
మనసున్న మా‘రాజు’ ఇక లేరు
మైసూరు సంస్థానంలో సుమారు ఐదున్నర శతాబ్దాల యదు వంశ రాజులు ఒడయార్ల శకం ముగిసింది. చివరి రాజు జయచామరాజేంద్ర ఒడయార్ ఏకైక కుమారుడైన శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ (60) మంగళవారం మధ్యాహ్నం గుండె పోటుతో మరణించడంతో వారసులు లేక ఆ వంశం అంతరించినట్లయింది.
గుండెపోటుతో శ్రీకంఠదత్త ఒడయార్ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
మైసూరు సంస్థానంలో సుమారు ఐదున్నర శతాబ్దాల యదు వంశ రాజులు ఒడయార్ల శకం ముగిసింది. చివరి రాజు జయచామరాజేంద్ర ఒడయార్ ఏకైక కుమారుడైన శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ (60) మంగళవారం మధ్యాహ్నం గుండె పోటుతో మరణించడంతో వారసులు లేక ఆ వంశం అంతరించినట్లయింది. ఒడయార్‌కు సతీమణి ప్రమోదా దేవి ఉన్నారు. నగరంలోని తన నివాసంలో మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఆయన గుండె పోటుకు గురయ్యారు. వెంటనే సిబ్బంది విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో ప్రమోదా దేవి మైసూరులో ఉన్నారు. భర్త మరణ వార్త వినగానే హుటాహుటిన నగరానికి తరలి వచ్చారు. తర్వాత పార్థివ శరీరాన్ని మైసూరుకు తరలించారు. అనారోగ్యం కారణంగా గత నెల 19న ఒడయార్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం 28న డిశ్చార్జి అయ్యారు. ఈ నెల ఒకటో తేదీన కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
నేడు సెలవు
ఒడయార్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. నగరంలో కేఆర్ మార్కెట్‌లోని వర్తకులు 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. కనుక బుధవారం మార్కెట్‌లో లావాదేవీలు జరిగే అవకాశాలు లేవు. మైసూరు విశ్వ విద్యాలయం డిగ్రీ పరీక్షలను వాయిదా వేసింది. విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వ విద్యాలయం పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
ప్రముఖుల సంతాపం
ఒడయార్ ఆకస్మిక మరణానికి పలువురు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ ఆస్పత్రిలో ఒడయార్‌ను చివరి సారిగా దర్శించుకున్నారు. బాగలకోటె, బిజాపుర జిల్లాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒడయార్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మైసూరు రాజులు విద్య, సాగు నీటి పారుదల, రహదారుల రంగాల్లో ఎనలేని సేవలు అందించారని శ్లాఘించారు. హోమ్ మంత్రి కేజే. జార్జ్ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. అలనాటి నటి బీ. సరోజా దేవి మైసూరు సంస్థానాధీశులతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మనసున్న మారాజులంటే వారేనని కొనియాడారు. మండ్య ప్రాంత ప్రజలు మైసూరు రాజులకు కలకాలం రుణ పడి ఉంటారని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం. కృష్ణ శ్లాఘించారు.
నాలుగు సార్లు ఎంపీ
1953 ఫిబ్రవరి 20న ఒడయార్ మైసూరులో జన్మించారు. అక్కడే మహారాజ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ, శారదా విలాస్ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1973లో ప్రైవేట్ రాజ దర్బారులో పట్టాభిషేకం జరిగింది. 1976 ఫిబ్రవరి 2న ప్రమోదా దేవిని వివాహమాడారు. 1984, 1989, 1996, 1999లలో మైసూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.