పదేళ్లుగా దందా!
గ్యాంగ్‌స్టర్ నయీంతో పదేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని దందా సాగించిన ఇద్దరు అనుచరులను కోరుట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేయడం సంచలనం కలిగించింది.
⇒ గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుల అరెస్టు
⇒ రెండు రివాల్వర్లు, రూ.లక్ష స్వాధీనం
కోరుట్ల : గ్యాంగ్‌స్టర్ నయీంతో పదేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని దందా సాగించిన ఇద్దరు అనుచరులను కోరుట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. మంథని మండలం స్వర్ణక్కపల్లికి చెందిన కోరబోయిన రమేష్(47) ఉరఫ్ రాంబాబు జనశక్తి పనిచేసి పోలీసులకులొంగిపోయాడు. 2005 నుంచి నయీంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్ మండలం నగునూరుకు చెందిన రియల్టర్, మాజీ సర్పంచ్ భర్త నర్సింగోజు గోవర్ధన్‌చారి(52) ఉరఫ్ గోపితో కలిసి నయీం అనచురుడిగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి నగునూర్‌లోని సర్వే నంబరు 383, 412 భూవివాదంలో తలదూర్చి నయీం అండతో సెటిల్ చేసేందుకు యత్నించారు. నయీంతో ఉన్న సాన్నిహిత్యంతో జిల్లాలోని పలు చోట్ల భూదందాలు సాగించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు.
హన్మకొండ భూవివాదంతో..
కోరుట్లకు చెందిన బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ రవూఫ్ వరంగల్ జిల్లా హన్మకొండ పరిసరాల్లో ఏడాది క్రితం భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విషయంలో వివాదం చెలరేగగా రవూఫ్‌కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు గ్యాంగ్‌స్టర్ నయీంను ఆశ్రయించారు. ఆ వివాదం సెటిల్‌మెంట్ సమయంలో జోక్యం చేసుకున్న నయీం.. అతని అనుచరులు అబ్దుల్ రవూఫ్ వివరాలు తెలుసుకున్నారు. ఆ భూవివాదం ముగిసిపోయాక రవూఫ్ నుంచి డబ్బు వసూలు చేసే పనిని నయీం తన అనుచరులు రమేష్, గోవర్ధన్‌చారి అప్పగించాడు. వీరు రెండు నెలల క్రితం కోరుట్లకు వచ్చి రవూఫ్‌ను కలిశారు.
తమను నయీం పంపాడని, ఓసారి హైదరాబాద్ వచ్చి ఆయనను కలవాలని కోరినట్లు తెలిసింది. తనకు ఎవరూ తెలియదని, తాను ఎక్కడికీ రానని రవూఫ్ తేల్చి చెప్పాడు. తర్వాత మరోసారి ఫోన్ ద్వారా రవూఫ్‌ను హైదరాబాద్ వచ్చి నయీంను కలవాలని హెచ్చరించారు. జూలై 17న రవూఫ్ వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లగా మరోసారి రమేష్, గోపి ఫోన్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లి రివాల్వర్‌తో రవూఫ్‌ను బెదిరించి కిడ్నాప్ చేశారు. తమ కారులో నయీం వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. నయీం రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ.60 లక్షలకు ఒప్పందం చేసుకున్న రవూఫ్.. ఆగస్టు 5న ఆసొమ్ము అందజేశారు.
మరో నెల రోజుల్లో రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఆగస్టు 9న నయీం ఎన్‌కౌంటర్ జరిగింది. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే ఆగస్టు 10న రవూఫ్ కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిట్ సభ్యుడిగా ఉన్న కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు ఈ కేసును దర్యాప్తు చేసి నయీం అనుచరులైన రమేష్, గోవర్ధన్‌చారిని బుధవారం అరెస్ట్ చేశారు. నిందితులపై కిడ్నాప్, బ్లాక్‌మెయిల్, అక్రమ ఆయుధాలు కలిగిఉన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగిత్యాల కోర్టులో హాజరు పరిచారు. నిందితుల నుంచి రెండు రివాల్వర్లు, రూ.లక్ష స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నయీం అనుచరులకు కోరుట్లలోని రవూఫ్ చిరునామా తెలియజేయడానికి సహకరించిన వారి కోసం పోలీసుల వేట కొనసాగుతోందని తెలిసింది. నయీం అనుచరులను అరెస్టు చేయడంలో పోలీసులు అత్యంత గోప్యంగా వ్యవహరించడం గమనార్హం.