నేవీ సెయిలింగ్‌ జట్టుకు రాష్ట్ర విద్యార్థులు

Two TMREIS students selected by Navy to join in Sailing Team - Sakshi

టీఎంఆర్‌ఈఐఎస్‌కు చెందిన కార్తీక్, సంతోష్‌లకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: సెయిలింగ్‌లో సత్తా చాటుతోన్న తెలంగాణ విద్యార్థులు సి. కార్తీక్, బి. సంతోష్‌లు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిద్దరూ నేవీ సెయిలింగ్‌ జట్టుకు ఎంపికయ్యారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌)లో ఎనిమిదో తరగతి చదువుతోన్న సి. కార్తీక్‌ (మహబూబ్‌నగర్‌), సంతోష్‌ (జనగాం) నేవీ జట్టుకు ఎంపికయ్యారని సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా తెలిపారు. కృష్ణపట్నంలో జరిగిన యూత్‌ నేషనల్, ఇంటర్నేషనల్‌ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన వీరిద్దరూ గోవా మండోవికి చెందిన ‘నేవీ బాయ్స్‌ స్పోర్ట్స్‌ కంపెనీ బ్యాచ్‌–2’లో చోటు దక్కించుకున్నారు.

ఇందులో భాగంగా నేడు గోవాలోని నేవీ స్కూల్‌లో చేరనున్నారు. ఇక్కడ వీరికి చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యుత్తమ శిక్షణను అందిస్తారు. విద్యాభ్యాసం అనంతరం వీరిద్దరూ ఇండియన్‌ నేవీలో భాగమవుతారు. ఈసందర్భంగా టీఎంఆర్‌ఈఐఎస్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు వీరి ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్‌లో గొప్పగా రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఐఎఫ్‌ఎస్‌ షఫీయుల్లా ఆకాంక్షించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top