మండే సూర్యులు

Sunrisers Hyderabad beat Royal Challengers Bangalore  - Sakshi

సెంచరీలతో బెయిర్‌ స్టో, వార్నర్‌ విధ్వంసం

సన్‌రైజర్స్‌ ఘన విజయం 

118 పరుగులతో బెంగళూరు ఓటమి

నబీకి 4 వికెట్లు   

హైదరాబాద్‌లో ఆదివారం ఉష్ణోగ్రత 42 డిగ్రీలు... అయితేనేం భానుడి భగభగల్లోనూ అభిమానులు క్రికెట్‌ విందు చేసుకున్నారు.  సన్‌ పరుగుల ప్రవాహంలో ‘రవి’వారం తడిసి ముద్దయ్యారు. ఓవైపు బెయిర్‌స్టో, మరోవైపు వార్నర్‌ మండే అగ్నిగోళాల్లా చెలరేగి ప్రేక్షకులకు అసలైన ఐపీఎల్‌ మజాను పంచారు. తీవ్ర వేడిమిలోనూ అలసటే లేకుండా రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోవడంతో సన్‌డే కాస్త మరింత ఫన్‌డేగా మారిపోయింది. వీరిద్దరికి తోడు బౌలింగ్‌లో నబీ స్పిన్‌ ఉచ్చు బిగించడంతో సొంతగడ్డపై రైజర్స్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన బెంగళూరు మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది.   

హైదరాబాద్‌: సొంత గడ్డపై ఏకపక్షంగా సాగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 118 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఓపెనర్లు బెయిర్‌ స్టో (56 బంతుల్లో 114; 12 ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (55 బంతుల్లో 100 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్‌కు 185 పరుగుల రికార్డు  భాగస్వామ్యంతో అదరగొట్టారు. అనంతరం బెంగళూరు 19.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. గ్రాండ్‌హోమ్‌ (37) టాప్‌ స్కోరర్‌. రైజర్స్‌ బౌలర్లలో మొహమ్మద్‌ నబీ 4 వికెట్లతో చెలరేగగా... సందీప్‌ శర్మ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. బెయిర్‌ స్టోకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

బెయిర్‌ స్టో బ్లాక్‌ బస్టర్‌ షో 
తొలిసారి ఐపీఎల్‌ ఆడుతోన్న బెయిర్‌స్టో మరపురాని ఇన్నింగ్స్‌తో మురిపించాడు. ఎడాపెడా షాట్లు బాదకుండా మంచి స్ట్రోక్స్‌తో అలరించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే మొయిన్‌అలీ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో బెయిర్‌స్టో జోరు ప్రదర్శించాడు. ఆ తర్వాత సిరాజ్‌ వేసిన రెండు ఓవర్లలో నాలుగు బౌండరీలు బాదాడు. దీంతో పవర్‌ప్లేలో హైదరాబాద్‌ 59 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన (16 ఏళ్ల 157 రోజులు) ప్రయస్‌ రే బర్మన్‌ బెదిరిపోయేలా బెయిర్‌ స్టో చెలరేగాడు. అతను వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో 6, 4, 4తో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. మధ్యలో మరో సిక్స్‌తో చెలరేగిన అతను... 16వ ఓవర్‌లో ఏకంగా 6, 4, 6 తో 20 పరుగులు పిండుకున్నాడు. అంతకుముందు గ్రాండ్‌హోమ్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్, లాంగాన్‌ మీదుగా రెండు భారీ సిక్సర్లతో విజృంభించాడు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లోనూ 4, 6, 4తో 16 పరుగులు రాబట్టాడు. ఈ విధ్వంసానికి చహల్‌ తెరదించాడు. చహల్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించిన బెయిర్‌ స్టో... ఉమేశ్‌ యాదవ్‌ అద్భుత డైవ్‌ క్యాచ్‌కు పెవిలియన్‌ చేరాడు. 28 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన బెయిర్‌ స్టో 100 పరుగుల మార్కును అందుకునేందుకు మరో 24 బంతులే తీసుకున్నాడు.  

వండర్‌ వార్నర్‌  
పునరాగమనంలో అద్భుత ప్రదర్శనతో చెలరేగుతోన్న వార్నర్‌ మరోసారి తన ధాటిని ప్రదర్శించాడు. బెయిర్‌ స్టో ఆడుతున్నంతసేపు నెమ్మదిగా ఆడిన  వార్నర్‌... అతని ని ష్క్రమణ తర్వాత చెలరేగిపోయాడు. తొలి మూడు ఓవర్లలో వరుసగా 4, 6, 4తో అతను ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. తర్వాత పదకొండో ఓవర్‌ వరకు మరో బౌండరీ బాదకుండా స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. మరో ఎండ్‌లో బెయిర్‌ స్టో ఆటను ప్రేక్షకుడిలా ఎంజాయ్‌ చేశాడు. అలీ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా కొట్టిన సిక్స్‌తో మళ్లీ జోరు పెంచాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో వార్నర్‌ అర్ధశతకం పూర్తయింది. తర్వాత మరో 6, 4తో సెంచరీ దిశగా అడుగులు వేశాడు. మధ్యలో విజయ్‌ శంకర్‌ (9)కు సహకరించిన అతను 19వ ఓవర్లో వరుసగా 4, 6తో 90ల్లోకి చేరుకున్నాడు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అద్భుతమైన బౌండరీతో శతకాన్ని (54 బంతులు) అందుకుని సంబరాల్లో మునిగిపోయాడు.  

టపా టపా..  
బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ మరోసారి స్పిన్‌ ముందు చేతులెత్తేశారు. నబీ బౌలింగ్‌ను ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. అతని ధాటికి పార్థివ్‌ పటేల్‌ (11), హెట్‌మైర్‌ (9), ఏబీ డివిలియర్స్‌ (1) క్రీజులో నిలవలేకపోయారు. కఠిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లి (3)ని సందీప్‌ శర్మ వెనక్కి పంపించాడు. మొయిన్‌ అలీ (2), శివమ్‌ దూబే (5) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 35 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో గ్రాండ్‌ హోమ్‌ (37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు స్కోరును 100 పరుగులు దాటించగలిగాడు.  

►ఐపీఎల్‌లో తొలి వికెట్‌కు ఇదే (185) అత్యుత్తమ పార్ట్‌నర్‌షిప్‌. 2017లో గంభీర్‌–క్రిస్‌లిన్‌ నెలకొల్పిన 184 పరుగుల భాగస్వామ్యాన్ని వార్నర్, బెయిర్‌స్టో అధిగమించారు.  

►ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు చేయడం ఇది రెండో సారి. 2016లో కోహ్లి,  డివిలియర్స్‌ (గుజరాత్‌పై) శతకాలు నమోదు చేశారు.

►ఐపీఎల్‌లో వరుసగా మూడు సెంచరీ భాగస్వామ్యాలు  నెలకొల్పిన జోడి వార్నర్‌–బెయిర్‌స్టోదే...ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో వీరిద్దరు తొలి వికెట్‌కు 118, 110, 185 పరుగులు జత చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top