ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు | online registrations | Sakshi
Sakshi News home page

ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

Mar 12 2015 12:20 AM | Updated on Sep 2 2017 10:40 PM

ఇక ఆన్‌లైన్  రిజిస్ట్రేషన్లు

ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

పారదర్శకత పెంచడం, దళారుల బెడద తప్పించడంతో పాటు ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించడంలో భాగంగా ఇ

దళారీలకు అడ్డు వేసేందుకు
అక్రమాలకు తావు లేకుండా
స్టాంప్ డ్యూటీ పూర్తిగా ఖజనాకే

 
బెంగళూరు : పారదర్శకత పెంచడం, దళారుల బెడద తప్పించడంతో పాటు ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించడంలో భాగంగా ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్‌లో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం మహారాష్ట్రలో అమల్లో ఉన్న విధానాన్ని కర్ణాటకలో కూడా తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ బడ్జెట్‌లోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెలువడే అవకాశం ఉంది. బెంగళూరులోని 43 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 246 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. గత ఆర్థిక ఏడాది గణాంకాలను అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 7,500 స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీని వల్ల వచ్చే స్టాంపు డ్యూటీతో పాటు మరికొన్ని పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు ప్రతి రోజూ సగటున రూ.19 కోట్ల ఆదాయం వస్తోంది.

అయితే ఆస్తుల విలువను తక్కువ చేసి చూపడంతో పాటు దళారీ వ్యవస్థ వల్ల ప్రస్తుతం రోజుకు దాదాపు రూ.5 కోట్లకు కోత పడుతోందనే వాదన ఉంది. దీనిని నివారించడానికే ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. నూతన విధానం వల్ల రాష్ట్రంలో ఎక్కడి వారైనా సరే తమ క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను ఏ సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనైనా జరిపించుకునే వీలు కలుగుతుంది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ల కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మొత్తం ప్రక్రియను ఏకగవాక్ష విధానం ద్వారా  పూర్తి చేయవచ్చు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియకు కీలకమైన ఆస్తుల వివరాలతోపాటు మార్కెట్ వాల్య్వూను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూశాఖలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూచేతన, కావేరి అనే సాఫ్ట్‌వేర్లను కలిపి సమీకృత సాఫ్ట్‌వేర్ (ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్)ను తయారు చేశారు.

ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... నూతన విధానంలో ఆస్తి విలువను మార్కెట్ రేటు కంటే తక్కువగా చేసి చూపించడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. దీని వల్ల ఆ మేరకు స్టాంప్ డ్యూటీ రూపేనా ఖజానాకు రావాల్సిన సొమ్ము పూర్తిగా వస్తుంది. నిర్ణీత రోజు మాత్రం ఆస్తి విక్రేత, కొనుగోలు దారుడు  సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి సబ్‌రిజిస్ట్రార్ సమక్షంలో విక్రయ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే నూతన విధానం అమలయితే తమకు వచ్చే రాబడి తగ్గిపోతుందని ఈ విధానాన్ని అమలు చేయకుండా శాఖలోని కొంతమంది అడ్డుకుంటున్నారు.’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement