
మూడో దిల్లీ హాట్‌కుముహూర్తం కుదిరింది
నగరంలోని మూడవ దిల్లీ హాట్ ద్వారాలు ఆదివారం తెరచుకోనున్నాయి. ఎన్‌ఏ, పీతంపురా దిల్లీ హాట్‌లకు భిన్నంగా సంగీతం ఇతివృత్తంగా పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో రూపొందించిన ఈ ప్రదర్శనా స్థలం సంగీతప్రియులను, యువతను అలరించనుంది.
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని మూడవ దిల్లీ హాట్ ద్వారాలు ఆదివారం తెరచుకోనున్నాయి. ఎన్‌ఏ, పీతంపురా దిల్లీ హాట్‌లకు భిన్నంగా సంగీతం ఇతివృత్తంగా పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో రూపొందించిన ఈ ప్రదర్శనా స్థలం సంగీతప్రియులను, యువతను అలరించనుంది. ఈ హాట్‌లో భారతీయ సంగీత చరిత్రను, రికార్డులను పుస్తకాలతో వివరించే గ్రంథాలయంతోపాటు విభిన్న సంగీత పరికరాలతో ఓ మ్యూజియం కూడా ఉంది.
హాట్ ప్రవేశద్వారం వద్ద 12 అడుగుల ఎత్తుగల ఓ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. మనిషి రూపంలో ఉండే ఈ శిల్పం పలు భారతీయ, పాశ్చాత్య సంగీత పరికరాలను చేబూని దర్శనమిస్తుంది. స్పైరల్ గోళంపై సంగీత స్వరాలు, రాగాలు రాసి ఉంటాయి. ఇక దుకాణాల విషయానికి వస్తే 100 హస్తకళల దుకాణాలు, 74 ఓపెన్ ప్లాట్ ఫారమ్ దుకాణాలు, 46 ఏసీ దుకాణాలు కొనుగోలుదారులను ఆకట్టుకోనున్నాయి. ఇవికాక భోజన ప్రియుల కోసం ఫుడ్‌కోర్టులో 28 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 28 రాష్ట్రాల వంటకాల రుచులను ఆస్వాదించవచ్చు.
800 మంది కూర్చుండే సామర్థ్యం కలిగిన ఓపెన్ థియేటర్ కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ హాట్ 100కు పైగా పచ్చటి వృక్షాలతో ప్రకృతి ప్రియులను ఆకట్టుకోనుంది. హాట్‌లో 500 కార్లు, 250 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే ఏర్పాట్లున్నాయి. ప్రారంభంలో సందర్శకులను ఆకర్షించడం కోసం ప్రవేశ రుసుమును 10 రూపాయలుగా నిర్ణయించారు. కార్లకు 20 రూపాయలు, ద్విచక్రవాహనాలకు 10 రూపాయల పార్కింగ్ రుసుము వసూలు చేస్తారు.