పుదుచ్చేరి సీఎం ఎవరో? | Congress-DMK alliance secure comfortable win in Puducherry | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి సీఎం ఎవరో?

May 21 2016 1:51 AM | Updated on Mar 18 2019 9:02 PM

సీఎం పదవికి గుడ్బై అంటున్న రంగస్వామి - Sakshi

సీఎం పదవికి గుడ్బై అంటున్న రంగస్వామి

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరీలో కాంగ్రెస్, డీఎంకే కూటమి విజేతగా నిలవడంతో ముఖ్యమంత్రి ఎవరనే అంశం తెరపైకి వచ్చింది.

* శివ, నారాయణులు పోటీ
* సీఎం పదవికి రంగస్వామి రాజీనామా

సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరీలో కాంగ్రెస్, డీఎంకే కూటమి విజేతగా నిలవడంతో ముఖ్యమంత్రి ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు.  30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో 344 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్,  కాంగ్రెస్, డీఎంకేల కూటమి, ప్రజా సంక్షేమ కూటమి, అన్నాడీఎంకే, పీఎంకేలు పోటీపడ్డాయి.

కాంగ్రెస్, డీఎంకే కూటమి 17 స్థానాలను గెలుచుకుని అధికారానికి సిద్దమైంది. వేర్వేరుగా లెక్కిస్తే కాంగ్రెస్ 15, డీఎంకే 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉండిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ 8 స్థానాలను, అన్నాడీఎంకే 4, స్వతంత్య్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అలాగే 21 మంది మహిళా అభ్యర్థులు పోటీచేయగా వారిలో నలుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. డీఎంకే, అన్నాడీఎంకేల నుంచి చెరీ ఒకరు, ఎన్‌ఆర్ కాంగ్రెస్ తరఫున ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలైనారు.
 సీఎం రంగస్వామి రాజీనామా:  ప్రభుత్వం ఏర్పాటు చేసేంతటి సంఖ్యాబలం లేకపోవడంతో ముఖ్యమంత్రి ఎన్ ర ంగస్వామి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరీలో గవర్నర్ బంగళాకు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఏకే సింగ్‌కు స్వయంగా అందజేశారు.
 
సీఎం.. శివుడా, నారాయణుడా: పుదుచ్చేరీ పార్టీ అధ్యక్షులు నమశ్శివాయం, అసెంబ్లీలో ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన వైద్యలింగం గెలుపొందారు. కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేనే సీఎంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామిని సూచిస్తున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయకుండా అభ్యర్థుల గెలుపునకు పాటుపడ్డారు. పార్టీ అధ్యక్షులు నమశ్శివాయం సైతం సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నమశ్శివాయమే సీఎం అని ఆయన అనుచరులు ప్రచారం కూడా సాగిస్తున్నారు. శివ, నారాయణుల మధ్య సాగుతున్న రసవత్తరమైన ప్రయత్నాల్లో విజయం ఎవరిదో వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement