
విషాద గాథ.. ఆదర్శ కథ!
పృథ్వీపాల్ సింగ్.. ఒకనాటి భారత హాకీ లెజెండ్. యాభైవ దశకంలో హాకీ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టి భారత్ కు తిరుగులేని విజయాలను అందించాడు.
పృథ్వీపాల్ సింగ్.. ఒకనాటి భారత హాకీ లెజెండ్. యాభైవ దశకంలో హాకీ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టి భారత్ కు తిరుగులేని విజయాలను అందించాడు. మూడు సార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్న పృథ్వీపాల్.. ప్రతీసారి దేశానికి పతకం తెచ్చిపెట్టాడు. పెనాల్టీ కార్నర్ గా విశేషమైన సేవలందించి తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతని జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే హత్యకు గురయ్యాడు.
హాకీ కెరీయర్ లో అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన అతని జీవితం.. తరువాత సాఫీగా సాగలేదు. హాకీ నుంచి దూరమైన అనంతరం లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో స్పోర్ట్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నసమయంలో ఆయన హత్యకు గురయ్యాడు. పృథ్వీపాల్ ను హత్య చేసింది ఎవరో కాదు.. అతని విద్యార్థులే. పృథ్వీపాల్ ను క్యాంపస్ లోనే అతిదారుణంగా కాల్చి అతని మరణానికి కారణమయ్యారు ఆ యూనివర్శిటీలోని కొందరు విద్యార్థులు. ప్రస్తుతం పృథ్వీపాల్ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందుతోంది. బబితా పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఆరంభంలో విడుదుల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పృథ్వీపాల్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం..
ఆరంభంలోనే అదరగొట్టాడు
1950లో హాకీ కెరీయర్ ను ప్రారంభించిన పృథ్వీపాల్.. తక్కువ కాలంలోనే భారత జట్టుకు సారథి అయ్యాడు. 1955లో కెప్టెన్ గా ఎంపికై అందరీ అభినందనలు పొందాడు. ప్రత్యేకంగా 'కింగ్ ఆఫ్ పెనాల్టీ కార్నర్' అంటూ కామెంటేటర్స్ చేసే వ్యాఖ్యలు పృథ్వీపాల్ కు ఆటకు అద్దం పట్టేవి. దీంతో పాటు బెస్ట్ ఫుల్ బ్యాక్ ప్లేయర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1955 లో జర్మనీలో జరిగిన మునిచ్ ఫెస్టివల్ వేడుకల్లో ఆయనకు 'రోల్ ఆఫ్ హానర్స్' అవార్డును ఇచ్చి సత్కరించారు. క్రీడా రంగం, విద్యారంగంలో సాధించిన విజయాలకు గాను పృథ్వీపాల్ కు ఆ అవార్డు దక్కింది.
జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్.. మాస్టర్ ఆఫ్ ఆల్!
పృథ్వీపాల్ కు అనేక రంగాల్లో నైపుణ్యం ఉంది. అటు హాకీలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నా.. అగ్రికల్చర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పంజాబ్ పోలీస్ శాఖలో పనిచేశాడు. భారత రైల్వే విభాగంలో పోలీస్ అధికారిగా పని చేశాడు. అనంతరం పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ(పీఏయూ)లో డిప్యూటీ డైరెక్టర్ బాధ్యతలను చేపట్టాడు. ఆక్రమంలోనే 1965 లో 'ఉత్తమ'అవార్డును పొందాడు.
గుర్తుండి పోయే క్షణాలు..
పృథ్వీపాల్ సింగ్ మూడు ఒలింపిక్స్ లో భాగస్వామ్యం అయ్యాడు. ఒలింపిక్స్ పాల్గొన్న ప్రతీసారి అతని ప్రదర్శనతో పతకం సాధించిపెట్టాడు. 1960 రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లో భారత్ కు రజతం, 1964 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం, 1968 మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించడంలో పృథ్వీపాల్ కీలక పాత్ర పోషించాడు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మొత్తంగా 22 గోల్స్ నమోదు చేస్తే.. అందులో 10 గోల్స్ పృథ్వీపాల్ ద్వారానే వచ్చాయంటే అతిశయోక్తిగా అనిపించక మానదు.
హాకీలో తొలి అర్జున అవార్డు..
భారత ప్రభుత్వం అందజేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు హాకీ విభాగంలో తొలిసారి దక్కించుకున్న ఆటగాడు పృథ్వీపాల్. 1961 లో అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ నుంచి పృథ్వీపాల్ సింగ్ అ అవార్డును తీసుకున్నాడు. అనంతరం హాకీలో చేసిన విశిష్ట సేవలకు గాను1967 లో పద్మ శ్రీ పురస్కారం కూడా పృథ్వీపాల్ కు దక్కింది.
విషాద క్షణాలు..
1983 లో పృథ్వీపాల్ జీవితం విషాదాంతమైంది. ఆయన విద్యార్థులే హత్య చేశారు. పీఏయూ కార్యాలయ ఆవరణలో బైక్ పార్క్ చేస్తున్న సమయంలో ఆయనపై విద్యార్థులు తుపాకులతో దాడి చేశారు. దీనికి అక్కడ ఉన్న మరి కొందరు విద్యార్థులతో పాటు 50 మంది యూనివర్శిటీ అధికారులే సాక్ష్యం. కానీ పృథ్వీపాల్ అనుకూలంగా ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పలేదు. దీంతో కోర్టులో కేసు వీగిపోయి ఆ నిందితులు తప్పించుకున్నారు.
సినిమా రూపకల్పన..
ఇప్పటికే ఎందరో క్రీడాకారుల జీవిత గాథలు సినిమా కథల రూపంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్, మహిళా బాక్సర్ మేరీకామ్ జీవిత కథలు సినిమాల రూపంలో వచ్చి మనల్ని అలరించాయి. ఇప్పుడు పృథ్వీపాల్ సింగ్ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించే సిద్ధమయ్యారు దర్శకురాలు బబితా పూరీ. వచ్చే సంవత్సరం విడుదల కానున్న ఈ చిత్రం.. వచ్చే నెలలో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఆల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈవెంట్ లో ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు.