‘నమో’ స్మరణ


 సాక్షి, న్యూఢిల్లీ:లోక్‌సభ ఎన్నికలలో  బీజేపీ చారిత్రాత్మక విజయం తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన నరేంద్ర మోడీకి ఘనస్వాగతం లభించింది. నగరమంతా నమోస్మరణతో మారుమోగింది. విమానాశ్రయం నుంచి అశోకారోడ్‌లోని బీజేపీ కార్యాలయం వరకు ఆయన ప్రయాణం విజయోత్సవ ర్యాలీగా మారింది.  ఢిల్లీ నుంచి గెలిచిన ఏడుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులు విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం చేరుకున్న మోడీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కౌగిలించుకుని ఆహ్వనం పలికారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభమవడానికి ముందు మోడీ మాట్లాడుతూ... బీజేపీని గెలిపిం చినందుకు  పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలి పారు. ఢిల్లీలో అన్ని సీట్లలో బీజేపీని గెలిపించినందుకు నగర ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 ‘ఢిల్లీ ఇంతకు పూర్వమెన్నడూ లేని తీర్పు ఇచ్చింది. ఢిల్లీ  ఓటర్లకు నా అభినందనలు. పార్టీ అభ్యర్థులందరిని గెలిపించారు. పార్టీ కార్యకర్తలందరికీ అభినందనలు తెలియచేస్తున్నా’నని అన్నారు. ఢిల్లీలో  ఇక  బీజేపీ నిలదొక్కుకోలేదని అంతా అనుకుంటున్న సమయంలో పార్టీ కార్యకర్తలు చెమటోడ్చి కష్టపడి కమలాన్ని  వికసింపచేశారన్నారు. కొత్త నమ్మకాన్ని కలిగించారని ఆయన చెప్పారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయం వరకు తనకు ఉత్సాహంతో స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం నరేంద్ర మోడీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు  వచ్చి చేతులు ఊపగానే  ఉదయం నుంచి ఆయన కోసం విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తూ నిలబడిన వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఉత్సాహాన్ని ఆపుకోలేక పోలీసు బారికేడ్లను తోసుకుని ముందుకు  దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

 

 ఆయన బయటకు రాగానే శంఖనాదాలు చేశారు. జేజేలు కొట్టారు. డోలు నగాడాలు మోగించారు. మోడీకి మద్దతుగా నినాదాలు చేశారు  ఆ తర్వాత మోడీ రోడ్ షో ప్రారంభమైంది. విమానాశ్రయం నుంచి  బయటకు రాగానే ఆయన కారు డోరు తీసి   బయటకు తొంగి చూస్తూ విజయచిహ్నాన్ని చూపించారు. చాలా మంది మోడీని చూడడం కోసం ఆరాటపడిపోయారు. కొందరు వీడియో కెమెరాలు. మొబైల్ ఫోన్లు, ఐ ప్యాడ్లతో ఫొటోలు తీసుకున్నారు. ఆయన వాహనంపై పూలు చల్లారు. బీజేపీ జెండాలు ధరించిన వాహనాల ఊరేగింపు మధ్య దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా మోడీ మాస్క్‌లు,  బీజేపీ జెండాలు బ్యానరు ్లపట్టుకున్న కార్యకర్తలు స్వాగతం చెబుతుండగా మోడీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.  మోడీ, మోడీ నినాదాలు, అచ్చే దిన్  ఆనేవాలేహై... పాట  మోగుతుండగా, గులాబీల వర్షం కురుస్తుండగా కాలు కదపడానికి వీల్లేనంత మంది తో నిండి ఉన్న పార్టీ కార్యాలయం ప్రాంగణంలో రాజ్‌నాథ్ సింగ్,  గడ్కారీ  స్వాగతం పలికారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top