
ప్రేమికుడి మోసాన్ని తట్టుకోలేక
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు మొహం చాటేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
తిరువొత్తియూరు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.. కడలూరు జిల్లా చిదంబరం జగన్నాథవీధికి చెందిన జయరాజ్ పెద్ద కుమార్తె జయదేవి (30) ఎంఎస్సీ చదివి చిదంబరంలో ఉన్న వ్యవసాయ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస‍్తూ చిదంబరంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు.
ఈ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన శిఖామణి కుమారుడు కరుణానిధి (34) సివిల్ ఇంజినీర్‌తో జయదేవికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో కరుణానిధి జయదేవిని వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. కానీ వివాహం చేసుకోవడానికి తిరస్కరించాడు. దీంతో విరక్తి చెందిన జయదేవి చిదంబరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈలోపు ప్రేమికుడు మోసం చేయడాన్ని తట్టుకోలేక జయదేవి మంగళవారం ఉదయం ఇంట్లో విషం తాగింది. ఇది చూసిన చెల్లెల్లు, ఇరుగుపొరుగు వారు ఆమెను చిదంబరం రాజాముత్తయ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జయదేవి మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కరుణానిధిని మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.