-
కాంగ్రెస్ X బీఆర్ఎస్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణతో సిద్దిపేటలో మంగళవారం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ చేపట్టింది. మరోవైపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ రైతు రుణమాఫీ సాధనకు సమావేశం నిర్వహించారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొనగా, 500 మంది పోలీసులను మోహరింపజేశారు. కాంగ్రెస్ భారీ ర్యాలీముందుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హైదరాబాద్ నుంచి కార్ల ర్యాలీతో సిద్దిపేటకు చేరుకున్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా పొన్నాల జంక్షన్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ పాత బస్టాండ్ వరకు సాగింది. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. పొన్నాల వై జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు పోలీసులు ర్యాలీకి అనుమతినిచ్చారు. బీఆర్ఎస్ సమావేశ నేపథ్యంలో హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయం ఎదుట నుంచి కాకుండా బైపాస్ (సుడా రోడ్) నుంచి ఎన్సాన్పల్లి జంక్షన్ మీదుగా విక్టరీ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీని పంపించారు. ఎమ్మెల్యే రోహిత్ కారు క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా వెంటనే మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు వచ్చి సుడా రోడ్డుకు మళ్లించారు.ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకోగా స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ రైతు రుణమాఫీ 200 శాతం చేశామని, హరీశ్ రాజీనామా చేయాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ సమావేశంసిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంలో సంపూర్ణ రైతు రుణమాఫీ సాధన కార్యాచరణ సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతోపాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పంచాయితీ కాదని, రైతులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయితీ అని అన్నారు. -
దమ్ముంటే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయ్: కేటీఆర్‌కు జగ్గారెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేము ఖాళీగా ఉన్నామా అంటూ కేటీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ చీఫ్ లిక్కర్ తాగినట్టుగా ప్రవర్తిసున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల పెడతామని రేవంత్ అన్నారు. రాజీవ్ విగ్రహం ముట్టుకుంటే చెప్పుతో కొడతానన్న సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.పొలిటికల్ కోచింగ్ సెంటర్లో కేటీఆర్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. కేటీఆర్‌కు ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియడం లేదు. కేసీఆర్.. కేటీఆర్‌కు కోచింగ్ ఇప్పిస్తే మంచిది. పదేళ్ల కాలంలో జర్నలిస్టుల సమస్యల కోసం, ప్లాట్ల కోసం ఏనాడైనా అల్లం నారాయణ కోట్లాడిండా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కర్ణాటకలో డీకేశివకుమార్‌లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘పొంగులేటి ఇక్కడ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకేదో పదవి ఆశిస్తున్నాడనిపిస్తోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం పదవిపై పడింది. సీఎంను కాదని కొడంగల్ అబివృద్ధి కాంట్రాక్టు పొంగులేటికి వచ్చింది. భట్టి ఉపముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్‌లో లేరు. అమెరికా పర్యటనలో రేవంత్ తీసుకొచ్చిన వేల కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? సీఎం కుటుంబ సభ్యుల్లో ఎవరెంత పెట్టుబడి పెడుతున్నారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలి. మంత్రిగా ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో లేదు. ఎస్కేలేషన్, ప్రైస్ హైక్ మీద మాకు అనుమానం ఉంది. తన వెంట కొంత మంది ఎంఎల్ఏలు ఉన్నారని భయపడి పొంగులేటి కి కాంట్రాక్టు ఇచ్చారా? సీఎం సమాధానం చెప్పాలి. కొంత మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పొంగులేటి సీఎంను బ్లాక్మెయిల్ చేస్తున్నారు’అని మహేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని.. సీఎం రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయలని.. అప్పటిదాకా ప్రభుత్వంపైన పోరాటం ఆగదని కేటీఆర్ హెచ్చరించారు. -
రుణమాఫీ చేయలేకే.. విగ్రహాల లొల్లి: బండి సంజయ్
సాక్షి,కరీంనగర్ జిల్లా: రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల హామీలపై చర్చను మళ్లించడానికే కాంగ్రెస్,బీఆర్ఎస్ విగ్రహాల లొల్లి ముందుకు తీసుకు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాల్ ప్రతి సవాల్ ప్రజల దృష్టిని మళ్ళించడానికే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేటిఆర్ కూల్చుతామంటే ఎలా కూల్చుతారో చూస్తామని కాంగ్రెస్ అనడం ఆ రెండు పార్టీలు కూడబలుక్కుని మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.అసలు విగ్రహాలు సమస్యనా?...రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు అందక సమస్యలతో సతమతం అవుతున్నారు. దానిపై చర్చించకుండా విగ్రహాలపై మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ బోగస్. ఆరు గ్యారంటీ స్కీమ్‌ల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలి’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
హరీశ్‌రావు.. నాపై పోటీ చేయి: మైనంపల్లి సవాల్
సాక్షి,సిద్దిపేటజిల్లా: సిద్దిపేట పట్టణంలో మంగళవారం(ఆగస్టు20) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పట్టణంలో మంగళవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలకు పిలుపునివ్వడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ తరలి వెళుతున్నారు. దీంతో వీరిరువురి మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది.‘మేం ధ్వజం ఎత్తాలనుకుంటోంది బీఆర్ఎస్పైన.. హరీష్ రావుపైనో ప్రజలపైనో కాదు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు. మేం ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నాం.వారు రేపు కూడా రైతు రుణమాఫీ ర్యాలీ చేసుకోవచ్చు. కానీ, మా ర్యాలీ అడ్డుకునేందుకే పోటాపోటీ ర్యాలీ పెట్టి ఉద్రిక్తతలు పుట్టిస్తున్నారు. వాళ్ల అంతు చూసేదాకా వదలబోం. రుణమాఫీ చేసినందున హరీశ్‌రావు మళ్లీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరం మళ్లీ పోటీ చేద్దాం. హరీశ్ మళ్లీ గెలిస్తే నేను రాజకీయాల్లో నుంచి వెళ్లిపోతా’అని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు సవాల్ విసిరారు. అయితే రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ర్యాలీకి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. తాము కూడా ర్యాలీ చేసి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు తెగేసి చెబుతున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. -
రేవంత్.. నా మాటలను గుర్తు పెట్టుకో: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన రోజునే తొలగిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చీప్ మినిస్టర్ రేవంత్ నా మాటలను గుర్తు పెట్టుకో అని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం. బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నీచమైన ఆలోచన విధానాన్ని చూపుతుంది. మీరు మానసిక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’అని కేటీఆర్ అన్నారు.Mark my words Cheap Minister RevanthWe will clear out the trash from the surroundings of Dr. B. R. Ambedkar secretariat the very same day we are back in officeCan’t expect a Delhi Ghulam like you to ever understand self-respect & pride of Telangana Using filthy language in…— KTR (@KTRBRS) August 20, 2024ఇదిలా ఉండగా.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే.. కొంతమంది తొలగిస్తామంటున్నారు. ఎవరికైనా చేతనైతే విగ్రహాన్ని ముట్టుకోండి.. వాళ్లను కొట్టి తీరతామంటూ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన. ఆ బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తామని అన్నారాయన. రాజీవ్ విగ్రహం స్థానంలో కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. -
రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఐటీ అభివృద్ధికి పునాది వేసిందే కాంగ్రెస్ అని, కానీ.. చరిత్ర తెలియని వారు తాము ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలో కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే.. కొంతమంది తొలగిస్తామంటున్నారు. ఎవరికైనా చేతనైతే విగ్రహాన్ని ముట్టుకోండి.. వాళ్లను కొట్టి తీరతామంటూ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన. ఆ బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తామని అన్నారాయన. రాజీవ్ విగ్రహం స్థానంలో కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. .. ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారు. అలాంటి వాళ్లకా విగ్రహాలు పెట్టేది? అని రేవంత్ ప్రశ్నించారు. అధికారం పోయినా బలుపు తగ్గలేదని, ఆ బలుపును తగ్గించే బాధ్యతను కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారని బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారాయన. కలలో కూడా నీకు అధికారం రాదు అని కేటీఆర్‌పై మండిపడ్డారు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని, పండగ వాతావరణంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. సచివాలయం బయట కాదు.. పది సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా? అంటూ బీఆర్ఎస్ను సీఎం రేవంత్ ప్రశ్నించారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతాం.. అదీ సచివాలయం బయట కాదని, లోపల ఏర్పాటు చేస్తామని అన్నారాయన. బీఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్టు మాట్లాడితే సామాజిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తికొంత మంది అమెరికాలో చదువుకుని వచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ. దేశంలో విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ. మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేశారు. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారు. ఆ పేరుతో స్పోర్ట్స్ యూనివర్సిటీమొన్నీమధ్య జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో చిన్న దేశం సౌత్ కొరియా కంటే ఇండియా ప్రదర్శన పేలవంగా ఉంది. అందుకే ఆటగాళ్లను ప్రొత్సహించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. 1921 నుండి 1931 వరకు గాంధీ నడిపిన పత్రిక పేరు యంగ్ ఇండియా. అందుకే.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ త్వరలోనే నెలకొల్పుతాం అని సీఎం రేవంత్ అన్నారు. -
అధికారంలోకి వచ్చాక ‘రాజీవ్’ పేరు తొలగిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశంలో మాజీప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచి్చన తర్వాత ఆ విగ్రహాన్ని మరోచోటకు తరలిస్తామన్నారు. నందినగర్ నివాసంలో కేటీఆర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేర్ల మార్పుపై ఏనాడూ ఆలోచించలేదు. ఆరోగ్యశ్రీ పథకం, ట్రిపుల్ ఐటీ, ఉప్పల్ స్టేడియం, కరీంనగర్– మంచిర్యాల రాష్ట్ర రహదారి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితరాలకు రాజీవ్‌గాంధీ పేరు ఉన్నా మా ప్రభుత్వం ఏనాడూ మార్చే ప్రయత్నం చేయలేదు. రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటే గాం«దీభవన్లోనో, రేవంత్‌రెడ్డి ఇంట్లోనో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. రాష్ట్ర సాధన ఉద్యమమే ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగింది. కానీ వందలాదిమంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ మాత్రం మరోమారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణతల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ విగ్రహాన్ని పెడుతోంది. తెలంగాణతల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ సమాజం మరిచిపోదు. మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి కాంగ్రెస్ పార్టీ కోరుకున్న చోటుకు పంపిస్తాం. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ మహనీయుడి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతాం. రాజీవ్‌గాంధీ పేరిట ఉన్న సంస్థల పేర్లను కూడా మార్చే దిశగా ఆలోచిస్తామని ఢిల్లీకి గులాములుగా ఉన్న కాంగ్రెస్ నేతలకు చెబుతున్నా’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి ‘తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సచివాలయం ఎదురుగా ప్రతిíÙ్ఠంచాలనే ఉద్దేశంతో ఒక ఐలాండ్ కూడా నిర్మించాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెడుతోంది. జై తెలంగాణ అనని సీఎం రేవంత్ కనీసం అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదు. దివంగత మాజీ సీఎం అంజయ్య పేరిట ఏర్పాటు చేసిన పార్కును లుంబినీగా మార్చి, అదే పార్కు ఎదుట ఆయన్ను అవమానించిన రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. పదేళ్ళ పాలన ఓ యజ్ఞంలా సాగించాం – కేటీఆర్‌తో శ్రీలంక వాణిజ్యమంత్రి భేటీ రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలనను ఓ యజ్ఞంలా సాగించి అసాధారణ ఫలితాలు సాధించామని కేటీఆర్ అన్నారు. శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలందేరన్ కేటీఆర్‌తో నందినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సమయంలో హైదరాబాద్‌ను అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు స్ఫూర్తిదాయకమని సతాశివన్ అన్నారు. హైదరాబాద్ వంటి ఆర్థిక ఇంజిన్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. పదేళ్లకాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని తాను శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించిన విషయాన్ని సతాశివన్ కేటీఆర్‌కు వెల్లడించారు. ఈ భేటీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నేతలు జాజాల సురేందర్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. రాఖీ రోజు నా సోదరి వెంట లేదు – ‘ఎక్స్’లో కేటీఆర్ భావోద్వేగం ‘ఈ రోజు నాకు రక్షా బంధనం చేయలేకపోవచ్చు. కానీ నీ కష్టసుఖాల్లో వెంట ఉంటా’అని కేటీఆర్ తన సోదరి కవితను ఉద్దేశించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. గతంలో తన సోదరి రాఖీ కట్టిన ఫొటోలను సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘155 రోజులుగా కవిత ఎంతో వేదన అనుభవిస్తోంది. సుప్రీంకోర్టులో ఆమెకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. కాగా రాఖీ పండగ సందర్భంగా తెలంగాణభవన్‌లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ పదేళ్లపాలనలో తెలంగాణలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనల వివరాలు ఇస్తామని మంత్రి సీతక్క చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. ‘ఎనిమిది నెలల్లో కొల్లాపూర్, షాద్‌నగర్ సహా అనేక చోట్ల మహిళల పట్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోందో తెలుసు. కోల్‌కతాలో యువ వైద్యురాలిపై అఘాయిత్యం చేసి చంపేస్తే, నిరసన తెలుపుతున్న డాక్టర్లు తెలంగాణ తరహాలో న్యాయం చేయండి అంటున్నారు. దటీజ్ తెలంగాణ.. దటీజ్ కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయింది’అని కేటీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నిజంగా రుణమాఫీ చేస్తే.. రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం వడుదల చేయాలి. రైతులకు క్లియరెన్స్ సర్టిఫిటికెట్ ఇవ్వాలి. చనిపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. సోనియాగాంధీ బర్త్ డే రోజున కూడా కూడా మోసం చేశారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది కాంగ్రెస్. రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారు?. రైతుల పక్షాన పోరాడుతాం. విలీనాలు వద్దు.. దండం పెడుతా. ..గతంలో రేవంత్ రెడ్డి బీజేపీ అని బీజేపీలోకి పోతారని ప్రచారం చేశారు. 30 వేల ఉద్యోగాలు ఏ దేశంలో ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పాలె. నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ను చేర్చుకోవాల్సిన అవసరరం బీజేపీకి లేదు. కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఉంది. బీఆర్ఎస్ను కలుపుకుంటే మా ప్రభుత్వం ఏమైనా వస్తదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పక్కాగా కలుస్తాయి. కేసీఆర్ కుటుంబాన్ని లోపల ఎందుకు వేయలేదు?. కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, భూ స్కామ్ అన్నీ అటకెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక చేరికలు మాత్రమే ఉన్నాయ్. ప్రజలు కోరితే తప్ప అధికారులు, నాయకులూ స్పందించే పరిస్థితి లేదు. సాగు, తాగు నీటి వంటివాటిపై రివ్యూ లేదు’అని అన్నారు. -
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ స్వింఘ్వీ నామినేషన్ వేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్‌మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు.అసెంబ్లీ దగ్గర రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘అక్క, చెల్లెమ్మలకు రాఖి పండుగ శుభాకాంక్షలు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలు తీసుకువచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించాం. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇవ్వలేదు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు రుణాలు ఇచ్చింది. మహిళల రక్షణ విషయంలోను మా ప్రభుత్వం హై ప్రయారిటీ ఇస్తుంది. అభిషేక్ సింఘ్వీ మను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చారు. మన రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ మను వెళ్ళడం వలన మన రాష్ట్రానికి అన్నివిధాల న్యాయం జరుగుతుంది. అభిషేక్ సింఘ్వీ మను రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నాను’అని అన్నారు.ఆదివారం సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా సీఎల్పీ తీర్మాణం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిని కావడం గర్వంగా ఉందని సింఘ్వీ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టుల్లో నా వాదన వినిపిస్తానని తెలిపారు. -
‘రుణమాఫీ’ని పక్కదోవ పట్టించేందుకే విలీన డ్రామాలు
సాక్షి, హైదరాబాద్ / సుల్తాన్‌బజార్: రుణమాఫీ సహా ఆరు గ్యారంటీల అమలు అంశాన్ని పక్క దోవ పట్టించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం విలీన డ్రామాలు మొదలు పె ట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకే అవసరం ఉంది తప్ప బీజేపీకి కాదని అన్నారు. అవుట్ డేటెడ్, అవినీతి పార్టీ అయిన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవలసిన ఖర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఆదివారం కోఠిలోని ది యంగ్మ్యాన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలసి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ‘విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి.. వాటితో ప్రజలకేం సంబంధం?’అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు.ఎన్నికల్లో రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో కేవలం రూ. 26 వేల కోట్లు కేటాయించారని, చివరకు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తారని సంజయ్ నిలదీశారు. కాగా, ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశంపై కుట్రలు చేస్తున్నాయని వాటిని ప్రధాని మోదీ సమర్థంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. గురుకుల ఉద్యోగాల్లో మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయండితెలంగాణ రెసిడెన్షియల్ విద్యా సంస్థల రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఏమైంది మీ వరంగల్ డిక్లరేషన్?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకిచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని రేవంత్‌రెడ్డి సర్కార్ నీరుగార్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీకి అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు.రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.17 వేల కోట్ల మాఫీతో రైతులను నట్టేట ముంచిందంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆదివారం ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. వరంగల్ డిక్లరేషన్‌లో మీరిచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని, రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరఫున కాంగ్రెస్ పార్టీపై పోరాడతామని హెచ్చరించారు.47 లక్షల మందికి గాను 22 లక్షల మందికేనా?‘అబద్ధాలు, అభూతకల్పనలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్.. 8 నెలలుగా ఊరించి ఊరించి చివరికి రైతులను ఉసూరుమనిపించారు. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారు.‘రూ. రెండు లక్షల రుణమాఫీకి రూ.49,500 కోట్లు కావాలని ఎస్ఎల్బీసీ అంచనా వేయగా, రూ.40వేల కోట్లు అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. కేబినెట్ భేటికి వచ్చేసరికి దాన్ని రూ.31 వేల కోట్లకు కుదించారు. తీరా మూడు విడతల మాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో మమ అనిపించారు’ అని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ కాని అన్నదాతల ఆందోళనలతో యావత్ తెలంగాణ అట్టుడుకుతోందని, రుణమాఫీకి సంబంధించి తమ పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు వారం రోజుల్లోనే 1,20,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ చావుకు కారకులెవరు?మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్య లతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకోవడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. జీతం రాక కుటుంబం గడవక, భార్యా పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాసుకున్నాడని, ఈ ఘటన విషాదకరమని పేర్కొన్నారు.ప్రతీనెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలి స్తున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తు న ప్రచారం చేసుకోవడమే తప్ప అందులో వాస్తవం లేదని విమర్శించారు. కాగా తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వానికి పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
అందరికీ రుణమాఫీ కోసం 23న రైతుదీక్ష
నిర్మల్: రాష్ట్ర ప్రభు త్వం అర్హులైన రైతు లందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేయనిపక్షంలో ఈనెల 23న రైతులతో భారీ రైతుదీక్ష చేపడతామని ప్రకటించారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించిందని.. ఇప్పటి కే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు.రాష్ట్రంలో 60 లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ చేయడమేంటని ప్రశ్నించారు. రూ.49 వేల కోట్ల రుణాలకుగాను.. రూ.17 వేల కోట్లే ఇ చ్చారని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతు లను మళ్లీ మోసం చేసేందుకే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు దమ్ముంటే.. గ్రామాలకు వెళ్లి పూర్తిస్థాయి లో రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని.. రైతుభరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులను ఈ నెలా ఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కావాలంటే కేటీఆర్‌కు ఆ డేటా ఇస్తా: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషన్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేస్తే బాగుంటుందని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో 2014 -23 మధ్య మహిళలపై దాడుల డేటా మొత్తం నా దగ్గర ఉంది.. కావాలంటే కేటీఆర్‌కు ఆ డేటా ఇస్తా. మహిళా కమిషన్‌ను మేం కూడా కలుస్తాం’’ అని సీతక్క చెప్పారు.యథాలాపంగా మాట్లాడా అంటూనే వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ తిట్టిస్తున్నాడు. రుణమాఫీ చేతగాని ప్రభుత్వం బీఆర్ఎస్.. మేము పూర్తిగా రుణమాఫీ చేయకముందే విమర్శలు ఎందుకు? అంటూ సీతక్క దుయ్యబట్టారు.తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బస్సుల్లో బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
TG: సీఎల్పీ సమావేశం.. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ పరిచయం చేశారు.కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ రేపు(సోమవారం) తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. -
వాస్తవం ఇదే.. రాహుల్, ఖర్గేకు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగాన్ని రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులు లక్షలాది మంది ఉన్నారని.. ప్రభుత్వం షరతులు పెట్టి 40 శాతం మందికే రుణమాఫీ చేసిందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నా.. ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను లేఖలో కేటీఆర్ వివరించారు.40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచింది. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలి. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారు. సీఎం మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే.. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పైన పోరాడతాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉంది: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని కోఠిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ పార్టీకే ఉంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి. వాటితో ప్రజలకేం సంబంధం?. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా? రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు. ...కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పింది. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించి.. చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా?. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్ధమయ్యాయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు’’ అని మండిపడ్డారు. -
సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సిద్దిపేటలో మొదలైన ఫ్లెక్సీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, సవాళ్లతో సిద్దిపేట శనివారం రణరంగంగా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇరుపార్టీలకు చెందిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నిరసన ర్యాలీ: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసినందున ఎమ్మెల్యే పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాత్రి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, తెల్లవారుజామున వదిలి పెట్టారు. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే హరీశ్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడ్డాయి.అక్కడ కేసీఆర్, హరీశ్‌రావు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని చించేశాయి. దీంతో శనివారం సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. హరీశ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. తర్వాత బీజేఆర్ చౌరస్తాలో ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు చించివేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలను ఝుళిపించారు. బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.ర్యాలీగా కాంగ్రెస్: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను బీజేఆర్ చౌరస్తాలో పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసుల కన్నుగప్పి క్యాంప్ ఆఫీస్ వైపు చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. క్యాంప్ ఆఫీస్ గేట్ వద్దకు చేరు కున్న కాంగ్రెస్ నాయకుడు మహేందర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయ డంతో పరిస్థితి చేయిదాటిపోతుందనే ఆందోళన నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరుపార్టీలు పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేశారు. -
100% రుణమాఫీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
సాక్షి, హైదరాబాద్: రైతులకు వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూ పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి రైతుల సమక్షంలోనే చర్చ పెట్టి, పూర్తిగా రుణమాఫీ జరిగిందంటే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. అందరికీ రుణ మాఫీ జరగలేదని రైతులు చెబితే, రేవంత్‌రెడ్డి రాజ కీయాల నుంచి తప్పుకోవడమో, రాజీనామా చేయడమో.. ఏది చేస్తా రో చెప్పాలని డిమాండ్ చేశారు.శనివారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రేవంత్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందన్నారు. మొత్తం 60 లక్షల మంది అర్హులుండగా.. 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీకి రూ.49 వేల కోట్లు ఇవ్వాల్సిఉండగా.. కేవలం రూ.17 వేల కోట్లే ఇచ్చారని తెలిపారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కు దమ్ముంటే గ్రామాలకు వెళ్లి రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. దీనిపై రైతుల సమ క్షంలో చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రుణమాఫీ జరిగిన రైతుల వివరాలను వారంరోజు ల్లోగా ప్రభుత్వం వెల్లడించాలన్నారు.పెండింగులో ఉన్న రైతుల రుణాలను ఈ నెలా ఖరులోగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదికపై చర్చించి, రైతు భరోసా పథకానికి మార్గదర్శ కాలు ఖరారు చేసేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. రైతు భరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రేవంత్ కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని రేవంత్ ప్రచారం చేస్తున్నారన్నారు. -
నీ గాడ్ ఫాదర్‌కే భయపడలేదు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీని పాక్షికంగా అమలు చేసి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెట్టి.. సీఎం నోరు పెద్దగా చేసుకుని మాట్లాడితే లాభం ఉండదు. బూతులు తిడితే రుణమాఫీ జరిగి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా. దమ్ముంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయి. తప్పు జరిగిందని రైతులకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘రుణమాఫీలో కోతలపై ప్రశ్నిస్తే మేము చావాలని రోత మాటలు మాట్లాడుతున్నాడు. నీ గాడ్ ఫాదర్‌కే భయపడలేదు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. రైతులందరికీ రుణమాఫీ వర్తించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌ను వదిలి పెట్టం. బీఆర్ఎస్ పక్షాన మరో రైతాంగ ఉద్యమానికి త్వరలో కార్యాచరణ ప్రకటించి పోరాటం చేస్తాం’ అని హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేటలో తన క్యాంపు ఆఫీసుపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ఎక్కడికి రమ్మంటావో దమ్ముంటే చెప్పు‘రైతులందరికీ రుణమాఫీ జరిగిందని మభ్యపెడుతూ మోసగిస్తున్న రేవంత్‌రెడ్డి సిద్దిపేట, కొడంగల్ సహా ఏ నియోజకవర్గానికి ఏ తేదీన, ఏ టైమ్‌కు రావాలో దమ్ముంటే చెప్పాలి. రైతులందరికి రుణమాఫీ జరిగిందని నిరూపించాలి. ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారంటీల సంపూర్ణ అమలు చేయాలనే నా డిమాండ్‌ను పక్కన పెట్టి నేను రాజీనామా చేయాలని రంకెలు వేస్తున్నవు. రుణమాఫీ జరగని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ అధికారుల కాళ్ల మీద పడుతున్నరు.అయినా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవహరిస్తోంది’ అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పరిపాలన ఫ్లాప్.. తొండి చేయడంలో తోపు.. బూతులు మాట్లాడ్డంలో టాప్ అన్నట్లుగా రేవంత్ పనితీరు ఉంది. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగవేసినట్లు ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రుణమాపీ అర్హుల సంఖ్య 47 లక్షలుగా చూపి, మూడు విడతల్లో 22 లక్షల మందికే వర్తింప చేశారు’ అని చెప్పారు.ప్రజలకు కీడు చేయొద్దని వేడుకుంటా..‘ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తానంటూ గుడులు, చర్చి, మసీదు సాక్షిగా హిందూ, క్రిస్టియన్లు, ముస్లింలు నమ్ముకున్న దేవుళ్లపై రేవంత్ ఒట్లు వేసి మాట తప్పి రైతు, దైవద్రోహానికి పాల్పడ్డాడు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు. అది రాష్ట్రానికి చుట్టుకుంటుందని ప్రజలు భయపడుతున్నారు. ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశం సీఎంకు లేదు కాబట్టి ఆయన చేసిన పాపం ప్రజలకు శాపం కావద్దని మా పార్టీ నేతలతో కలిసి నేను తీర్థయాత్రకు బయలుదేరుతా.ఈ పాపాత్ముడు చేసిన తప్పులకు ప్రజలకు కీడు చేయొద్దని ముక్కోటి దేవతలతోపాటు అల్లా, జీసస్‌ను వేడుకుంటా. త్వరలో పర్యటన షెడ్యూలు ప్రకటిస్తా’ అని హరీశ్ చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొందరికి రుణమాఫీ కాలేదు: మల్లు రవి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు.. ఆ విషయం తమకు తెలుసు అని కామెంట్స్ చేశారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.కాగా, ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల నిధుల కింద 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఐదేళ్ళ నుంచి ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్ఎస్ పదేళ్లలో 20వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే, మా ప్రభుత్వం 31 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కొందరు రైతులకు రుణమాఫీ కాలేదనే విషయం మాకు తెలుసు. రుణమాఫీ ఫిర్యాదులపై కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తాం. రెండు లక్షలలోపు ఉన్న వారికే రుణాలు మాఫీ అవుతుంది. ఎవరికైనా మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం. బీఆర్ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయం.ఇక, అందరికీ రుణమాఫీ చేసేందుకు బడ్జెట్ అందుబాటులో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులలో తెలంగాణను ముంచింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. బీజేపీ జెండా కప్పుకుని చచ్చిపోతానని రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో అన్నారని కేటీఆర్ చెప్పడం పిచ్చికి పరాకాష్ట. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మాటలు వింతగా ఉన్నాయి. ఇప్పటిదాకా బండి సంజయ్ మాటలు విని ఇక నుంచి వినడం అనవసరం. కేటీఆర్‌కు పీసీసీ అనడంలో అర్థం ఉందా?. కాలేశ్వరంపై విచారణ జరుగుతోంది. ఎవరికైనా చట్ట ప్రకారమే శిక్షలు పడతాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ నేతలకూ రుణమాఫీ!!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీపై తీవ్ర చర్చ నడుస్తోంది. రుణమాఫీ చేసినట్టు హస్తం పార్టీ నేతలు చెబుతుండగా.. అర్హులకు మాఫీ కాలేదని, అసలు డబ్బులే ఇవ్వలేదని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ నేతలకు కూడా రుణాలు మాఫీ కావడం ఆసక్తికరంగా మారింది.కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారిలో కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, గంప గోవర్ధన్, బొడిగే గాలేయ్య, బిగాల గణేష్, పాయల్ శంకర్, దుర్గం అశోక్, హర్ష్ పటేల్ గుప్తా వంటి నేతలు ఉన్నారు. వీరిలో లక్షల్లో రుణాలు మాఫీ జరిగినట్టు సమాచారం. వీరి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు తెలుస్తోంది.వీరికి రుణమాఫీ ఇలా.. హర్ష్ పటేల్ గుప్తా: లక్షా 60వేలుజోగు రామన్న: లక్షా ఆరు వేలుగంప గోవర్ధన్: లక్షా 51వేలుదుర్గం అశోక్: 81వేలుఇదిలా ఉండగా.. రుణమాఫీపై కాంగ్రెస్ నేతలకు ప్రతిపక్ష పార్టీల నేతలు సవాల్ విసురుతున్నారు. రుణమాఫీ జరిగనట్టు ఎవరైనా చెబితే తాము వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, తాజాగా బీఆర్ఎస్ నేతల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కావడంతో మిగతా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్ పాటిల్
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఇంతకు మందు.. లోక్‌సభ ఎన్నికల టైంలోనూ తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఈయన పూర్తి పేరు అభయ్‌కుమార్ పాటిల్ దక్షిణ బెల్గాం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానం ప్రారంభించిన అభయ్కు సోషల్ మీడియా ద్వారా యూత్‌తో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు సామాజిక కార్యక్రమాలతో పాటు మరోవైపు.. నియోజకవర్గానికి ఐటీ పార్క్ ఏర్పాటు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. బెలగావి అభివృద్ధి కోసం విజన్ 2040 పేరిట ఆయన ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. -
రేవంతే బీజేపీలోకి.. ఆ మాట అనలేదా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘రుణమాఫీ అంశంపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తాం. రెండు రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభిస్తాం. కలెక్టర్లలకు, సీఎస్‌కు డేటా ఇస్తాం. మా ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే మేము డేటా ఇస్తున్నాం. మా హరీష్ రావు ఆఫీసుపై దాడి చేశారు. అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారు. ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తాం. 973 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లో మా చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు.. వారి నుంచి వివరాలు సేకరిస్తాం. మొదట వినతిపత్రాలు ఇస్తాం.. రాజకీయం చేయకుండా ముందు రిప్రజెంటేషన్ ఇస్తాం. సాక్షి పత్రిక చాలా చక్కటి వార్త రాసింది. 50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 22 లక్షల రైతులకే పరిమితం చేశారు. కేవలం 40 శాతం మాత్రమే రుణ మాఫీ అయ్యింది. ఇంకా సుమారు 28 లక్షల మంది రైతులకు రుణ మాఫీ జరగలేదు. క్షేత్ర స్థాయిలో రిపోర్టులు సేకరించి కలెక్టర్లకు ఇస్తాం.. ఆ తర్వాత సచివాలయంలో ఇస్తాం. హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి మీద దాడి చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు. ముఖ్యమంత్రికి సంబంధించిన మీడియా ప్రతినిధులు ఒక ఐపీఎస్ అధికారిని కొట్టినంత పని చేశారు. ఫాక్స్ కాన్ సంస్థలో లక్ష ఉద్యోగులు కల్పిస్తామని గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఫాక్స్ కాన్ సంస్థ ఒక దశ పూర్తి అయ్యింది. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన రాబోతుంది. సీతారామ ప్రాజెక్టు మాదిరిగా ఫాక్స్ కాన్ రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెబుతారు. మాకు కేంద్ర మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు.రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి..‘ప్రధానమంత్రి మోదీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం. నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పింది? వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి?. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.మహిళా కమిషన్ నోటీసులపై..నాకు మహిళా కమిషన్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాను. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు వెళ్తా. చట్టాన్ని గౌరవిస్తాను. 8 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, బాధితుల వివరాలు అన్ని తీసుకొని వెళ్తా. ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతా. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలపై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తాను’’ అని అన్నారు.