breaking news
fake duty cards
-
డూప్లి‘కేటుగాడి’ పై అంత ప్రేమా?
ఇంద్రకీలాద్రిపై నకిలీ డ్యూటీ కార్డుల బాగోతం... ఔట్సోర్సింగ్ ఉద్యోగే సూత్రధారి అయినా చర్యలకు మీనమేషాలు ఇంద్రకీలాద్రి: దసరా ఉత్సవాలలో దుర్గగుడిలో రట్టయిన నకిలీ డ్యూటీ కార్డుల కుంభకోణంలో బాధ్యులైన సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికారులు నీళ్లునములుతున్నట్లు విమర్శలున్నాయి. ఈ బాగోతంతో ఆలయ పాలకవర్గం పరువుపోయినంత పనైంది. పరిపాలనా విభాగంలో అవుట్‌సోర్సింగ్‌లో పని చేసే ఒక ఉద్యోగే ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు సమాచారం. అంగ, అర్ధ బలాలు దండిగా ఉన్న అతడు సుదీర్ఘ సెలవుపై ఉంటూ కొద్ది రోజుల కిందటే డ్యూటీకి తిరిగి వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ డ్యూటీ కార్డులను ఈ వ్యక్తి తమ అనుకూల వర్గానికి ఇష్టానుసారంగా జారీ చేసినట్లు ఆలయ సిబ్బంది బహిరంగంగానే చెబుతుండగా, అధికారుల విచారణలోనూ ఇదే వెల్లడైంది. అధికారులు డ్యూటీ కార్డులు జారీ చేసింది కొందరికే అయితే, ఆ కార్డులను కలర్ జిరాక్స్‌లు, పేర్లు, ఫోటోల మార్పిడితో ఇబ్బడిముబ్బడిగా నకిలీ కార్డులను పుట్టించారు. ఇలా పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి రాజమార్గంలో చేరుకున్నారు. ఈ వ్యవహారం అనూహ్యంగా బయటకు రావడంతో రెండు రోజులలో సుమారు ఆరు వందలకు పైగా డ్యూటీ కార్డులను ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నచ్చినవారికి పంచిపెట్టారు వన్‌టౌన్‌లోని పలు దుకాణాల యజమానులకు, గుమస్తాలతో పాటు తమకు అనుకూలంగా వ్యవహరించిన వారికి ఈ నకిలీ కార్డులు పంచినట్లు తెలుస్తుంది. వాస్తవానికి డ్యూటీ కార్డులు జారీ చేసే సమయంలో కార్డులు ఎవరికి కార్డులు జారీ చేస్తున్నారని అంతా ఓ ప్రణాళిక ప్రకారం కొంత మంది సిబ్బందిని నియమించి మంజూరు చేశారు. ఉద్యోగి వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే కార్డులను మంజూరు చేశారు. డ్యూటీ కార్డుల దుర్వినియోగానికి కారణమైన వ్యక్తిని ఆలయ అధికారులు గుర్తించినా అతనిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవస్థానానికి లక్షలాది రూపాయలు నష్టంతో పాటు పరువుకు భంగం కలిగినా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
నకిలీ డ్యూటీ కార్డులపై నిఘా
గురువారం 500 కార్డులు పట్టివేత విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకారం, శనివారం మూలానక్షత్రం, ఆదివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో అనధికార దర్శనాలకు బ్రేక్ వేసేందుకు ఈవో సూర్యకుమారి చర్యలు చేపట్టారు. డ్యూటీ కార్డుల పేరిట వీఐపీ దర్శనాలు చేసుకునే వారిని నియంత్రించేందుకు నడుం బిగించారు. రెండు రోజులుగా రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ కార్డులు పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వస్తున్న వారి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. కార్డులు ఉన్నవారు అసలు డ్యూటీ చేసిందీ, లేనిదీ తేలడంతో వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం ఉదయం నుంచి వీఐపీ, రూ.300 టికెట్ దర్శనం లైన్లో డ్యూటీ పాస్‌లను ధరించి దర్శనానికి వచ్చే వారిని ప్రశ్నించారు. ఓ జంట డ్యూటీ పాస్ తీసుకుని దర్శనం కోసం క్యూలైన్లోకి రాగా, ఆలయ సిబ్బంది వారిని ఆరా తీశారు. ఆ కార్డు వారి కుమారుడి పేరిట ఉండటం, ఫొటోపై మరో ఫొటో పెట్టి ఉండటంతో పోలీసులు వారిని ప్రశ్నించారు. ఐదు రోజులుగా ఇలాగే దర్శనానికి వస్తున్నామని చెప్పడంతో వారిద్దరినీ వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. ఒకరికి ఇచ్చిన గుర్తింపు కార్డుపై మరొకరు దర్శనానికి రావడం, కలర్ జిరాక్స్‌లు.. ఇలా ఒకటేమిటీ కార్డును పోలిన కార్డును తయారు చేసేందుకు ఎన్ని అవకాశాలున్నాయో అన్ని రకాలుగా నకిలీ కార్డులను ధరించి అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. గురువారం ఒక్కరోజై సుమారు 500కుపైగా నకిలీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వీటిపై నిఘా మరింత పటిష్టం చేశారు. కారకులు ఎవరు? దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సేవలు, క్యూలైన్లు నడిపే వారితో పాటు భక్తులకు మంచినీరు సరఫరా చేసే వారికి దేవస్థానం డ్యూటీ పాస్‌లను పంపిణీ చేసింది. కార్డులపై నంబర్ ఉన్నప్పటికీ ఇన్ని వందల సంఖ్యలో నకిలీ కార్డులు రావడానికి కారకులు ఎవరు?, ఆలయ సిబ్బంది హస్తం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సుమారు 2,500 నుంచి 3వేల వరకూ నకిలీ కార్డులు చెలామణిలో ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.