కోర్టుకు ‘పాల’ మోత | PIL filed in Madras high court against Tamil Nadu's move | Sakshi
Sakshi News home page

కోర్టుకు ‘పాల’ మోత

Nov 12 2014 3:49 AM | Updated on Sep 22 2018 8:22 PM

కోర్టుకు ‘పాల’ మోత - Sakshi

కోర్టుకు ‘పాల’ మోత

పాల ధరల పెంపు వ్యవహారం మంగళవారం కోర్టుకు చేరింది. ఆవిన్ కల్తీలో అవినీతిపరుల ఆస్తుల్ని జప్తు చేసి నష్టాన్ని భర్తీ చేసుకోవాలన్న పిటిషనర్ సూచనను మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ పరిగణనలోకి తీసుకుంది.

* అవినీతి ఆస్తుల జప్తుకు వినతి
* ఆవిన్‌కు హైకోర్టు సూచన
* ఎనిమిది వారాల గడువు

సాక్షి, చెన్నై: పాల ధరల పెంపు వ్యవహారం మంగళవారం కోర్టుకు చేరింది. ఆవిన్ కల్తీలో అవినీతిపరుల ఆస్తుల్ని జప్తు చేసి నష్టాన్ని భర్తీ చేసుకోవాలన్న పిటిషనర్ సూచనను మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. ఆ దిశగా పరిశీలనకు చర్యలు తీసుకోవాలని ఆవిన్ సంస్థకు ఎనిమిది వారాల గడువు విధించింది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగిన ఆవిన్ పాలలో నీళ్ల కల్తీ గుట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కల్తీ వెనుక ప్రధాన సూత్రధారుడితో పాటుగా పలువురిని అరెస్టు చేశారు. సీబీసీఐడీ నేతృత్వంలో విచారణ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆవిన్ సంస్థ నష్టాల్లో ఉందన్న సాకును చూపిస్తూ పాల ధరను ప్రభుత్వం పెంచింది.

మునుపెన్నడూ లేని రీతిలో లీటరకు రూ.10 పెంచారు. ఇది ఇతర పాల ఉత్పత్తుల ధరల పెంపునకు కారణమైంది. ప్రైవేటు పాల సంస్థలు సైతం ధరల్ని పెంచడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పాల ధర మోత వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం నాయకుడు సూర్య ప్రకాష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
 
ఆస్తుల జప్తుతో భర్తీ : ఆవిన్‌పాల కల్తీ గుట్టురట్టు వ్యవహారాన్ని తన పిటిషన్‌లో వివరించారు. నష్టాల్లో ఉన్న ఆవిన్ సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ధరల పెంపు అనివార్యాన్ని వివరిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనను పొందు పరిచారు. ఆవిన్ నష్టాన్ని ఎత్తి చూపుతూ ధరల మోత మోగించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆవిన్ క ల్తీ ముఠాలో కీలక నిందితుల గురించి వివరిస్తూ, ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు వారి ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయడం లేని ప్రశ్నించారు.

ఆవిన్ సంస్థ రూ. 300 కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నట్టు అధికారులు ప్రకటించారని, అలాంటప్పుడు పదేళ్ల పాటుగా వేల కోట్లను ఆర్జించిన కల్తీ ముఠా ఆస్తుల్ని జప్తు చేయడానికి అధికారులు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కల్తీ వ్యవహారంలో పట్టుబడిన ప్రతి ఒక్కరి ఆస్తుల్ని జప్తు చేయడం ద్వారా ఆవిన్ సంస్థ నష్టాల నుంచి పూర్తి స్థాయిలో గట్టెక్కడం ఖాయం అని వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని వారి ఆస్తుల జప్తుతో పాటుగా పెంచిన పాల ధరను తగ్గించే విధంగా ఆవిన్ సంస్థను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు.
 
8 వారాల గడవు : ఈ పిటిషన్ విచారణకు మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ పిటిషనర్ సూచనల్ని పరిగణనలోకి తీసుకుంది. ఎందుకు వారి ఆస్తుల్ని జప్తు చేసి నష్టాల్ని భర్తీ చేసుకోలేదన్న వాదనను తెర మీదకు తెచ్చింది. ఇందుకు తగ్గ పరిశీలన ప్రకియను ఎనిమిది వారాల్లోపు తీసుకుని, తదుపరి విచారణ తేదీన నివేదిక రూపంలో సమర్పించాలని ఆవిన్ సంస్థను ఆదేశిస్తూ ఉత్తర్వుల్ని ప్రధాన బెంచ్ జారీ చేసింది. ఆవిన్ కేసులో నిందితులుగా ఉన్న ఓ పాలకోవా తయారీ సంస్థ ప్రతినిధులు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో పడ్డారు. అయితే, వారి పిటిషన్‌ను విల్లుపురం న్యాయస్థానం తోసిపుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement