నేడు అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక
నేడు ఏయూ సహకార సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక జరగనుంది.
► ఏయూలో ఎన్నికల కోలాహలం
► పోటాపోటీగా సహకార సంఘం ఎలక్షన్లు
► ప్రొ.యుగంధర్‌కు అత్యధిక ఓట్లు
ఏయూ క్యాంపస్ : సహకార సంఘం ఎన్నికల హడావుడితో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మంగళవారం కోలాహలం నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏయూ పాఠశాలలో ఓటింగ్ జరిగింది. 2054 ఓటర్లకు గాను 1807 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మూడు విభాగాలలో జరిగిన ఎన్నికల్లో ఏ గ్రూప్ నుంచి ఎన్.మురళీ యుగంధర్ (కెమికల్), డి.అప్పలనాయుడు (కెమికల్), పేటేటి ప్రేమానందం (పొలిటికల్ సైన్స్), పి.వి.లక్ష్మీ నారాయణ (నూక్లియర్ ఫిజిక్స్), ఎం.తాతారావు (ఏయూ పాఠశాల) ఎన్నికయ్యారు. బీ గ్రూప్ నుంచి ఎన్.వి గిరి, జి.రమణారెడ్డి, నూనెల దుర్గాప్రసాద్, చిన్నిపల్లి లక్ష్మణబాబు, సీ గ్రూప్ నుంచి ఒమ్మి వెంకటకష్ణ, దువ్వి గోవింద, డొక్కర శ్రీనివాసరావు, నొడగల రాంబాబులు ఎన్నికల్లో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి కె.మంజువాణి తెలిపారు. ఏ గ్రూప్‌లో ఐదు డైరెక్టర్ పదవులకు ఆరుగురు, బీ గ్రూప్‌లో నాలుగు డైరెక్టర్ పదవులకు 16 మంది, సీ గ్రూప్‌లో నాలుగు డైరెక్టర్ పదవులకు 12 మంది పోటీ పడ్డారు. విజేతలు ఎన్నికల కేంద్రం బయట సందడి చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మంగళవారం మధ్యాహ్నం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అడుగడుగునా ఉల్లంఘనే.. :
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత సైతం అభ్యర్థులు ప్రచారం చేస్తూ దర్శనమిచ్చారు. ఏయూ పాఠశాలకు వెళ్లే మార్గంలో తమ శిబిరాలు ఏర్పాటు చేసుకుని తమ గుర్తులను ప్రదర్శిస్తూ యథేచ్ఛగా ప్రచారం చేశారు. ఓటర్లను ప్రలోభపరచే విధంగా వీరి ప్రచారం సాగింది. అదే విధంగా ఈ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు రూ.200 నుంచి వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేశారని ఉద్యోగులు అంటున్నారు. ఎన్నికల్లో గెలుస్తారని ధీమాగా ఉన్న పలువురికి పరాజయం ఎదురవడంతో కంగుతిన్నారు.
దువ్వెన దూసుకుపోయింది...
ఏ గ్రూప్ నుంచి దువ్వెన గుర్తుపై పోటీ చేసిన కెమికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు ఎ¯ŒS.మురళీ యుగంధర్ అత్యధికంగా 1157 ఓట్లను సాధించారు. మూడు గ్రూపులలో కలసి అత్యధిక ఓట్లను పొందారు. నేడు అధ్యక్ష, కార్యదర్శి, ఇతర పదవులకు పోటీ జరగనుంది. ప్రస్తుతం గెలిచిన 13 మంది డైరెక్టర్ల నుంచి అధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గ పదవులకు బుధవారం ఉదయం ఎన్నిక జరగనుంది. ఉదయం 8.30 గంటలకు 13 మంది సభ్యులతో ఎన్నికల అధికారి సమావేశం కానున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా, అధ్యక్ష ఎన్నికకు మళ్లీ పోటీ ఎదురవుతుందా అనేది తేలాల్సివుంది. అధ్యక్ష పదవికి ఎన్.ఎం.యుగంధర్, పి.ప్రేమానందం పోటీ పడే అవకాశం ఉంది. కార్యదర్శి పదవికి జరిగే పోటీలో ఎన్.వి.గిరి ముందు వరసలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా గెలుపొందారు. వీరిని తమవైపు తిప్పుకోగలిగిన వారికి కోరిన పదవి లభించడం తథ్యం. లేక యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే పదవిని కోరుకున్నా సులభంగా పొందే అవకాశం లేకపోలేదు.