శాసనసభ్యులకు మరణదండన

Maoists Threats To MLAs In Odisha - Sakshi

బరంపురం : ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేగిన ఆంధ్ర రాష్ట్రంలోని అరకు ఎంఎల్‌ఏ, మాజీ ఎంఎల్‌ఏలను మావోయిస్టులు హత్య చేసిన హింసాత్మకమైన సంఘటన అనంతరం ఇక  ఒడిశా రాష్ట్ర ప్రజా ప్రతినిధులపై  మావోయిస్టుల కన్ను పడినట్లు తెలుస్తోంది. గంజాం,  కొందమాల్‌ జిల్లా సరిహద్దుల్లో వెలిసిన మావోయిస్టుల బ్యానర్ల ద్వారా రాష్ట్రంలో గల ముగ్గురు ఎంఎల్‌ఏలను హత్య చేస్తామని హెచ్చరించిన విధానం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన అవిభక్త గంజాం, కొందమాల్‌ జిల్లాల సరిహద్దు బంజనగర్‌లో సోమవారం వెలిసిన మావోయిస్టు పోస్టర్లు,  బ్యానర్ల ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు ఈ హెచ్చరికలను గుర్తించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టు బ్యానర్‌లలో హెచ్చరించి రాసిన విధానం చూస్తే ఒడిశాకు చెందిన ముగ్గురు ఎంఎల్‌ఏల్లో  గంజాం జిల్లాకు గల ఇద్దరు ఎంఎల్‌ఏలు, కొందమాల్‌ జిల్లాలో గల ఒక ఎంఎల్‌ఏగా గుర్తించినట్లు గంజాం ఎస్‌పీ బ్రజేష్‌ కుమార్‌ రాయ్‌ తెలియజేస్తున్నారు. ఈ ముగ్గురు ఎంఎల్‌ఏలు ఎవరనేది తెలియజేసేందుకు ఎస్‌పీ నిరాకరిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు ఎంఎల్‌ఏలు ఎవరనేది నిఘా విభాగం దగ్గర సమాచారం ఉందని కూడా ఎస్‌పీ మీడియాకు తెలియజేస్తున్నారు. గంజాం, కొందమాల్‌ జిల్లా బంజనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి దాదారలుండా జంక్షన్‌లో మావోయిస్టుల బ్యానర్లు దర్శనమిచ్చిన  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి స్వాధీనం చేసుకున్న మావోయిస్టు బ్యానర్లలో గంజాం జిల్లాకు చెందిన ఇద్దరు,  కొందమాల్‌ జిల్లాకు చెందిన ఒక ఎంఎల్‌ఏను హత్య చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసు ఇన్‌ఫార్మర్‌లను, పోలీస్‌స్టేషన్‌ ఐఐసీ అధికారులను కూడా హత్య చేస్తామని బ్యానర్లలో సీపీఐ మావోయిస్టు పేరుతో స్పష్టంగా ఉంది.

గంజాం జిల్లాలోని బంజనగర్‌ నుంచి కొందమాల్‌ జిల్లా పుల్బణి మధ్య జాతీయ రహదారిలోను,   దరింగబడి, కనబంద రహదారి మధ్య వరుసగా వెలిసిన  సీపీఐ మావోయిస్టు పోస్టర్లలో గల మొదటి లైన్‌లో పోలీసు ఇనఫార్మర్‌లకు మరణ దండన, రెండో లైన్‌లో గంజాం జిల్లాలో గల ఇద్దరు ఎంఎల్‌ఏలు, మూడో లైన్‌లో కొందమాల్‌ జిల్లాకు చేందిన ఒక ఎంఎల్‌ఏకు మరణ దండన విధిస్తున్నట్లు స్పష్టంగా ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇటువంటి మావోయిస్టుల హెచ్చరిక పోస్టర్లతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారగా మరోవైపు స్థానికంగా భయానక వాతావరణం   అలుముకుంది. మావోయిస్టుల బ్యానర్లతో  స్థానికులు నోరు విప్పేందుకు కూడా నిరాకరిస్తు భయం భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. మరోవైపు మావోయిస్టు బ్యానర్లను స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పట్టు సాధించేందుకు:
ఒకప్పుడు మావోయిస్టుల దుర్గంగా ఉన్న గంజాం,   కొందమాల్‌ జిల్లా సరిహద్దు గుముసర అటవీ ప్రాంతం మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పండా అరెస్టు అనంతరం మూడేల్ల పాటు పట్టు కోల్పోయిన మావోయిస్టులు తిరిగి ఇప్పుడు మళ్లి కొందమాల్‌లో  కార్యకలాపాలను కొనసాగించడానికి వ్యూహ రచనలు చేస్తున్నారా? చాపకింద నీరులా కొత్త దళాలను ఏర్పాటు చేస్తున్నారా?  అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకున్నారా? గంజాం, గజపతి, నయాగడ,    రాయగడ జిల్లా సరిహద్దులను కారిడార్‌గా చేసుకుని కొందమాల్‌ జిల్లాలో తిష్ఠ వేశారా?  పోలీసులు, భద్రత దళాలను లక్ష్యంగా ఎంచుకున్నారా..? ఈ ప్రశ్నలకు సమాధానం గంజాం, కొందమాల్‌ జిల్లాల మధ్య  రహదారిలో వెలసిన మావోయిస్టు బ్యానర్లే నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కొద్ది రోజులుగా కొందమాల్‌ జిల్లాలో తరచూ జరుగుతున్న మావోయిస్టుల సంఘటనలే ఇందుకు రుజువుగా నిలుస్తున్నాయి.   

బల్లిగుడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల కొమనకుల పంచాయతీ, కొంబలోడు గ్రామం దగ్గర పోడుకొట్ట ఘాటీ దట్టమైన ఆటవీ ప్రాంతంలో అదివారం అర్ధరాత్రి కూంబింగ్‌ ఆపరేషన్‌కు వెళ్లి తిరిగి వస్తున్న ఎస్‌ఓజీ  జవాన్‌లపై ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టులు తెగబడి విరోచితంగా కాల్పులు జరిపిన దాడిలో ఒక ఎస్‌ఓజీ  జవాన్‌ మరణించగా మరో 7గురు ఎస్‌ఓజీ జవాన్‌లు తీవ్ర గాయాలపాలైన సంఘటనపై పోలీస్‌ ఉన్నతాధికారులు   నిజమనే  స్పష్టం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టు నాయకులు కొన్ని మావోయిస్టు అనుసంధాన సంస్థలతో కలిసి కొందమాల్, గంజాం, గజపతి, బౌధ్, కలహండి జిల్లాలను కలుపుకుని ఒక కొత్త దళంగా ఏర్పడి కొందమాల్‌ జిల్లాను దుర్గంగా మలుచుకుని ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టులు తిష్ఠ వేసినట్లు పోలీసుల్లో అనుమానాలు రేగుతున్నాయి.   

కొనసాగుతున్న కూంబింగ్‌  
గంజాం, కొందమాల్‌ జిల్లా బంజనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి దాదారలుండా జంక్షన్‌లో ఒడిశాకు చెందిన ముగ్గురు ఎంఎల్‌ఏలను హత్య చేస్తామని హెచ్చరిస్తూ వెలసిన మావోయిస్టుల బ్యానర్లతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఉల్కిపడ్డారు. ఈ నేపథ్యంలో గజపతి, కొందమాల్, గంజాం జిల్లాల సరిహద్దుల్లో, బల్లిగుడ, రైకియా, బమ్ముణిగామ్, దరింగబడి, గజలబడి, కటింగియా, పాణిగొండా అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహాయంతో సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ జవాన్‌లు కూంబింగ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top