
వాగ్యుద్ధం
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై శుక్రవారం సభ ప్రారంభమైంది.
అసెంబ్లీలో మొదలైన సమరం
అధికార ప్రతిపక్షాల నినాదాల హోరు
మార్షల్స్‌తో డీఎంకే సభ్యుల తరలింపు
రసాభాసగా సమావేశాలు
అనుకున్నట్లుగానే అసెంబ్లీలో సమరం మొదలైంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు శుక్రవారం సైతం రసాభాసగా మారిపోయాయి. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి డీఎంకే సభ్యులను బలవంతంగా వెలుపలికి తీసుకెళ్లారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై శుక్రవారం సభ ప్రారంభమైంది. అన్నాడీఎంకే సభ్యులు మార్కండేయన్ ముందుగా మాట్లాడుతూ, ప్రపంచంలో మరెక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో సాగుతున్నట్లు గవర్నర్ ప్రసంగంలో స్పష్టమైందని చెప్పారు. ఈ ప్రగతి పాఠాన్ని చూసి తట్టుకోలేని డీఎంకే సభ్యులు వాకౌట్ చేసి నేడు మళ్లీ అసెంబ్లీకి హాజరయ్యూరని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆగ్రహించిన డీఎంకే సభ్యుడు శివశంకర్ గవర్నర్ ప్రసంగం ప్రతులను చించివిసిరేశారు. శ్రీలంక సమస్య పరిష్కారం కోసం తాము ఎంపీ పదవులకు రాజీనామా చేశామని ప్రకటించిన డీఎంకే నేతలు తమ రాజీనామాలను స్పీకర్‌కు ఇవ్వకుండా పార్టీ అధినేతకు ఇచ్చారని మార్కండేయన్ ఎద్దేవా చేశారు. దీంతో పాటు అళగిరి తనను హతమారుస్తానని బెదిరించాడంటూ కరుణానిధి మీడియా వద్ద వాపోయారని, అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వుంటే అళగిరిని అమ్మ (సీఎం జయలలిత) అరెస్ట్ చేయించేవారు కదా అని వ్యాఖ్యానించారు. ఇందుకు ఆగ్రహించిన డీఎంకే సభ్యుడు అన్బళగన్ ఈ అంశాలను అసెంబ్లీ ప్రసంగాల నుంచి తొలగించాలని పట్టుపట్టి స్పీకర్ కుర్చీవద్దకు చేరుకున్నారు. ఆయనతో మిగిలిన సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో సభ్యులు ఇక్కడికి రాకూడదు,సీట్లలో కూర్చోండని స్పీకర్ ధనపాల్ పదేపదే బతిమాలారు.
స్పీకర్ అనుమతితో ప్రసంగాన్ని ప్రారంభించిన డీఎంకే సభ్యుడు దురైమురుగన్‌కు అధికారపక్ష సభ్యుల తీరుపై అభ్యంతరం తెలిపారు. సభలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడాల్సిందిపోయి డీఎంకే అధినేతపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇందుకు ఒక్కసారిగా అన్నాడీఎంకే సభ్యులు కేకలు వేశారు. డీఎంకే సభ్యులు పోడియం వీడి పోకపోవడంతో స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ సభలో ప్రవేశించి బలవంతంగా బయటికి పంపివేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం అంటూ డీఎంకే సభ్యులు అసెంబ్లీ వెలుపల నినాదాలతో హోరెత్తించారు.