కందిపప్పు కౌంటర్లు ఏవి?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘కిలో కందిపప్పు రూ.120లకే ’ పౌరసరఫరాల శాఖ నినాదమిది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర భగ్గుమంటున్న తరుణంలో జిల్లాలోని రైతు బజార్లతోపాటు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రూ.120లకే కందిపప్పును విక్రయిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన పౌరసరఫరాల శాఖ పూర్తిగా చేతులెత్తేసింది. జిల్లాలోని ఏ ఒక్క రైతు బజార్‌లోనూ కందిపప్పును అందుబాటులో ఉంచలేదు. ప్రత్యేక కౌంటర్లనూ ఏర్పాటు చేయలేదు
-
కేంద్రం కేటాయించిన కందిపప్పు ఏమైనట్లు?
-
రైతు బజార్లలో కిలో రూ.120కే విక్రయిస్తామని అర్భాటంగా ప్రకటించిన పౌరసరఫరాల సంస్థ
-
నాలుగు నెలలైనా ఏ ఒక్క రైతు బజార్లలోనూ విక్రయించని వైనం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘కిలో కందిపప్పు రూ.120లకే ’ పౌరసరఫరాల శాఖ నినాదమిది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర భగ్గుమంటున్న తరుణంలో జిల్లాలోని రైతు బజార్లతోపాటు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రూ.120లకే కందిపప్పును విక్రయిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన పౌరసరఫరాల శాఖ పూర్తిగా చేతులెత్తేసింది. జిల్లాలోని ఏ ఒక్క రైతు బజార్‌లోనూ కందిపప్పును అందుబాటులో ఉంచలేదు. ప్రత్యేక కౌంటర్లనూ ఏర్పాటు చేయలేదు. చివరకు ట్రేడర్ల సహకారంతో వాణిజ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాల్లోనూ కందిపప్పు విక్రయాలు మూణ్నాళ్ల ముచ్చటగానే ముగిశాయి. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, తక్కువ ధరకే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందజేయాల్సిన కందిపప్పు అటకెక్కింది.
కందిపప్పు ఏమైనట్లు?
నాలుగు నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.200లకుపైగా పలికింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారడంతో తక్కువ ధరకే కందిపప్పును విక్రయించాలని భావించిన సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేంద్రం నుంచి 2వేల మెట్రిక్ టన్నుల కందులను దిగుమతి చేసుకున్నారు. క్వింటాలు కందులు రూ.6,820 చొప్పున కొనుగోలు చేసిన అధికారులు వాటిలో 600 మెట్రిక్ టన్నుల కందులను మిల్లింగ్ చేయించారు. కందిపప్పును అన్ని జిల్లాలకు సరఫరా చేసి రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే నాలుగు నెలలైనా ఇంతవరకు జిల్లాలోని రైతు బజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. ఇతర ప్రాంతాల్లోనూ కౌంటర్లు ప్రారంభించలేదు. దీనిపై ఆరా తీస్తే... జిల్లాకు కందిపప్పు సరఫరా కాలేదని తెలిసింది. సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు మహబూబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు కందిపప్పును సరఫరా చేసినట్లు తెలిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు కందిపప్పును సరఫరాయే చేయలేదని సమాచారం. ఈ జిల్లాలకు కందిపప్పును ఎందుకు సరఫరా చేయలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అట్లాగే కేంద్రం నుంచి కొనుగోలు చేసిన కందులను ఏం చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సంస్థ ఉన్నతాధికారులను ఆరా తీస్తే... గత నాలుగు నెలలుగా 1500 మెట్రిక్ టన్నుల కందులు రాజధానిలోని గోదాముల్లోనే నిల్వ ఉన్నట్లు తెలిసింది. నెలల తరబడి కందులు నిల్వ ఉండటంతో పురుగులు పట్టి పనికిరాకుండా పోతోంది. అదే సమయంలో సంస్థలోని కొందరు అధికారులు ఆయా కందిపప్పును పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ట్రేడర్స్ కౌంటర్లు బంద్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ చొరవతో జిల్లాలోని కొందరు ట్రేడర్లు కిలో రూ.120కే కందిపప్పును విక్రయించేందుకు ముందుకొచ్చారు. మూడు నెలల క్రితం ప్రత్యేక కౌంటర్లు తెరిచారు. జిల్లా కేంద్రంలోని ప్రకాశం గంజ్‌లో శ్రీనివాస ట్రేడర్స్, తిరుమల ట్రేడర్స్, శ్రీశైలం అండ్ బ్రదర్స్, ఓం గాయత్రీ ట్రేడర్స్, సదానందం కిరాణం దుకాణాలతోపాటు కాశ్మీర్‌గడ్డ రైతుబజార్, శనివారం అంగడిలోని రైతుబజార్‌లో గల గృహమిత్రలో పప్పు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. జేసీ ప్రారంభించిన కొద్దిరోజులకే ఆయా విక్రయ కేంద్రాల్లో బోర్డు తిప్పేశారు. ఇదేమిటనే ఆరా తీస్తే... పప్పుల ధరలు తగ్గుతున్నాయనే సాకు చెబుతుండటం గమనార్హం.
మాకు స్టాక్ రానేలేదు : డీఎం సంపత్
పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి గత నాలుగు నెలలుగా కందులు గానీ, కందిపప్పు గానీ సరఫరా కాలేదు. రైతు బజార్లలో కౌంటర్లు తెరిచారో లేదో నాకు తెలియదు. ఇదే విషయాన్ని డీఎస్‌వో నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా.. కందిపప్పు సరఫరాకు సంబంధించి రాష్ట్రం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు.