నకిలీ డ్యూటీ కార్డులపై నిఘా | fake duty cards hulchul in indrakeeladri | Sakshi
Sakshi News home page

నకిలీ డ్యూటీ కార్డులపై నిఘా

Oct 7 2016 8:41 AM | Updated on Jul 29 2019 6:03 PM

శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకారం, శనివారం మూలానక్షత్రం, ఆదివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో అనధికార దర్శనాలకు బ్రేక్ వేసేందుకు ఈవో సూర్యకుమారి చర్యలు చేపట్టారు.

గురువారం 500 కార్డులు పట్టివేత
 
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :  శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకారం, శనివారం మూలానక్షత్రం, ఆదివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో అనధికార దర్శనాలకు బ్రేక్ వేసేందుకు ఈవో సూర్యకుమారి చర్యలు చేపట్టారు. డ్యూటీ కార్డుల పేరిట వీఐపీ దర్శనాలు చేసుకునే వారిని నియంత్రించేందుకు నడుం బిగించారు.
 
రెండు రోజులుగా రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ కార్డులు పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వస్తున్న వారి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. కార్డులు ఉన్నవారు అసలు డ్యూటీ చేసిందీ, లేనిదీ తేలడంతో వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం ఉదయం నుంచి వీఐపీ, రూ.300 టికెట్ దర్శనం లైన్‌లో డ్యూటీ పాస్‌లను ధరించి దర్శనానికి వచ్చే వారిని ప్రశ్నించారు.
 
ఓ జంట డ్యూటీ పాస్ తీసుకుని దర్శనం కోసం క్యూలైన్‌లోకి రాగా, ఆలయ సిబ్బంది వారిని ఆరా తీశారు. ఆ కార్డు వారి కుమారుడి పేరిట ఉండటం, ఫొటోపై మరో ఫొటో పెట్టి ఉండటంతో పోలీసులు వారిని ప్రశ్నించారు. ఐదు రోజులుగా ఇలాగే దర్శనానికి వస్తున్నామని చెప్పడంతో వారిద్దరినీ వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.
 
ఒకరికి ఇచ్చిన గుర్తింపు కార్డుపై మరొకరు దర్శనానికి రావడం, కలర్ జిరాక్స్‌లు.. ఇలా ఒకటేమిటీ కార్డును పోలిన కార్డును తయారు చేసేందుకు ఎన్ని అవకాశాలున్నాయో అన్ని రకాలుగా నకిలీ కార్డులను ధరించి అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. గురువారం ఒక్కరోజై సుమారు 500కుపైగా నకిలీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వీటిపై నిఘా మరింత పటిష్టం చేశారు.
 
కారకులు ఎవరు?
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సేవలు, క్యూలైన్లు నడిపే వారితో పాటు భక్తులకు మంచినీరు సరఫరా చేసే వారికి దేవస్థానం డ్యూటీ పాస్‌లను పంపిణీ చేసింది. కార్డులపై నంబర్ ఉన్నప్పటికీ ఇన్ని వందల సంఖ్యలో నకిలీ కార్డులు రావడానికి కారకులు ఎవరు?, ఆలయ సిబ్బంది హస్తం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సుమారు 2,500 నుంచి 3వేల వరకూ నకిలీ కార్డులు చెలామణిలో ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement