
అంతా ‘అమ్మ’మయం!
అమ్మ పేరుతో మరిన్ని పథకాలు, వస్తువులు మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్నారు. ఇందుకు ఆయా శాఖల మంత్రులు, అధికారులు కుస్తీలు పడుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత
సాక్షి, చెన్నై: అమ్మ పేరుతో మరిన్ని పథకాలు, వస్తువులు మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్నారు. ఇందుకు ఆయా శాఖల మంత్రులు, అధికారులు కుస్తీలు పడుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక ప్రజాహితాన్ని కాంక్షిస్తూ పథకాల్ని ప్రవేశ పెడుతూ వస్తున్నారు. ఉచిత బియ్యం, తాళికి బంగారం, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు, ఆరోగ్య బీమా పథకాలతోపాటుగా విద్యార్థులకు సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, ఉచిత బస్సుపాసులను అందిస్తున్నారు. అలాగే, అమ్మ పేరిట క్యాంటీన్లు, వాటర్ బాటిళ్లు విక్రయాలు, అమ్మ పచ్చదనం పేరుతో కూరగాయల దుకాణాలు కొలువు దీరాయి. గత వారం అమ్మ ఉప్పు మార్కెట్లోకి వచ్చింది. పౌరసరఫరాలు, రవాణా శాఖ, విద్యా, ఆరోగ్య శాఖల నేతృత్వంలో ప్రత్యేక పథకాలు ప్రజల దరి చేరుతుండడంతో మిగిలిన శాఖల్లోని మంత్రులు మేల్కొన్నారు. తమ అధినేత్రి జయలలితను రాష్ట్రంలో అమ్మ అని పిలుస్తున్న దృష్ట్యా, ఆ పేరుతో తమ శాఖల పరిధిల్లోని విభాగాల్లో సరి కొత్తగా పథకాలు, వస్తువులను సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు.
సమీక్షల బిజీ : రాష్ట్ర కేబినెట్‌లో జయలలితతో పాటుగా 32 మంది ఉన్నారు. ఇందులో 31 మంది మంత్రులు. వీరి పరిధిలో 45 విభాగాల వరకు ఉన్నాయి. ఈ విభాగాల్లో ఇప్పటికే కొన్ని పథకాలు అమల్లో ఉన్నాయి. అయితే, కొన్ని శాఖలు అమ్మ పేరిట చేపడుతున్న పథకాలకు విశేష ఆదరణ లభిస్తుండడంతో తాము సైతం అన్నట్టుగా ఆయా విభాగాల మంత్రులు రెడీ అవుతున్నారు. తమ శాఖల పరిధిల్లోని విభాగాల్లో ఏదేని సరికొత్తగా పథకాల్ని ప్రవేశ పెట్టేందుకు వీలుందా? తమ పరిధుల్లోని వివిధ రకాల ఉత్పత్తుల గురించి అన్వేషించే పనిలో ఆయా శాఖల మంత్రులు నిమగ్నమయ్యారట!. సచివాలయంలో అధికారులతో ఇందుకు సంబంధించి మంత్రులు కుస్తీలు పడుతున్నట్టు సమాచారం. త్వరలో సరికొత్తగా అమ్మ నినాదంతో పథకాలకు రూపకల్పన చేసి సీఎం మెప్పు పొందే పనిలో మంత్రులు ఉండడం గమనార్హం.
అమ్మ ఁటీరూ.: రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తేయాకు సహకార సంస్థలు ఇప్పటికే ఉన్నాయి. వీటి ద్వారా తేయాకు ఉత్పత్తి సాగుతోంది. టీ పొడి విక్రయాలు సాగుతున్నాయి. అయితే, వీటికి ఆశించిన మేరకు ఆదరణ లేదని చెప్పవచ్చు. రేషన్ దుకాణాల్లో, సహకార దుకాణాల్లో ఊటీ టీ పేరిట సాగుతున్న విక్రయాల్ని, అమ్మ పేరిట మార్చి చౌక ధరకే ప్రజలకు అందించేందుకు సరికొత్త పథకాన్ని సంబంధిత శాఖ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అలాగే, అటవీ గ్రామాల్లో గిరిజనులను ప్రోత్సహించే విధంగా వారి ఉత్పత్తులకు ఆదరణ లభించేందుకు వీలుగా, ఖాదీ ఉత్పత్తులు, అటవీ సంపదలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అమ్మ పేరిట విక్రయాలకు ఆయా శాఖలు తీవ్ర కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. వ్యవసాయ ఉత్పత్తుల మీద సైతం సంబంధిత శాఖ దృష్టి పెట్టడం బట్టి చూస్తే, త్వరలో అంతా అమ్మ మయం కావడం తథ్యమేమో. ఇక చెన్నైలో కార్పొరేషన్ నేతృత్వంలో అమ్మ వారపు సంత, అమ్మ పేరిట ఇళ్ల వద్దకే కాయగూరలు, అమ్మ థియేటర్‌కు స్థల ఎంపిక పనులు వేగవంతం కావడం గమనార్హం.