జొకోవిచ్‌కు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌కు చుక్కెదురు

Published Wed, Jun 6 2018 1:12 AM

Unseeded Marco Cecchinato takes down Novak Djokovic - Sakshi

ఒకవైపు 12 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌. మరోవైపు కెరీర్‌లో ఓ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ ఆడుతున్న ఆటగాడు. ఈ ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంటే 12 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన అతనే మ్యాచ్‌ గెలుస్తాడని ఎవరైనా అంచనా వేయొచ్చు. కానీ మంగళవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అలా జరగలేదు. డజను గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన యోధుడిపై అనామకుడిగా బరిలోకి దిగిన మరో ప్లేయర్‌ అద్వితీయ విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ అసాధారణ విజయం నమోదు చేసిన ప్లేయర్‌ ఇటలీకి చెందిన మార్కో సెచినాటో. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అడుగు పెట్టకముందు కెరీర్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ కూడా నెగ్గని సెచినాటో ఈసారి ఏకంగా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకొని ఔరా అనిపించాడు.   

పారిస్‌: కొన్నాళ్ల క్రితం వరుస విజయాలతో అదరగొట్టిన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ఈ మాజీ నంబర్‌వన్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 72వ ర్యాంకర్‌ మార్కో సెచినాటో (ఇటలీ) అసాధారణ ప్రదర్శన కనబరిచి 3 గంటల 26 నిమిషాల్లో 6–3, 7–6 (7/4), 1–6, 7–6 (13/11)తో 20వ సీడ్‌ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ గెలుపుతో 25 ఏళ్ల సెచినాటో తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. ఈ టోర్నీకి ముందు సెచినాటో తన కెరీర్‌లో ఏనాడూ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో కనీసం ఒక్క విజయం కూడా సాధించకపోవడం గమనార్హం. 2015 యూఎస్‌ ఓపెన్, 2016 ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, 2017 వింబుల్డన్‌ టోర్నీల్లో అతను తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. 1999లో ఆండ్రీ మెద్వదేవ్‌ (100వ ర్యాంక్‌) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన తక్కువ ర్యాంక్‌ ప్లేయర్‌గా సెచినాటో గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 1978లో కొరాడో బారాజుటి తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా సెచినాటో రికార్డు సృష్టించాడు. సెచినాటోతో జరిగిన పోరులో తొలి రెండు సెట్‌లు కోల్పోయి... మూడో సెట్‌లో నెగ్గిన జొకోవిచ్‌ నాలుగో సెట్‌లో కీలకదశలో పొరపాట్లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు తన ప్రత్యర్థి గత రికార్డును ఏమాత్రం పట్టించుకోకుండా పట్టుదలతో ఆడిన సెచినాటో కీలక సందర్భాల్లో పాయింట్లు గెలిచి ఫలితాన్ని శాసించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)తో సెచినాటో ఆడతాడు.  

జ్వెరెవ్‌కు షాక్‌ 
మరో క్వార్టర్‌ ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌ వరుస సెట్‌లలో 6–4, 6–2, 6–1తో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ని ఓడించాడు. గంటా 50 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ థీమ్‌కు జ్వెరెవ్‌ పోటీనివ్వలేకపోయాడు. 

స్లోన్‌తో కీస్‌ ‘ఢీ’ 
గాయం కారణంగా అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వైదొలిగినప్పటికీ... అమెరికాకే చెందిన ఇద్దరు యువ తారలు స్లోన్‌ స్టీఫెన్స్, మాడిసన్‌ కీస్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్లో పదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ 6–3, 6–1తో 14వ సీడ్‌ దరియా కసత్‌కినా (రష్యా)పై, 13వ సీడ్‌ కీస్‌ 7–6 (7/5), 6–4తో పుతింత్‌సెవా (కజకిస్తాన్‌)పై గెలిచి సెమీస్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు.  

బోపన్న జంట నిష్క్రమణ 
పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) ద్వయం 6–7 (4/7), 2–6తో నికోలా మెక్‌టిక్‌ (క్రొయేషియా)–అలెగ్జాండర్‌ పెయా (ఆస్ట్రియా) జంట చేతిలో ఓడిపోయింది. 
నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)తో రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌); డెల్‌ పొట్రో (అర్జెంటీనా)తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)... మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో షరపోవా (రష్యా)తో ముగురుజా (స్పెయిన్‌); కెర్బర్‌ (జర్మనీ)తో సిమోనా హలెప్‌ (రొమేనియా) తలపడతారు.    

Advertisement
Advertisement