే ఇంట్లో క్వారంటైన్‌ చేసే అవకాశం ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు.

ఎస్‌ఐ, డీఐకి కరోనా
పహాడీషరీఫ్‌/చిలకలగూడ: కరోనా కేసులతో పోలీసుశాఖ తల్లడిల్లుతోంది. ఓ కానిస్టేబుల్‌ ఈ మహమ్మారి సోకి మరణించిన మరుసటి రోజే ఇద్దరు పోలీసు అధికారులకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్, మరో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌కు కరోనా వచ్చింది. దీంతో వారిద్దరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఆయా స్టేషన్ల సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఎస్‌ఐని కలిసిన ప్రజలు ఎవరైనా ఉన్నారేమో గుర్తించి వారిని క్వారంటైన్‌ చేయాలని నిర్ణయించారు. ఇక డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రెండు నెలల ముందే తన కుటుంబ సభ్యులను సొంతూరు కోదాడకు పంపించేయడంతో వారికి వైరస్‌ ముప్పు తప్పింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top