రజనీ ఎంట్రీపై నో కామెంట్!
సినీ నటుడు రజనీకాంత్ రాజ కీయాల్లోకి రావడంపై వ్యాఖ్యానించదలచుకోలేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తెలిపారు.
	టీనగర్: సినీ నటుడు రజనీకాంత్ రాజ కీయాల్లోకి రావడంపై వ్యాఖ్యానించదలచుకోలేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తెలిపారు. చెన్నై, ప్యారిస్ బస్టాండ్ సమీపానగల రాజా అన్నామలై మండ్రంలో గత 2008లో తమిళ ఈలంలో జరుగుతున్నదేమిటి? అనే అంశంపై ఎండీఎంకే తరపున అభిప్రాయవేదిక జరిగింది. ఈ వేదికలో వైగో పాల్గొని ప్రసంగించారు. ఆ సమయం లో నిషేధిత ఎల్‌టీటీఈ సంస్థకు మద్దతుగా మాట్లాడినట్లు ఆయనపై దేశద్రోహ కేసు నమోదయింది.  
	
	కేసు విచారణ మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని అదనపు సెషన్సు కోర్టులో జరిగింది. పిటిషనుదారుడైన క్యూ బ్రాంచి మాజీ ఇన్‌స్పెక్టర్ మణివన్నన్  కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించి వైగో తర పు న్యాయవాది దేవదాస్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.  మళ్లీ సోమవారం విచారణ జరిగింది. వైగో కోర్టు కు హాజరయ్యారు. ఇన్‌స్పెక్టర్ వద్ద క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. తర్వాత విచారణను డిసెంబరు 11వ తేదీకి వాయిదా వేశారు.
	
	కోర్టు నుంచి బయటికి వచ్చిన వైగో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ బ్రోకర్లను శ్రీలంకకు పంపి అధ్యక్షుడు రాజపక్సేతో సన్నిహిత సంబంధాలు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. తమిళులకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని కేంద్రం విడనాడాలని కోరారు.  ఆ తర్వాత   రాజకీయ ప్రవేశంపై వ్యాఖ్యానించమని కొందరు కోరగా ఈ ప్రశ్నకు సమాధా నం ఇవ్వనని అంటూ ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
