ఇంత చెత్త ఫీల్డింగా?: యువీ ఫైర్‌

Yuvraj Singh Slams India fielding Effort in Hyderabad T20I - Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తొలి టి20లో టీమిండియా ఫీల్డింగ్‌ చెత్తగా ఉందని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ విమర్శించాడు. యువ ఆటగాళ్లలో చురుకుదనం లేదని కామెంట్‌ చేశాడు. ‘ఈరోజు మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్‌ చెత్తగా ఉంది. బంతిని అందుకోవడంలో యువ ఆటగాళ్లు ఆలస్యంగా స్పందించారు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఫీల్డింగ్‌ చేయలేకపోతున్నారా’ అని యువీ ట్వీట్‌ చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లతో పాటు కోహ్లి కూడా సరిగ్గా ఫీల్డింగ్‌ చేయకపోవడంతో విండీస్‌ భారీ స్కోరు సాధించింది. 16వ ఓవర్‌లో హేట్‌మెయిర్‌ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ జారవిడిచాడు. దీంతో హేట్‌మెయిర్‌ టి20ల్లో మొట్టమొదటి అర్ధసెంచరీ సాధించాడు. కీరన్‌ పొలార్డ్‌ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్‌ శర్మ పట్టలేకపోయాడు. చాహర్‌ వేసిన 17వ ఓవర్‌లో ఏకంగా మూడు క్యాచ్‌లు నేలపాల్జేశారు.
 

ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై టీమిండియా  6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) విశ్వరూపంతో కరీబియన్ల భరతం పట్టాడు. మరోవైపు బ్యాటింగ్‌లో చెలరేగి చివరకు వరకు క్రీజ్‌లో ఉండి జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌  ప్రశంసలు కుపించాడు. ‘అమేజింగ్‌.. జస్‌ అమేజింగ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. విండీస్‌, టీమిండియా మొదటి టి20 మ్యాచ్‌ మంచి వినోదం అందించిందని వ్యాఖ్యానించాడు. (చదవండి: కోహ్లి కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌)
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top