Sakshi News home page

సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ షురూ

Published Tue, Jul 4 2017 10:30 AM

సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ షురూ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో సెయిలింగ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సోమవారం ‘మల్టీ క్లాస్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌’ను ప్రారంభించారు. ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్, సికింద్రాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో మొత్తం 201 మంది క్రీడాకారులు తలపడుతున్నారు. వీరిలో 17 మంది మహిళా సెయిలర్లు ఉండగా... తెలంగాణ నుంచే ఏడుగురు అమ్మాయిలు ఈ పోటీల్లో పాల్గొనడం విశేషం. సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సెయిలింగ్‌ క్రీడల హబ్‌గా మారుతోందని అన్నారు.

 

ఇక్కడి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఉత్తమ ఫలితాలను రాబడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌ వైస్‌ కమాండర్, మేజర్‌ జనరల్‌ పరమ్‌జీత్‌ సింగ్‌ టోర్నీకి లభించిన విశేష స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పోటీదారుల సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. ఈ ఏడాది పోటీల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఒలింపిక్‌ ఫిన్‌ క్లాస్‌ సెయిలింగ్‌ ఈవెంట్‌ ద్వారా టోర్నీకి మరింత ప్రాముఖ్యత వచ్చిందని పేర్కొన్నారు. టోర్నీ ప్రారంభోత్సవంలో గవర్నర్‌తో పాటు ‘శాట్స్‌’ ఎండీ ఎ. దినకర్‌ బాబు, సికింద్రాబాద్‌ క్లబ్‌ అధ్యక్షులు శశిధర్, ఉపాధ్యక్షులు వివేక్‌ జైసింహా, ఐటీ ఇన్‌చార్జి బ్రిగేడర్‌ జగ్‌దీశ్‌ సింగ్, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

What’s your opinion

Advertisement