డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనపై చట్టసభల్లో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది.
మండలిలో సిద్దు, ఈశ్వరప్ప మధ్య తీవ్ర వాగ్వాదం
‘ఆయన్ను బయటికి పంపించేయండి’: సీఎం సిద్ధు
నన్ను పంపడానికి మీరెవరు : ఈశ్వరప్ప
చట్టసభల్లో గందరగోళం
బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనపై చట్టసభల్లో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. గణపతి ఆత్మహత్యపై సీఎం సిద్ధరామయ్య శాసనమండలిలో గురువారం వివరణ ఇస్తూ మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న కె.ఎస్.ఈశ్వరప్ప కలగజేసుకున్నారు. దీంతో సీఎం తీవ్ర అసహనానికి లోనయ్యారు. ‘ముందు ఈశ్వరప్పను బయటికి తోసేయండి’ అని సిద్ధరామయ్య అనడంతో శాసన మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు... గురువారం ఉదయం శాసనమండలి కార్యకలాపాలు ప్రారంభం కాగానే డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంపై వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. తన ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రతిపక్షాలు ఆయనకు అడ్డుతగిలాయి. గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు మంత్రి జార్జ్‌ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపాయి. అయినా కూడా సీఎం సిద్ధరామయ్య వివరణ ఇవ్వడానికి ప్రయత్నించడంతో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు.
‘ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కె.జె.జార్జ్‌ను పదవి నుంచి తప్పించి ఆ తర్వాత సభకు వివరణ ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు. దీంతో సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకానొక సందర్భంలో ‘ఈశ్వరప్పను సభ నుంచి బయటికి పంపేయండి’ అంటూ మండిపడ్డారు. దీంతో కె.ఎస్.ఈశ్వరప్ప సైతం తనదైన శైలిలో సీఎం సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను సభ నుంచి పంపడానికి మీరెవరు, కేవలం చైర్మన్‌కు మాత్రమే ఆ అధికారం ఉంది, కావాలంటే మీరే పదవికి రాాజీనామా చేసి బయటికి వెళ్లండి’ అని పేర్కొన్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో ఎంత సేపటికీ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోవడంతో మండలి చైర్మన్ శంకరమూర్తి సభా కార్యకలాపాలను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.