వివాహేతర సంబంధం వ్యవహారంలో లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. చిదంబరం సమీప వడక్కు తిలై్లనాయకపురంకు
టీనగర్: వివాహేతర సంబంధం వ్యవహారంలో లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. చిదంబరం సమీప వడక్కు తిలై్లనాయకపురంకు చెందిన సురేష్(36), లక్ష్మి దంపతులు. కాగా మూడేళ్ల క్రితం లక్ష్మి, కార్తీ అనే వ్యక్తితో ఇంటినుంచి వెళ్లిపోయి చిదంబరం సమీపంలోని కొత్తన్‌కుడి ప్రాంతంలో నివసిస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం లక్ష్మి సురేష్ దగ్గరికి వెళ్లి తనకు జీవన భృతి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇది తెలిసిన సురేష్ బంధువు దండపాణి కార్తీని మందలించాడు. దండపాణి తనను మందలించడంతో కార్తీ ఆగ్రహించి అతన్ని హత్య చేసేందుకు కుట్రపన్నాడు.
ఈక్రమంలో శుక్రవారం రాత్రి దండపాణి స్నేహితుడైన మినీ లారీ డ్రైవర్ సెల్వం(40) చిదంబరంతో కలిసి వండిమేడు ప్రాంతంలో టీ తాగేందుకు వెళ్లారు. ఆ సమయంలో కారులో అక్కడికి వచ్చిన ఐదుగురు వ్యక్తులు దండపాణిపై కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. సెల్వం వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అతనిపై విచక్షణారహితంగా కత్తులతో దాడిచేసిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. వీరిని గుర్తించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు ఫలించక సెల్వం మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన అతని బంధువులు కార్తీ ఇంటిని ముట్టడించి వస్తువులను ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చిదంబరం వడక్కు తిలై్లనాయగపురంకు చెందిన కార్తీ, కదిర్, కందమంగళంకు చెందిన స్టాలిన్, ఉత్తమచోళమంగళంకు చెందిన జయచంద్రన్, చిదంబరం కస్పా ప్రాంతానికి చెందిన చంద్ర అనే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి వడక్కు తిలై్లనాయగపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.