ఈ సీఏసీ పదవి నాకొద్దు..!

Rangaswamy Resigns From CAC After Conflict Of Interest Notice - Sakshi

న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ)కి బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్‌ డీకే జైన్‌ శనివారం నోటీసు పంపిన సంగతి తెలిసిందే. కపిల్‌ ఆధ్వర్యంలో అన్షుమన్‌ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్న సీఏసీకి డీకే జైన్‌ నోటీసులు పంపారు. దీనిపై అలిగిన శాంతా రంగస్వామి.. సీఏసీ పదవికి రాజీనామా చేశారు.  దాంతోపాటు భారత క్రికెటర్స్‌ అసోసియేషన్‌కు డైరెక్టర్‌ పదవి కూడా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

అనంతరం శాంతా రంగస్వామి మాట్లాడుతూ.. ‘ సీఏసీ సమావేశం అనేది ఏడాదికి ఒకసారో, రెండేళ్లకు ఒకసారో జరుగుతుంది. మరి దీనికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని ముడిపెట్టడం ఏమిటి. నాకైతే ఏమీ అర్థం కాలేదు. అందుచేత ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు. కాగా, సీఏసీలో తనను చేర్చుకోవడాన్ని గొప్ప గౌరవం భావిస్తున్నానని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లే అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఇదొక చాలా కఠినతరమైన పదవి అని ఆమె తెలిపారు.

ఇటీవల కపిల్‌ నేతృత్వంలోని సీఏసీ కమిటీ.. భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించింది. ఆ క్రమంలోనే ఇందులో సభ్యులుగా ఉన్నవారు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తారనే వాదన వినిపించింది. దాంతో తాజాగా డీకే జైన్‌.. సీఏసీకి నోటీసులు పంపడంతో శాంతా రంగస్వామి కలత చెందారు. ఈ నేపథ్యంలోనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.(ఇక్కడ చదవండి: కపిల్‌ ‘సీఏసీ’కి నోటీసు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top