ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా ఉన్నా రెండంకెల ప్రగతి సాధిస్తాం: సీఎం ధీమా


సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా ఉన్నప్పటికీ నగరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ప్రగతి సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. నగరాన్ని అభివృద్ధికి ఆయువు పట్టుగా అభివర్ణించారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడుల అనుకూల విధానం వల్ల  నగర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు ఆశాజనకంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా నగరం 11 శాతానికి పైగా అభివృద్ధి రేటు సాధిస్తోందన్నారు. 2011-12లో 11.54 శాతం అభివృద్ధి రేటు  నమోదైందని, ఈ సంవత్సరం కూడా రెండంకెల అభివృద్ధి రేటు సాధించగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐఐ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. ఐదో పంచవర్ష ప్రణాళికా కాలంలో నగరం 11 నుంచి 11.5 శాతం రేటుతో అభివృద్ధి సాధిస్తుందని తాము అంచనా వేసినట్లు షీలాదీక్షిత్ చెప్పారు. 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో జాతీయ  పెరుగుదల రేటు 7.9 శాతం ఉండగా ఢిల్లీ 11.46 శాతం అభివృద్ధి రేటు నమోదుచేసింది. 

 

 లోటు నియంత్రణకు చర్యలు

 ఆర్థిక లోటును నియంత్రించడం కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందన్నారు. పన్ను వసూలు యంత్రాంగాన్ని పటిష్టం చేయడం వంటివి ఇందులో ఉన్నాయన్నారు.  నగరంలో పరిశ్రమల వికాసం తమ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక  సన్నిహిత విధానాలను ఆమె ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. మొత్తం 29 పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్టు షీలాదీక్షిత్ తెలిపారు. 

 

 ఓరిమి అవసరం 

 దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మదుపర్లు, పరిశ్రమ ఓరిమి వహించాలని, మళ్లీ పుంజుకోగల సామర్థ్యం గల ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలిగి ఉండాలని షీలాదీక్షిత్ చెప్పారు. నగరంలో పరిశుభ్ర టెక్నాలజీ గల పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించాలనే తమ విధానంలో భాగంగా ఉత్తర ఢిల్లీలోని బాప్రోలా ఐటీ పరిశ్రమలకోసం పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ. 1,800 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్కును అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కాగా దేశ రాజధాని నగరాన్ని పరిశుభ్రమైన హైటెక్నాలజీ గల పరిశ్రమలు, సేవా రంగానికి నెలవుగా తీర్చిదిద్దడంకోసం ప్రభుత్వం 2010లో కొత్త  పారిశ్రామిక విధానాన్ని ఆరంభించింది.

 

 నీటి సమస్య భారీ సవాలే

 దేశ రాజధానిలో నీటి కొరత సమస్య భారీ సవాలుగానే గుర్తించామని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. నిర్మాణాత్మక చర్యలు తీసుకోకపోతే రాను న్న ఐదేళ్ల కాలంలో ఇది మరింత ముదిరే ప్రమాదముందన్నారు. నగర జనాభా సంఖ్య నానాటికీ చెప్పుకోదగ ్గస్థాయిలో పెరిగిపోతోందన్నారు. నీటి తలసరి వినియోగం ఈ నగరంలో ప్రపంచంలోనే అత్యధికం కావొచ్చన్నారు. ఈ సమస్యను తీవ్రస్థాయిలో పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి పంపిణీని సహేతుకం చేస్తామన్నారు. నీటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సమస్యను అధిగమించే విషయంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నగరంలో తలసరి నీటి వినియోగం 272 లీటర్లని తెలిపారు. నగరానికి ప్రతిరోజూ దాదాపు 1,100 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమన్నారు. అయితే ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ) ప్రస్తుతం 800 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోందన్నారు. 2017 నాటికి ప్రతిరోజూ 1,400  మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుందన్నారు. ముడినీటి కోసం పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌లపై రాజధాని నగరం ఆధారపడిందన్నారు. నగరంలోని అనేక ప్రాంతాలు ఈ వేసవిలో తీవ్ర నీటి కొరత సమస్యను ఎదుర్కొన్నాయని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. నీరు వృథా కాకుండా చేసేందుకే చార్జీలను పెంచామన్నారు.

 

 పురోగతి కళ్లకు కడుతోంది

 గత కొన్ని సంవత్సరాలుగా తాము సాధించిన పురోగతి నగరవాసుల కళ్లకు కడుతోందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అందువల్ల దానిని గురించి వివరించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే అంశంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీనిని మున్ముందు మరింత మెరుగుపరుస్తామన్నారు. ‘మనకు అద్భుతమైన విమానాశ్రయం ఉంది. సమర్థమైన మెట్రో నెట్‌వర్క్ ఉంది. నగరంలో ప్రజారవాణా వ్యవస్థ ఎంతో బాగుంది. అయితే దానిని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో ప్రజారవాణా వ్యవస్థను నిరాటంకరహితంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నివసించేందుకు అనువైన నగరంగా దేశరాజధానిని తీర్చిదిద్దుతామన్నారు. భూమిపై అధికారం తమకు లేకపోవడం అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు పెను అడ్డంకిగా పరిణమించిందన్నారు. నగరంలో ప్రతిరోజూ భారీఎత్తున వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. దాదాపు ఏడు వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. వీటిని తరలించడం పెనుసమస్యగా పరిణమించిందన్నారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top