యూఏఈకి బయల్దేరిన రోహిత్‌ సేన

Rohit And 8 Other India Players Depart Early For Asia Cup - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌ టోర్నీలో పాల్గొనేందుకు రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు గురువారం సాయంత్రం యూఏఈకి బయల్దేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు టీమిండియా మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌, చహల్‌లు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. విరాట్‌ కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన రోహిత్‌ సేన ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విఫలమైన ధోని ఆసియాకప్‌లోనైనా తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రెండు బ్యాచ్‌లుగా యూఏఈకి
ప్రసుతం తొమ్మిది మంది ఆటగాళ్లు మాత్రమే యూఏఈకి బయల్దేరారు. ఆసియా కప్‌లో పాల్గొనే మిగతా ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది రెండు రోజుల అనంతరం జట్టుతో చేరుతారని.. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ అనంతరం వారు కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం ఇచ్చినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. రోహిత్‌ శర్మతో వెళ్లిన వారిలో ధోని, కుల్దీప్‌, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కేదార్‌ జాదవ్‌, అంబటి రాయుడు, మనీష్‌ పాండే, ఖలీల్‌ అహ్మద్‌లు ఉన్నారు. రెండు రోజుల తర్వాత వెళ్లే బ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, దినేశ్‌ కార్తీక్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శిఖర్‌ ధావన్‌, పాండ్యాలు వున్నారు. ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్‌ దశలో రోహిత్‌ సేన ఈ నెల 18న హాంగ్‌ కాంగ్‌తో, 19న పాకిస్తాన్‌తో తలపడనుంది
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top