హ్యాట్రిక్‌ విజయం కోసం... | Today IPL Match Sun Risers Hyderabad With Chennai Super Kings | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ విజయం కోసం...

Apr 23 2019 6:25 AM | Updated on Apr 23 2019 3:26 PM

Today IPL Match Sun Risers Hyderabad With Chennai Super Kings - Sakshi

చెన్నై: వరుసగా రెండు విజయాలతో గెలుపు బాట పట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... వరుసగా రెండు అనూహ్య పరాజయాలను ఎదుర్కొన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ నేడు తలపడనున్నాయి. హ్యాట్రిక్‌ గెలుపుపై సన్‌రైజర్స్‌ కన్నేయగా... ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి.  

ఓపెనర్లే ఆధారం...
సన్‌ రైజర్స్‌ వెన్నెముక ఓపెనర్లే. వార్నర్, బెయిర్‌ స్టో అసాధారణ ఫామ్‌తో అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును గెలిపిస్తున్నారు. వీరిద్దరూ ఈ సీజన్‌లో నాలుగోసారి శతక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపు బాట పట్టించారు. కానీ నేడు చెన్నైతో మ్యాచ్‌ అనంతరం రైజర్స్‌ ఆడే తదుపరి మ్యాచ్‌కు జానీ బెయిర్‌స్టో అందుబాటులో ఉండడు. ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ జట్టు సభ్యుడైన బెయిర్‌స్టో మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు తమ దేశానికి పయనమవ్వనున్నాడు. తుది జట్టులో పేరుకు మాత్రమే పరిమితమైన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఇప్పటివరకు రాణించింది లేదు. ఈ పరిస్థితుల్లో బెయిర్‌ స్టో గైర్హాజరు రైజర్స్‌కు పెద్ద లోటే. వార్నర్, బెయిర్‌ స్టో జట్టులో ఉన్నప్పుడే వీలైనన్ని విజయాలను అందుకోవాలని సన్‌ యాజమాన్యం భావిస్తోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా మిడిలార్డర్‌ రాణిస్తే బౌలర్ల పని తేలికవుతుంది. సన్‌ బౌలింగ్‌ దళం కూడా విశేషంగా రాణిస్తోంది. ఓపెనర్ల కష్టానికి ఫలితం ఉండేలా బౌలర్లు ప్రత్యర్థిని నిలువరిస్తూ జట్టు విజయాల్లో భాగమవుతున్నారు.  

టాపార్డర్‌ వైఫల్యం...
గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించిన టాపార్డర్‌ ఈసీజన్‌లో ఆ జట్టుకు భారంగా మారింది. వాట్సన్‌ (147 పరుగులు), అంబటి రాయుడు (192 పరుగులు), సురేశ్‌ రైనా (207 పరుగులు) ఇప్పటివరకు గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్‌ ఆడలేదు. టాపార్డర్‌ వైఫల్యంతో మిడిలార్డర్‌ పని కష్టమవుతోంది. చివర్లో ఒత్తిడంతా కెప్టెన్‌ ధోని (314 పరుగులు)పై పడుతుందనడంలో సందేహం లేదు. టాపార్డర్‌ రాణించాల్సిన అవసరం ఉందంటూ బెంగళూరుతో మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో చెన్నై ఓడిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. హర్భజన్, తాహిర్, దీపక్‌చహర్, శార్దుల్‌ ఠాకూర్‌లతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement