సంక్షోభంలో టెక్స్‌టైల్ | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో టెక్స్‌టైల్

Published Mon, Sep 30 2013 3:27 AM

Due to the significantly reduced orders for united strike

సాక్షి, బెంగళూరు: సమైక్యాంధ్ర నినాదంతో రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సమ్మె ఇక్కడి టెక్స్‌టైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెంగళూరు చుట్టు పక్కల ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి సీడబ్ల్యుసీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన  కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ సమ్మె ప్రభావం కర్ణాటకలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న టెక్స్‌టైల్ రంగంపై కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాల్లోని కదిరి, పులివెందుల, అనంతపురం జిల్లా కేంద్రం, హిందూపురం తదితర ప్రాంతాలకు చెందిన వస్త్ర వ్యాపారులు బెంగళూరులో హోల్‌సేల్ ధరలకు వస్త్రాలు కొనుగోలు చేసి అక్కడి వారాంతపు సంతల్లో, చిన్నచిన్న దుకాణాల్లో రీటైల్‌గా అమ్ముతుంటారు. ఇక కదిరిలోని వస్త్ర వ్యాపారులైతే వారానికి ఒకసారి బెంగళూరుకు వచ్చి ఇక్కడి గాంధీనగర్, కమర్షియల్ స్ట్రీట్ తదితర చోట్ల దుస్తులను కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు.

అయితే సమ్మె కారణంగా కదిరి, పులివెందుల, హిందూపురం, అనంతపురం జిల్లాకేంద్రం ప్రాంతాల్లోని దుకాణాలు వుూతపడటం వల్ల బెంగళూరులోని హోల్‌సేల్ మార్కెట్‌లో దుస్తులు కొనుగోలు బాగా తగ్గిపోయింది. దీంతో బెంగళూరులోని హోల్‌సేల్ వస్త్ర వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వ్యాపార వాటాలో కోత పడింది. ఇక సమ్మె ప్రభావం మొదట్లో ఇక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీలపై అంతగా పడకున్నా ఇప్పుడిప్పుడే ఆ తీవ్రత పెరుగుతోంది. ఇక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లలో రాయలసీమ
 
 జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల వాటా ఎక్కువగా ఉంది. అయితే సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు స్తంభించడంతో ఇక్కడి గార్మెంట్ యూనిట్లకు ఆర్డర్ల సంఖ్య బాగా తగ్గుతోంది.
 
రవాణా వ్యవస్థ స్తంభించడమూ కారణమే...

 సమ్మె ప్రభావం టెక్స్‌టైల్ రంగంపై పడటానికి  రవాణా వ్యవస్థ స్తంభించడం కూడా ఒక కారణమనే వాదన వినిపిస్తోంది. చిరు వ్యాపారులు తాము కొనుగోలు చేసిన దుస్తుల రవాణాకు సాధారణంగా కేఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులనే వాడుతుంటారు. అయితే రెండు నెలలుగా ఇక్కడి కేఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లడం లేదు. కొనుగోలు చేసిన వస్త్రాల రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటం కూడా టెక్స్‌టైల్ రంగంపై ప్రభావం చూపడానికి మరో కారణం.

ఈ విషయంపై హోల్‌సేల్ వస్త్రవ్యాపారి సయ్యద్ ఖురేషి సాక్షితో మాట్లాడుతూ.... ‘సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న సమ్మె వల్ల ఇక్కడి నుంచి ఏపీఎస్, కేఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రవైపు వెళ్లడం లేదు. చిరు వస్త్రవ్యాపారులకు ప్రైవేటు వాహనాల్లో రవాణా చేసే స్తోమత ఉండదు. అందువల్ల కూడా వారు ఇక్కడ దుస్తులను కొలుగోలు చేయడం నిలిపివేశారు’ అని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బస్సులు న డపక పోవడంతో  ఈ రెండు నెలల్లో కేఎస్ ఆర్టీసీ రోజుకు సగటున రూ.40 లక్షల ఆదాయం కోల్పోవడంతో మొత్తం రూ.24 కోట్ల ఆయానికి గండి పడింది. ఇక బెంగళూరు నుంచి ఏపీకి బస్సులను నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ కూడా రూ.6 కోట్ల  ఆదాయాన్ని కోల్పోయింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement